38.2 C
Hyderabad
April 25, 2024 12: 22 PM
Slider సంపాదకీయం

ప్రువ్డ్ కరెక్ట్ : విమర్శకులూ సత్యం న్యూస్ చెప్పిందే నిజమైంది

amaravathi smash

ఈ నెల 18న సత్యం న్యూస్ ఒక ప్రధాన వార్తను పోస్టు చేసింది. అదేమిటంటే ‘అమరావతి పేరు కూడా వినిపించకుండా పక్కా ప్లాన్’ అనే శీర్షికతో వచ్చింది. అమరావతి భూములను పేదలకు పంచి పెట్టేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సమాయత్తం అయిందని వెల్లడిస్తూ సత్యం న్యూస్ వెల్లడించిన సమగ్ర కథనం.

ఇళ్ల స్థలాలు కేటాయించేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయం ఎంత భయంకర పరిస్థితులకు దారి తీస్తుందో సత్యం న్యూస్ విశ్లేషించి చెప్పింది. ఈ వార్త పోస్టు చేసినందుకు పలువురు పలు రకాల వ్యాఖ్యలు చేశారు. తెలుగుదేశం వాళ్లు చెబితే ఈ వార్త రాశామని వ్యాఖ్యానించారు. నువ్వు కమ్మోడివా అని కొందరు ప్రశ్నించారు.

ఇంకొందరు మరొక అడుగు ముందుకు వేసి పరుష పదజాలం వాడారు. సాక్షిలో పని చేసే ఒక సీనియర్ జర్నలిస్టు అయితే విమర్శనాత్మకంగా కామెంట్ చేశాడు. తలా తోకాలేని వార్త అంటూ పరుషంగా మాట్లాడాడు. ఈ రోజు సత్యం న్యూస్ చెప్పింది నిజమైంది.

సత్యం న్యూస్ ఏ రాజకీయ పార్టీకో ఏ కులానికో వంతపాడేది కాదని ఇప్పటికే చాలా సార్లు చెప్పాం. మళ్లీ చెబుతున్నాం. చంద్రబాబు సమయంలో ఏ మీడియా బయటకు తీసుకురానన్ని విషయాలను సత్యం న్యూస్ బయటపెట్టిందనే విషయం కూడా అందరికి తెలుసు. ఇప్పుడు అసలు విషయానికి వద్దాం.

ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ‘పేదలందరికీ ఇళ్లు’ కార్యక్రమంలో భాగంగా రాజధాని పరిధిలో సేకరించిన భూముల వివరాలను విడుదల చేసింది. ఈ మేరకు  కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని అర్హులకు రాజధాని ప్రాంతంలో ఇళ్ల స్థలాల పంపిణీకి సంబంధించి జీవో విడుదల చేసింది. దీనికోసం సీఆర్డీఏ పరిధిలోని తాడేపల్లి, పెదకాకాని, మంగళగిరి, దుగ్గిరాల మండలాలతో పాటు విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్‌లో భూములు సేకరించారు.

మొత్తం 54,307మంది లబ్ధిదారులకు 1251.5 ఎకరాలు ఇవ్వనున్నట్టు ప్రభుత్వం తెలిపింది. నౌలూరు, కృష్ణాయపాలెం, నిడమర్రు, ఐనవోలు, కురగల్లు, మందడంలో భూములను అర్హులకు ఇవ్వనున్నారు.ఇదీ వార్త.

సత్యం న్యూస్ ఈ నెల 18న పబ్లిష్ చేసిన పోస్టు యధాతధంగా : అమరావతిని తరలించడమే కాదు అమరావతిని సర్వ నాశనం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నది. అమరావతి అనే పేరు వినిపించకుండా చేసేందుకు వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం పావులు కదుపుతున్నది.

రాజధాని అమరావతిలోనే ఉండాలని ఉద్యమం చేస్తున్న రాజధాని గ్రామాల ప్రజలపైకి వేరే ప్రాంత ప్రజలను యుద్ధానికి పంపుతున్నది. అమరావతి భూములలో దాదాపు నాలుగు వేల ఎకరాలను పేదలకు పట్టాలుగా పంచి పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం సమాయత్తమైందనే వార్తలు గుప్పు మనడంతో రాజధాని ప్రాంతాల రైతులు అలోలక్ష్మణా అంటూ ఏడుస్తున్నారు.

రాజధాని తరలి పోవడం ఒక ఎత్తు అయితే రాజధాని ప్రాంతంలో పేదలకు పట్టాలు ఇచ్చేయడం మరొక ఎత్తు. పేదలకు పట్టాలు ఇచ్చేస్తే వారు వచ్చి ఆక్రమించుకుంటారు. దాంతో అమరావతి ప్రాంతంలో అంతర్యుద్ధం తప్పని పరిస్థితులు ఏర్పడతాయి. వేరే ఊరుకు చెందిన ప్రజలు తమకు ప్రభుత్వం ఇచ్చిన ప్రాంతాన్ని ఆక్రమించుకోవడానికి ప్రయత్నిస్తారు, దాన్ని అమరావతి ప్రాంత ప్రజలు అడ్డుకుంటే అంతర్యుద్ధం తప్పదు.

అమరావతి ప్రాంత రైతులు బాగా బలిసిన వారని అందుకే పేద ప్రజలకు భూములు ఇస్తుంటే అడ్డుకుంటున్నారని వైసిపి నేతలు చెప్పడం మొదలు పెడతారు. ఈ సమస్య మరింత తీవ్ర తరం అయి అమరావతి సర్వ నాశనం అయిపోతుంది. దాదాపు నెల కిందటే అమరావతి భూములను పదారం చేయాలనే ప్రతిపాదన పెట్టారు. అయితే ఆ విషయం బయటకు రాలేదు.

గ్రామ సచివాలయం అధికారులు విజయవాడ గుంటూరు పట్టణాలలో భూముల కోసం అర్జీ పెట్టుకున్న పేదల నుంచి అమరావతి గ్రామాలకు వెళ్లేందుకు సిద్ధమా అనే అభిప్రాయ సేకరణ మొదలు పెట్టేసరికి విషయం అమరావతి రైతులకు తెలిసింది. దాంతో వారి కలలు పటాపంచలు కావడమే కాకుండా సాటి ప్రజలతో పోరాడే స్థితికి తమను ప్రభుత్వం తీసుకువస్తున్నదని గ్రహిస్తున్నారు.

తాము భూములు ఇస్తే తమ ప్రాంతం సింగపూర్ హాంకాంగ్ లాగా అవుతుందని కలలు కన్నారు. ఇప్పుడు రాజధాని అక్కడ నుంచి వెళ్లిపోవడమే కాకుండా తమ భూములను అందరికి పంచే వ్యూహాన్ని అమలు చేస్తున్న ప్రభుత్వాన్ని ఏమనాలో వారికి అర్ధం కావడం లేదు.

కసితో కక్షతో ప్రవర్తిస్తున్న ప్రభుత్వాన్ని ఏం చేయాలో వారికి అర్ధం కావడం లేదు. నాలుగు వేల ఎకరాలు పేదవారికి పట్టాలు గా ఇచ్చేస్తే లక్షల సంఖ్యలో అక్కడకు జనాభా వచ్చేస్తారు. వారంతా కాలకృత్యాలు తీర్చుకోవడానికి, చెత్త డంప్ చేయడానికి, ఉపయోగించిన ప్లాస్టిక్ ను పడేయడానికి కృష్ణానదిని వాడితే ఇక కృష్ణమ్మ తల్లి కనుమరుగైపోతుంది.

 కృష్ణా నది గర్భంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సమయంలోనే కొందరు బడాబాబులు పెద్ద పెద్ద భవనాలు అక్కడ నిర్మించారు. ఆ తర్వాత ముఖ్యమంత్రి అయిన చంద్రబాబునాయుడు వాటిని పట్టించుకోకపోగా వాటికి మద్దతుగా నిలిచారు. దాంతోనే కృష్ణ నది వినాశనం ప్రారంభం అయింది.  వైఎస్ జగన్ ముఖ్యమంత్రి కాగానే ఆ భవనాలన్నింటిని కూలగొట్టి కృష్ణా నదిని కాపాడతానని చెప్పారు. దానికి అందరూ మద్దతు పలికారు. అక్కడ ఉన్న భవనాలను ఇంచు కూడా ఆయన కదిలించలేకపోయారు. ఇప్పుడు ఆ ప్రాంతం మొత్తాన్ని జనాలతో నింపేసేందుకు ప్లాన్ సిద్ధం చేస్తున్నారు. నడి ఓడ్డున రాజధాని కడితే మునిగిపోతుందని చెప్పిన జగన్ ప్రభుత్వం అక్కడ పేదలకు పట్టాలు ఎలా ఇస్తుంది? నది పొంగి పేదలంతా మునిగిపోతే ఫర్వాలేదా? ప్రజల పైకి ప్రజలనే రెచ్చగొట్టి చోద్యం చూసే ప్లాన్ ఇది.

Related posts

బాధిత కుటుంబాన్ని పరామర్శించిన మంద కృష్ణ మాదిగ

Satyam NEWS

నాటు సారా స్థావరాలపై పోలీసుల దాడులు

Satyam NEWS

మత సామరస్యంలో భారత్‌ మార్గదర్శి

Sub Editor

Leave a Comment