34.2 C
Hyderabad
April 19, 2024 21: 44 PM
Slider ప్రపంచం సంపాదకీయం

మోడీ ముందా ట్రంప్ కుప్పిగంతులు?

pjimage (13)

తాను మంచి మధ్యవర్తిని అని పదే పదే చెప్పుకుంటున్న అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పాకిస్తాన్ తో భారత్ మాట్లాడేలా చేయడానికే ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తున్నది. జమ్మూ కాశ్మీర్ అంశంపై తాను మధ్యవర్తిత్వం వహిస్తానని గత రెండు నెలల కాల పరిమితిలో ట్రంప్ నాలుగు సార్లు ఆఫర్ ఇచ్చాడు. అయితే మిమ్మల్ని ఈ విషయంలో కష్టపెట్టం లేండి అంటూ భారత్ ఆయన మధ్యవర్తిత్వాన్ని సున్నితంగా తిరస్కరించింది. సున్నితమే కాదు కఠినంగానే తిరస్కరించింది. అయినా సరే ట్రంప్ తన పట్టువీడటం లేదు.

భారత ప్రధాని నరేంద్రమోడీని, పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ను పదే పదే విడివిడిగా కలుస్తున్న ట్రంప్ ఇద్దరి మధ్య మాట కలిపేందుకు ప్రయత్నిస్తున్నారు. కాశ్మీర్ పై ఆయన మధ్యవర్తిత్వాన్ని భారత్ తిరస్కరించడంతో ఆయన కూడా ఆ విషయం వదిలేసి భారత్ పాకిస్తాన్ ప్రధానులిద్దరూ మాట్లాడుకోవాల్సిందిగా సూచిస్తున్నారు. పాకిస్తాన్ ఉగ్రవాదులు 2016లో పఠాన్ కోట్ ఎయిర్ బేస్ పై దాడి చేసిన నాటి నుంచి ఆ దేశంతో దౌత్య సంబంధాలను భారత్ కట్ చేసింది. ఆ తర్వాత ఈ ఏడాది ఫిబ్రవరిలో ఫుల్వామా లో ఆత్మాహుతి దాడి చేసి 40 మంది సిఆర్ పిఎఫ్ జవాన్లను పొట్టన పెట్టుకున్నతర్వాత నుంచి పాకిస్తాన్ తో అన్ని సంబంధాలను భారత్ కట్ చేసేసింది.

కాశ్మీర్ స్వయంప్రతిపత్తికి సంబంధించిన ఆర్టికల్ 370ని రద్దు చేసిన నాటి నుంచి పాకిస్తాన్ భారత్ తో వాణిజ్య సంబంధాలను కూడా వద్దనుకున్నది. ఈ నేపథ్యంలో భారత్ పాకిస్తాన్ ల మధ్య చర్చలు జరిగే అవకాశం కాదు కదా ఇద్దరు ప్రధానులు ఒకరి మొహం ఒకరు చూసుకునే వీలుకూడా లేకుండా పోయింది. ఈ పరిస్థితిని మార్చేందుకు డోనాల్డ్ ట్రంప్ ప్రయత్నిస్తున్నారు. ఫుల్వామా దాడి తర్వాత భారత్ సీరియస్ గా పాకిస్తాన్ కు బుద్ధి చెప్పింది. పాకిస్తాన్ కు చెందిన ఎఫ్ 16 ఫైటర్ జెట్ ను కూల్చి వేసింది.

అయితే దురదృష్టవశాత్తూ భారత్ తన మిగ్ 21 బైసన్ ను కోల్పోయింది. మిగ్ 21 కోల్పొవడమే కాకుండా అభినందన్ వర్తమాన్ ను పాకిస్తాన్ బందీగా పట్టుకునే విధమైన దురదృష్టకర సంఘటన జరిగింది. అభినందన్ ను క్షేమంగా అప్పగించేందుకు ట్రంప్ మధ్యవర్తిత్వం వహించారు. అభినందన్ ను అప్పగించాల్సిందిగా ఆయన పాకిస్తాన్ పై వత్తిడి తీసుకువచ్చారు. ఫలితంగా అభినందన్ విడుదలై భారత్ కు క్షేమంగా తిరిగి వచ్చారు. ట్రంప్ ఈ విషయాలను ప్రస్తావిస్తూ భారత్ పాకిస్తాన్ ప్రధానులను కలిపే ప్రయత్నం చేస్తున్నారు. అయితే పాకిస్తాన్ తో ఎలాంటి సంబంధాలు పెట్టుకోవడానికి కూడా భారత ప్రధాని నరేంద్రమోడీ అంగీకరిస్తున్నట్లుగా కనిపించడం లేదు.

పైగా పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ కూడా ఎప్పటికైనా స్వాధీనం చేసుకుంటామని మోడీ ప్రభుత్వం పదే పదే చెబుతున్నది. దానికి  తోడు పాకిస్తాన్ ప్రధాని ఖాన్ కూడా కాశ్మీర్ కు చెందిన ఆర్టికల్ 370 రద్దు అయిన నాటి నుంచి అంతర్జాతీయ వేదికలపై భారత్ ను అభిశంసించేందుకు విఫలయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఖాన్ చేస్తున్న ప్రయత్నాలు భారత్ కు మరింత చీకాకు తెప్పిస్తున్నాయి. అయితే అంతర్జాతీయ వేదికలపై ఎంతో పటిష్టంగా ఉన్న భారత్ ఈ విధమైన పాకిస్తాన్ ప్రచారాన్ని సులభంగానే తిప్పికొడుతున్నది. నిప్పు నీరులా ఉన్న భారత్ పాకిస్తాన్ సంబంధాలను ట్రంప్ మెరుగు పరుస్తానని చెబుతున్నాడు. అసలు అమెరికాకు ఈ రెండు దేశాల మధ్య రాజీకుదర్చాల్సిన అవసరం ఏమిటి? పాకిస్తాన్ తో మంచిగా ఉంటే తప్ప అమెరికా సేనలు ఆఫ్ఘనిస్థాన్ నుంచి ఉపసంహరించే వీలు కుదరదు. పాకిస్తాన్ సాయం లేకుండా అమెరికా గౌరవంగా ఆ సమస్య నుంచి బయటపడలేదు. పాకిస్తాన్ తో మంచి సంబంధాలు నెరపేందుకు భారత్ తో కయ్యం పెట్టుకోలేదు. అందుకే ట్రంప్ తన స్థాయిని తగ్గించుకుని అయినా సరే పాకిస్తాన్ ప్రధాని తో పదే పదే మాట్లాడుతున్నాడు. అయితే అంతర్జాతీయంగా అత్యంత పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నమోడీ ముందు ట్రంప్ ఆటలు సాగవని చెప్పవచ్చు

Related posts

ప్రేమా వర్ధిల్లు

Satyam NEWS

కొవిడ్-19 మెడికల్ సేఫ్టీ కిట్ అందజేసిన శ్రీనివాసన్ సర్వీసెస్ ట్రస్ట్

Satyam NEWS

వేతనాల పెండింగ్ బిల్లులు వెంటనే విడుదల చేయాలి

Satyam NEWS

Leave a Comment