27.7 C
Hyderabad
April 25, 2024 10: 52 AM
Slider సంపాదకీయం

రాఫెల్ యుద్ధవిమానాల కొనుగోలు క్రెడిట్ ఎవరికి దక్కుతుంది?

rafel 15

రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు విషయంలో కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ ఆరోపణలు చేయడం ఆరంభించిన నాటి నుంచి మన దేశంలో చాలా మందిలో ఒక రకమైన అనుమానాలు తొంగి చూశాయి. ఏమో, గతంలో జరిగినట్లే ఈ రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు లో కూడా భారీ కుంభకోణం జరిగిందేమో అనే అనుమానం కలిగింది. పెద్ద ఎత్తున ముడుపులు ముట్టాయేమోననే అనుమానం కూడా కొందరిలో కలిగింది. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం కూడా ఆయుధాలు, యుద్ధ యంత్రాలు కొనుగోలులో కుంభకోణాలకు పాల్పడితే ఇక ఈ దేశానికి నిష్కృతి ఉంటుందా అని కూడా చాలా మంది మదన పడ్డారు.

బిజెపిలో ఎంతో కాలం పని చేసి ఉన్నత స్థానాలలో ఉన్న యశ్వంత్ సిన్హా, అరుణ్ శౌరి ప్రఖ్యాత న్యాయవాది ప్రశాంత్ భూషన్ లాంటి వారు గత ఏడాది డిసెంబర్ 14న రాఫెల్ డీల్ విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును పరిశీలించాలని, మరింత విస్తృతంగా పరిశోధన జరగాల్సి ఉంటుందనే అనుమానాలు వెలిబుచ్చిన తర్వాత దేశ ప్రజల అనుమానాలు తారాస్థాయికి చేరాయి. ఈ రూ.58 వేల కోట్ల డీల్ లో పూర్తి విచారణ జరిపిస్తే మరిన్ని విషయాలు వెలికి వస్తాయని, అందువల్ల ఇచ్చిన తీర్పును పున:పరిశీలించాలని కోరుతూ పిటీషన్లు దాఖలయ్యాయి.

ఈ పిటీషన్లను దాఖలు చేసిన వారు సామాన్యులు కాకపోవడంతో ప్రధాని నరేంద్రమోడీ దోషిగా నిలబడాల్సి వచ్చింది. ఈ పిటీషన్లను సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం కూలంకషంగా విచారించిన అనంతరం రివ్యూపిటీషన్లను కొట్టివేసింది. గత ఏడాది డిసెంబర్ 14న రాఫెల్ డీల్ విషయంలో ఇచ్చిన తీర్పులో ఎలాంటి అనుమానాలు లేవని సుప్రీంకోర్టు చెప్పింది. తదుపరి విచారణ అవసరం లేదని తేల్చి చెప్పింది. దాంతో రాఫెల్ డీల్ లో అనుమానపడాల్సిందేమి లేదని తేలిపోయింది. ఇది శుభ సూచకం.

దేశ సైనిక పాటవాన్ని పెంపొందించుకోడానికి రాఫెల్ లాంటి మధ్య తరగతి యుద్ధ విమానాలు అత్యావశ్యకం. మన దేశం వద్ద సుఖోయ్30 లాంటి హెవీ ఫైటర్లు, మిగ్ 21, తేజస్ లాంటి లైట్ ఫైటర్లు ఉన్నాయి కానీ మధ్య తరగతి యుద్ధ విమానాల కొరత ఉంది. దాన్ని రాఫెల్ తీర్చబోతున్నది. రాఫెల్ యుద్ధ విమానాలతో బాటు స్వీడన్ దేశానికి చెందిన గ్రిప్పెన్, అమెరికాకు చెందిన ఎఫ్ 16, ఎఫ్ 18, రష్యాకు చెందిన మిగ్35, యూరోఫైటర్ టైఫూన్ లాంటి అన్ని రకాల మధ్య తరగతి యుద్ధ విమానాలను భారత్ 2007 నుంచి పరీక్షిస్తూనే ఉంది కానీ ఎలాంటి నిర్ణయం తీసుకోలేకపోయింది.

అయితే భారత భద్రతా దళాలు మాత్రం రాఫెల్ ఫైటర్ జెట్లు కావాలని కోరాయి. 2012లో బిడ్లు తెరచి రాఫెల్, టైఫూన్ ల కొనుగోలుకు చర్చలు ప్రారంభించారు. మొత్తం 126 యుద్ధ విమానాలు కావాలని అందులో 18 విమానాలు ఫ్రాన్స్ లో తయారు చేసినా మిగిలిన వాటిని భారత్ లోనే తయారు చేయాలని మనం కోరాం. దానికి రాఫెల్ అంగీకరించింది. యుద్ధ విమానాల తయారీ ప్రక్రియను భారత్ కు అందచేసేందుకు రాఫెల్ అంగీకరించింది. 2015లో ప్రధాని నరేంద్ర మోడీ ఫ్రాన్స్ సందర్శనకు వెళ్లినపుడు తుది ఒప్పందం కుదుర్చుకున్నారు.

రూ.58,000 కోట్ల ఈ డీల్ తో భారత్ కు 36 ఫైటర్ జెట్ లు రాబోతున్నాయి. గత 36 సంవత్సరాల కాలంలో రాఫెల్ లాంటి పెద్ద డీల్ ను భారత్ ఏ కంపెనీతో కుదుర్చుకోలేదు. దేశ రక్షణ శాఖ మంత్రిగా ఉన్న సమయంలో మనోహర్ పారికర్ ఈ డీల్ ను కుదుర్చుకున్నారు. అత్యంత నిజాయితీపరుడైన మనోహర్ పారికర్ కుదుర్చుకున్న ఈ డీల్ పై ఎవరికి అనుమానం రాలేదు కానీ న్యాయస్థానంలో పిటీషన్లు దాఖలు కావడం, రాహుల్ గాంధీ పదే పదే ఇదే విషయాన్ని ప్రస్తావించడంతో ఏదో జరిగి ఉంటుంది అనే భావన కలిగింది.

అయితే ఈ సంశయాలకు సుప్రీంకోర్టు చరమగీతం పాడింది. ఫైటర్ జెట్ల కొనుగోలు కథ సుఖాంతం అయింది. ఇది రక్షణ మంత్రిగా పని చేసిన నిజాయితీ పరుడైన దివంగత నేత మనోహర్ పారికర్ కు దక్కాల్సిన క్రెడిట్.

Related posts

బాలల భవిష్యత్తే దేశ భవిష్యత్తు ఏఎస్‌పీ

Sub Editor

సీఎం జగన్‍పై ఢిల్లీ హైకోర్టు బార్ అసోసియేషన్ సీరియస్

Satyam NEWS

రూ. 99,999 లోపు ఉన్న రైతుల రుణాలన్నీ మాఫీ

Satyam NEWS

Leave a Comment