28.7 C
Hyderabad
April 20, 2024 07: 39 AM
Slider సంపాదకీయం

తెంపరి ట్రంప్ కు అమాయక భారత ప్రజల ఘన స్వాగతం

Trump and Modi

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ భారత్ పర్యటనకు ఎందుకు వచ్చాడు? డోనాల్ట్ ట్రంప్ ఏదైనా ఘనకార్యం సాధించాడా? లేదా మనకు ఏదైనా మేలు చేశాడా? లేదూ భారత్ ఏదైనా ఘన కార్యం సాధించిందా? ఇవేవీ లేవు. కేవలం భారత ప్రధాని నరేంద్రమోడీతో ఉన్న స్నేహ బంధం మేరకు అమెరికా అధ్యక్షుడు భారత్ వచ్చాడు.

అంతే. అమెరికాలో ఈ ఏడాది సెప్టెంబర్ లో అధ్యక్ష ఎన్నికలు జరగబోతున్నాయి. అధ్యక్ష ఎన్నికలలో భారత సంతతి ప్రజలు అధిక సంఖ్యలో ఉన్నారు. అందులోనూ కూడా గుజరాత్ నుంచి అమెరికాలో ఉన్న భారత సంతతి ఎక్కువ. వాళ్లను టార్గెట్ చేసుకుని డోనాల్డ్ ట్రంప్ ఇక్కడకు వచ్చాడు.

అంతకు ముందు మోడీ హౌడీ కార్యక్రమాన్ని గత సెప్టెంబర్ లో హ్యూస్టన్ లో నిర్వహించారు. దీనికి కారణం కూడా ఇదే. భారత సంతతి వ్యాపారులు, ఉద్యోగులు ఎక్కువగా ఉన్న ఆ ప్రాంతంలో నరేంద్ర మోడీని పిలిచి మోడీ హౌడీ కార్యక్రమాన్ని నిర్వహించాడు ట్రంప్. అది కేవలం ఎన్నికల ప్రచారంలాగానే సాగింది.

ఇప్పుడూ అదే జరుగుతున్నది. ట్రంప్ భారత్ కు చేసిన మేలు ఏమిటో తెలుసా? 2018 వరకూ భారత్ ఇరాన్ నుంచి క్రూడ్ ఆయిల్ కొనుగోలు చేసేది. అమెరికా ఆంక్షల కారణంగా ఇరాన్ నుంచి క్రూడ్ ఆయిల్ కొనుగోలును ఆపేయాల్సి వచ్చింది. దీనివల్ల మన దేశంలో పెట్రోలు, డీజిల్ ధరలు పెరిగిపోయాయి. ఇరాన్ నుంచి క్రూడ్ ఆయిల్ ను రూపాయలలోనే కొనుగోలు చేసేవాళ్లం. ఇప్పుడు డాలర్లలో కొనుగోలు చేయాల్సి వస్తున్నది.

ఈ కారణంగా ఆయిల్ రేటు పెరిగిపోతూ ఉన్నది. హెచ్ 1 బి విసాల విషయానికి వస్తే భారత్ కు చెందిన ఐటి సాంకేతిక నిపుణుల ను అమెరికా అధిక సంఖ్యలో రిజెక్టు చేస్తున్నది. 2015 లో భారత్ కు చెందిన ఐటి సాంకేతిక నిపుణుల వీసా తిరస్కరణ లు 5 శాతం ఉండేవి కాగా ఇప్పుడు అది 24 శాతానికి పెరిగింది.

దీనితో అమెరికాలోని భారతీయుల ఐటి కంపెనీలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. భారత్ నుంచి అమెరికా వెళ్లే ఐటి నిపుణుల సంఖ్యలో కూడా గణనీయంగా తేడా వచ్చింది. ఇది భారత్ పై పెను ప్రభావం చూపుతున్నది. ఇదంతా ట్రంప్ నిర్వాకమే. 1974 నుంచి ఉన్న డ్యూటీ ఫ్రీ ఎగుమతులను 2019 జూన్ 5 నుంచి ట్రంప్ రద్దు చేశాడు.

దాంతో భారత్ నుంచి ఎక్కువగా ఎగుమతి చేసే బియ్యం, తోలు వస్తువులు, జ్యువెలరీ, జెమ్స్ పై తీవ్ర ప్రభావం పడింది. భారీ ఎత్తున ఎగుతమతులు నిలిచిపోయాయి. అదే విధంగా భారత్ నుంచి ఉక్కు ఎగుమతులను కూడా ట్రంప్ తీరని దెబ్బ తీశారు. ఇంపోర్టు డ్యూటీ 25 శాతం పెంచడంతో ఉక్కు ఎగుమతులు బాగా తగ్గిపోయాయి. ఇది భారత్ కు తీరని నష్టం కలిగిస్తున్నది. భారత్ మాత్రం అధిక ధరలకు అమెరికా నుంచి ఆయుధ సంపత్తి కొనుగోలు చేస్తున్నది.

ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ అడుగుతున్నదని ఆ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీని ట్రంప్ కు రాష్ట్రపతి ఇచ్చే ఆతిథ్యానికి పిలవలేదు. భారత దేశానికి ఇంత ‘‘మేలు’’ చేసిన ట్రంప్ కు ఆయన కుటుంబ సభ్యులకు ఘన స్వాగతం లభించింది. విమానాశ్రయం నుంచి సబర్మతీ ఆశ్రమం వరకూ దారి పొడవునా ఎండను కూడా లెక్క చేయకుండా జనం రోడ్డు పక్కన నిలబడి ట్రంప్ కు స్వాగతం పలికారు.

అహ్మదాబాద్ నగరం జనంతో కిక్కిరిసిపోయింది. మెతెరా స్టేడియం మోతెక్కింది. దాదాపుగా వంద కోట్లు ఖర్చు పెట్టి అమెరికా అధ్యక్షుడికి భారత ప్రభుత్వం స్వాగతం చెబుతున్నది. వీలైతే కోడి కాళ్లను చౌర ధరకు అమ్మేందుకు ప్రయత్నిస్తున్నది. జయహో భారత్.

సత్యమూర్తి పులిపాక చీఫ్ ఎడిటర్ సత్యం న్యూస్.నెట్

Related posts

బీజేపీ జెండా కూల్చిన వారిపై చర్యలకు డిమాండ్

Bhavani

మాఫియాల రాజ్యంగా మారిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం

Satyam NEWS

మేడే: కార్మికులకు నిత్యావసర వస్తువుల పంపిణీ

Satyam NEWS

Leave a Comment