36.2 C
Hyderabad
April 24, 2024 21: 57 PM
Slider ప్రత్యేకం

గోవిందో గోవిందా: అయ్యో గాజు బాటిళ్ల ప్లాన్ పగిలిపోయిందే!

TTD Naveen

ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన తిరుమల కొండపై అమలు చేసే విధానాలు భక్తులు మెచ్చేలా ఉండాలి తప్ప అధికారుల సొంత పరపతి పెంచుకునే దిశగా ఉండకూడదు. తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటే అందరూ నవ్వులపాలు అవుతారు. అందుకు గాజు వాటర్ బాటిల్స్ ఉదంతమే నిదర్శనం.

తిరుమల కొండ పరమ పవిత్రమైనదని అందువల్ల అక్కడ ప్లాస్టిక్ వాడకం నిషేధించాలని అనుకున్నారు. దీనికి ఎలాంటి అభ్యంతరం కూడా ఉండదు. అయితే అందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి నిర్ణయాలు అమలు చేయాలి. అలా కాకుండా ప్లాస్టిక్ నిషేధం పేరుతో గాజు సీసాలు ప్రవేశ పెట్టాలని ఒక అనాలోచిత నిర్ణయాన్ని టిటిడి అధికారులు తీసుకున్నారు.

గాజు సీసాలను ఎలా వాడతారు అవి పగిలితే జరిగే నష్టం ఎంత అనేది ఎవరూ ఆలోచించలేదు. తిరుమల కొండపై ఎక్కడైనా గాజు వాటర్ బాటిల్స్ పగిలితే అధికారులకు ఎవరు సమాచారం ఇస్తారు? ఎంత సమయంలో పగిలిన ఆ గాజు బాటిల్స్ శుభ్రం చేస్తారు? అన్నదానిపై ఆలోచన లేకుండా నిర్ణయం తీసుకున్నారు.

టిటిడి కాటేజీల్లో గాని తిరుమల కొండపై గాని గాజు వాటర్ బాటిల్ తీసుకొని వెళ్లేటప్పుడు పొరపాటున పడి పగిలిపోతే పాదరక్షలు లేకుండా తిరిగే యాత్రికులకు ఆసౌకర్యం కలుగుతుంది. అలాగే కాటేజీలో లో గాజు బాటిల్స్ పగిలితే దాన్ని పరిశుభ్రం చేసేంత వరకు ఇతరులకు రూమ్ అలాట్ చేసేదానికి అవకాశం ఉండదు.

తిరుమల కొండపై గాజు బాటిల్ నీటి విక్రయాలు అత్యంత ప్రమాదకరం. తిరుమల కాటేజీల్లో చిన్నపిల్లలు, వయసు మళ్ళిన పెద్దల చేతి నుంచి గాజు నీళ్ల బాటిల్స్ జారి పడితే గాయాలు అయ్యే ప్రమాదం ఉంది. తిరుమలకు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే చాలా మంది భక్తులు ముఖ్యంగా చిన్నపిల్లలు పుట్టు వెంట్రుకలు శ్రీవారికి సమర్పించేందుకు వచ్చినప్పుడు త్రాగే నీరు మారినప్పుడు జలుబు దగ్గు జ్వరాలు, గొంతుకు సంబంధించిన వ్యాధులు వస్తాయన్న భయంతో ఏ ప్రాంతానికి వెళ్లినా వాటర్ బాటిల్స్ లేక వేడిచేసిన నీటిని తాగించడం సర్వ సాధారణం.

తిరుమల కొండపై ప్లాస్టిక్ కూల్ డ్రింక్ బాటిల్స్, శ్రీవారి లడ్డూ కవర్లు, కర్పూరం, పాల ప్యాకెట్ లు, కొండపై షాపులలో విక్రయిస్తున్న ఆట బొమ్మలకు ప్లాస్టిక్ ప్యాకింగ్ వినియోగిస్తున్నారన్న విషయం టిటిడి ఉన్నతాధికారులకు కనపడలేదా? వాటిని నిషేధించకుండా కేవలం వాటర్ బాటిల్లు మాత్రమే నిషేధిస్తే ప్లాస్టిక్ అంతం అయిపోతుందా?

ఇవేవీ ఆలోచించకుండా అనాలోచితంగా ఒకరిద్దరు అధికారులు నిర్ణయం తీసేసుకున్నారు. గాజు వాటర్ బాటిళ్లు భారీ ఎత్తున ఆర్డర్ ఇచ్చేందుకు కూడా సిద్ధపడ్డారు. గాజు వాటర్ బాటిల్స్ ఆర్డర్ లో భారీ ముడుపులు అందుకోవాలని స్కెచ్ వేశారు. అయితే తిరుమలలో గాజు వాటర్ బాటిల్స్ ముడుపులలో వాటాలు పంచుకోవడంలో తేడా రావడంతో ఈ స్కీమ్ ను తాత్కాలిక నిలుపుదల చేశారని రాయలసీమ పోరాట సమితి కన్వీనర్ నవీన్ కుమార్ రెడ్డి ఆరోపించారు.

టిటిడి చైర్మన్ వై వి సుబ్బారెడ్డి చొరవతో తాత్కాలిక బ్రేక్ వేయడం శుభపరిణామమని ఆయన వ్యాఖ్యానించారు. గాజు వాటర్ బాటిల్స్ వ్యవహారంపై ప్రభుత్వ విజిలెన్స్ తో విచారణ జరిపిస్తే అసలు విషయాలు బయటకు వస్తాయని ఆయన అన్నారు. తిరుమలలో ప్లాస్టిక్ నిషేధానికి ప్రత్యామ్నాయం చూపకుండా ప్లాస్టిక్ నీళ్ల బాటిల్స్ ను నిషేధించడం టీటీడీ ఉన్నతాధికారుల ఓవరాక్షన్ కు నిదర్శనమని ఆయన అన్నారు.

టిటిడి లోని కొంతమంది ఉన్నతాధికారులు ఆరోగ్య శాఖ అధికారులు మ్యాచ్ ఫిక్సింగ్ టిటిడి చైర్మన్ దృష్టికి వెళ్లడంతో కథ అడ్డం తిరిగిందని ఆయన అన్నారు. తిరుమల కొండపై భక్తులు వినియోగిస్తున్న ప్లాస్టిక్ బాటిల్ లను కాకుల కోన వద్ద గల డంపింగ్ యార్డుకు తరలించకుండా ఎప్పటికప్పుడు తిరుపతికి తరలించి దానిని నిర్వీర్యం చేసేందుకు ప్రత్యామ్నాయ చర్యలు టీటీడీ చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు.

పద్మావతి కాటేజీల ఏరియాలో ఆర్వో సిస్టం త్రాగు నీటి కారణంగా భక్తులు ఎదుర్కొంటున్న బాధలను గత రెండు నెలలుగా ప్రత్యక్షంగా గమనించిన వి.ఐ.పి లు,  మంత్రులు,ఎమ్మెల్యేలు, అత్యున్నత న్యాయమూర్తులు విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వ పెద్దలకు,ధర్మకర్తల మండలి చైర్మన్ దృష్టికి తీసుకెళ్లడంతో తిరుమల అధికారులపై ప్రభుత్వం మొట్టికాయలు వేయడంతో గాజు నీటి బాటిల్స్ వ్యవహారం ముందుకు తెచ్చారు. అందులో కుంభకోణం చేసేందుకు ప్రయత్నించారని ఆయన అన్నారు.

Related posts

సంఘ సంస్కర్త సావిత్రీబాయి పూలే సేవలు చిరస్మరణీయం

Satyam NEWS

బర్త్ డే గిఫ్ట్: శాంతిభద్రతలకు చిహ్నంగా పచ్చని మొక్క నాటిన సీఐ

Satyam NEWS

ఉత్తరప్రదేశ్ లో పడవ ప్రమాదం

Murali Krishna

Leave a Comment