31.7 C
Hyderabad
April 19, 2024 01: 38 AM
Slider ముఖ్యంశాలు

టీయూడబ్ల్యూజేతోనే ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు

IJU electronic media

జర్నలిస్టుల సంక్షేమం కోసం పాలకులతో లాలూచీ పడకుండా అంకితభావంతో అవిశ్రాంతంగా శ్రమిస్తున్న తెలంగాణ స్టేట్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (టీయూడబ్ల్యూజే-ఐజేయూ) వెంటే తమ ప్రయాణం కొనసాగుతుందని పలువురు ఎలక్ట్రానిక్ మీడియా సీనియర్లు స్పష్టం చేశారు.

మంగళవారం నాడు బషీర్ బాగ్ లోని టీయూడబ్ల్యూజే కార్యాలయంలో నిర్వహించిన ఎలక్ట్రానిక్ మీడియా విభాగం ముఖ్య సమావేశానికి రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుండి ఎలక్ట్రానిక్ మీడియా కు చెందిన సీనియర్ జర్నలిస్టులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టీయూడబ్ల్యూజే గొడుగు క్రింద ఎలక్ట్రానిక్ మీడియా విభాగాన్ని మరింత బలోపేతం చేసేందుకు ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. నియోజకవర్గ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు ఎలక్ట్రానిక్ మీడియా కార్యకలాపాలను ఉధృతం చేసే దిశలో చర్యలు చేపట్టాలని వారు సూచించారు.

క్షేత్ర స్థాయిలో ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టుల కష్టాలు వర్ణనాతీతంగా ఉంటున్నాయని, కంటి నిండా నిద్ర లేకుండా, కడుపు నిండా తిండి లేకుండా విధినిర్వహణలో 24 గంటలు అప్రమత్తంగా ఉంటూ అంకితాభావంతో పనిచేస్తుంటారని వారు తెలిపారు. పని ఒత్తిడితో ఇప్పటికే పలువురు జర్నలిస్టులను రోడ్డు ప్రమాదాల్లో, అనారోగ్య సంఘటనల్లో కోల్పోయామని వారు ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై టీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షులు నగునూరి శేఖర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.విరాహత్ అలీ, ఉప ప్రధాన కార్యదర్శి విష్ణుదాస్ శ్రీకాంత్ లు స్పందిస్తూ, ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు వర్కింగ్ జర్నలిస్టుల చట్టం పరిధిలో లేకున్నప్పటికీ ప్రింట్ మీడియా జర్నలిస్టులతో సమానంగా నాడు ఉమ్మడి రాష్ట్రంలో, నేడు తెలంగాణ రాష్ట్రంలో వారి సంక్షేమానికి తమ సంఘం పెద్దపీట వేస్తున్నట్లు వారు స్పష్టం చేశారు.

 ఇందులో భాగంగానే ఎలక్ట్రానిక్ మీడియాను వర్కింగ్ జర్నలిస్టుల చట్టం పరిధిలోకి తేవాలంటూ దశాబ్దకాలంగా ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్ (ఐజేయు) దేశ స్థాయిలో పోరాడుతుందని వారు చెప్పారు. రాష్ట్రంలో ఎలక్ట్రానిక్ మీడియా విభాగాన్ని మరింత పటిష్ట పరిచే దిశలో టీయూడబ్ల్యూజే-ఐజేయూ యుద్ధప్రాతిపదికన చర్యలు చేపడుతుందన్నారు.

ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 2,000 మంది ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు తమ సంఘంలో క్రియాశీలక సభ్యులుగా కొనసాగుతున్నారని, త్వరలో సభ్యత్వాలను మరింత పెంచుకొని, జాతీయ ఎలక్ట్రానిక్ మీడియా ప్రముఖుల సమక్షంలో రాష్ట్ర స్థాయి ఎలక్ట్రానిక్ మీడియా సదస్సును ఏర్పాటు చేస్తామని శేఖర్, విరాహత్, శ్రీకాంత్ లు వెల్లడించారు.

 ఐజేయూ కార్యదర్శి వై.నరేందర్ రెడ్డి మాట్లాడుతూ జర్నలిస్టుల సంక్షేమం కోసం దేశ స్థాయిలో ఐజేయూ, రాష్ట్రంలో టీయుడబ్ల్యుజె సంఘాలు మాత్రమే అవిశ్రాంతంగా ఉద్యమిస్తున్నట్లు చెప్పారు. దేశంలో ప్రప్రథమంగా ఉమ్మడి రాష్ట్రంలో ఎలక్ట్రానిక్ మీడియా విభాగాన్ని ఏర్పాటు చేసిన ఘనత నాటి ఏపీయూడబ్ల్యూజే కే దక్కిందని ఆయన స్పష్టం చేశారు.

 ఇంకా ఈ సమావేశంలో టీయూడబ్ల్యూజే రాష్ట్ర ఉపాధ్యక్షులు దొంతు రమేష్, రాంనారాయణ, రాష్ట్ర రాజధాని హైదరాబాద్ తో పాటు ఆయా జిల్లాల్లో పనిచేస్తున్న Tv9, Tv5, Hmtv, sakshi, Ntv, Inews, V6, CVR, Etv, Abn, 99Tv, prime9, maha news, bharath today, metro, zee news (national) ANI (National)తదితర ఛానెల్స్ లో పనిచేస్తున్న సీనియర్ ప్రతినిధులు, ఇన్ పుట్ ఎడిటర్లు, బ్యూరో చీఫ్ లు 100 మంది హాజరై సలహాలు, సూచనలు అందించారు.

Related posts

శోభాయమానంగా పిల్లలమర్రి దేవాలయాలు

Murali Krishna

హుకుం పేటలో పరిస్థితి ని పరిశీలించిన విజయనగరం ఎస్పీ

Satyam NEWS

రానున్నమ‌రో తుపాను!

Sub Editor

Leave a Comment