39.2 C
Hyderabad
March 29, 2024 15: 16 PM
Slider తెలంగాణ ప్రత్యేకం

ఆలోచన ఆగదు అడుగు ముందుకు పడదు

KCR Facebook new_0

టిఆర్ఎస్ పార్టీలో ఏం జరుగుతున్నది? కచ్చితంగా ఏం జరుగుతున్నదో తెలియడం లేదు కానీ ఏదో మాత్రం జరుగుతున్నది. పైకి ఏమీ కనిపించకపోయినా లోలోన మాత్రం పార్టీ మగ్గిపోతున్నట్లుగా కనిపిస్తున్నది. రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ గ్రూపులుగా విడిపోయి ఉన్నట్లు స్పష్టంగా కనిపిస్తున్నది. ఒరిజినల్ టిఆర్ఎస్, కాంగ్రెస్ టిఆర్ఎస్, తెలుగుదేశం టిఆర్ఎస్ లుగా పార్టీ విభజన కనిపించడం మంచి పరిణామం అని పించడం లేదు.

పార్టీ కోసం పని చేస్తున్న వారిని కాదని ఇతర పార్టీల వారిని చేర్చుకోవడంతో మొదలైన ఈ విభజన రానురాను పెరిగిపోయింది. ఇప్పుడు ఎవరూ తీర్చలేని సమస్యగా మారిపోయింది. కేసీఆర్ పార్టీ పగ్గాలను తన కుమారుడు కేటీఆర్ కు అప్పగించిన నాటి నుంచి ఈ విభజన మరింతగా కనిపించడం ఆరంభమైంది. అన్నీ సర్దుకుంటాయిలే అనుకున్న రోజుల నుంచి ఇవి సర్దు కుంటాయా అనే స్థాయికి జిల్లాల్లో పార్టీ నాయకుల మధ్య విభేదాలు పెరిగిపోవడం నిజమైన పార్టీ అభిమానులకు రుచించడం లేదు.

తెలుగుదేశం టిఆర్ఎస్ వారు కేసీఆర్ తో నేరుగా మాట్లాడుతుండగా, కాంగ్రెస్ టిఆర్ఎస్ వారు నేరుగా కేటీఆర్ తో మాట్లాడుకుంటున్నారు. వీరిద్దరి మధ్య ఒరిజినల్ టిఆర్ఎస్ వారికి స్థానం దొరకడం లేదు. దాంతో వారు ఈటల రాజేందర్, హరీష్ రావు లాంటి వారి వైపు ఆశగా చూస్తున్నారు. ఈటల రాజేందర్ ఇటీవల తనపై కుట్రపూరితంగా రెండు పత్రికలలో వార్తలు వచ్చిన నాటి నుంచి తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఆ ఆగ్రహం ఎవరి మీదో తెలియదు. అయితే ఆయన పరోక్షంగా చేసిన విమర్శలు పార్టీ అట్టడుగున ఉన్నకార్యకర్తలకు అర్ధం అయ్యాయి.

పార్టీ లో ఉన్నత స్థానాలలో ఉన్న నాయకులు ఏదైనా మాట్లాడితే అది మధ్య స్థాయి నాయకులతో ఆగిపోతే పార్టీ మనుగడకు ఎలాంటి ప్రమాదం ఉండదు. అలా కాకుండా నేరుగా కిందిస్థాయి కార్యకర్తకు మెసేజ్ వెళ్లిపోతే పార్టీ కి బీటలు వారుతున్నట్లుగా భావించాల్సి ఉంటుంది. కేసీఆర్ కను సైగతో ఇవన్నీ ఆగిపోతాయి – అని చాలా మంది అనుకుంటున్నారు. అయితే ఆయన కను సైగ ఎటు చేస్తారు? అనేదే ఇప్పుడు ప్రధాన ప్రశ్న.

ఈటల వైపు కనుసైగ చేస్తారా? కేటీఆర్ వైపు కనుసైగ చేస్తారా అనేది ఇప్పుడు తేలాల్సి ఉంది. ఈటల రాజేందర్ తన మంత్రి పదవి పైనే వ్యాఖ్యలు చేయడం పార్టీలో ఏదో జరుగుతున్నదనడానికి సంకేతం. ఈటల ఒక్కరే ఇలాంటి అభిప్రాయంతో ఉన్నారా? లేక పార్టీలో మరి కొంత మంది మంత్రులు, ఎంఎల్ఏలు ఇదే రకమైన అభిప్రాయంతో ఉన్నారా అనేది తేలాల్సి ఉంది. పార్టీపైనా, ప్రభుత్వం పైనా పూర్తి స్థాయి పట్టు ఉన్న కేసీఆర్ ఎటు మొగ్గితే అటు బేరం తూగుతుందనే విషయం అందరికి తెలిసిందే అయినా ఈ సారి మాత్రం రెండో వర్గం మిన్నకుండే పరిస్థితి కనిపించడం లేదు.

ఇది అర్ధం అయినందుకేనేమో కేసీఆర్ మంత్రి వర్గ విస్తరణ లేదా పునర్ వ్యవస్థీకరణ చేయలేకపోతున్నారు. మంత్రివర్గ విస్తరణ చేయడానికి కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ పదే పదే ఆలోచించాల్సి రావడం ఊహించని పరిణామం. అన్ని ముఖ్యమైన శాఖలూ ముఖ్యమంత్రి వద్దే ఉన్నందున మంత్రివర్గ విస్తరణ అత్యవసరం. రాష్ట్రంలో ఎక్కడా పనులు జరగడం లేదు. ముఖ్యమంత్రి చూస్తే చూసినట్లు తప్ప పట్టించుకునే నాథుడే కనిపించడం లేదు.

పోనీ అధికారుల రాజ్యం అన్నా నడుస్తున్నదా అంటే అది కూడా ఈ పరిస్థితుల్లో మంత్రివర్గ విస్తరణ అనివార్యమేకానీ ఎలా చేయాలి? కేటీఆర్ ను హరీష్ రావును ఇద్దరినీ మంత్రి వర్గంలోకి తీసుకోవాలా? కేవలం కేటీఆర్ ఒక్కరినే మంత్రి వర్గంలోకి తీసుకుంటే హరీష్ రావు పరిస్థితి ఏమిటి? కేటీఆర్ చేతిలో పార్టీ పగ్గాలు ఉన్నాయి కాబట్టి ఒక్క హరీష్ రావుకే మంత్రి పదవి ఇస్తే ఎలా ఉంటుంది? ఇద్దరికి మంత్రి పదవి ఇవ్వకుండా మంత్రి వర్గ విస్తరణ చేయడం వల్ల ప్రయోజనం ఏమిటి?

ఈటల రాజేందర్ లాంటి వారిని మంత్రి పదవి నుంచి తొలగించాలంటే దానికి పరిహారంగా హరీష్ రావును మంత్రిగా తీసుకోవాల్సి ఉంటుందా? ఈటలకు, హరీష్ కూ ఇద్దరికి మంత్రి పదవులు ఇవ్వకుండా పోతే పరిస్థితి ఎలా మారుతుంది? ఈటల, కేటీఆర్, హరీష్ లను దాటి మంత్రి వర్గం గురించి ఆలోచించే పరిస్థితి లేదనే విషయం కేసీఆర్ కు కూడా తెలుసు. అందుకే ఈ ఆలోచనలు ఎడతెగడం లేదు. అడుగు ముందుకు పడటం లేదు.

అడుగు మందుకు పడకుండా ఎక్కువ కాలం వేచి చూసే పరిస్థితి లేదని గులాబి జెండా వారసులు అంటున్నారు.

Related posts

సేవా సంస్థలకు మంతెన వెంకట రామరాజు విరాళం

Satyam NEWS

వ్యాక్సిన్ రాలేదు కాబట్టి ముందు జాగ్రత్తలే ముఖ్యం

Satyam NEWS

గంజాయి సాగుపై ఏపీ డీజీపీ ఆసక్తి కర వ్యాఖ్యలు…!

Satyam NEWS

Leave a Comment