35.2 C
Hyderabad
April 24, 2024 12: 14 PM
Slider సంపాదకీయం

ఇది రాజకీయం కాదు దీనికి మరో పేరు పెట్టాలి

_f8e2dcd2-73ae-11e7-a83f-2f06dfe08b4c

మహారాష్ట్ర రాజకీయ పరిణామాలతో కమలనాథులకు తత్వం బోధపడి ఉంటుంది. కర్నాటక లాంటి రాష్ట్రాలలో చేసినట్లు మహారాష్ట్రలో కూడా చేద్దామని అనుకున్న బిజెపికి అది వీలు కాలేదు. ఈ పరిణామాలలో ఒక్క బిజెపిని మాత్రమే అనాల్సిన అవసరం లేదు. ఫలితాలు వెలువడిన రోజు నుంచి మహారాష్ట్రంలో జరిగిన రాజకీయంలో ఎక్కడా నైతిక విలువలు అనే ప్రస్తావనే లేదు. బిజెపి, శివసేన, ఎన్ సి పి, కాంగ్రెస్ అన్ని రాజకీయ పార్టీలూ నీతి తప్పే ప్రయత్నించాయి.

ఏ రాజకీయ పార్టీ కూడా ప్రజలు ఏమనుకుంటారో అనే కనీస ఆలోచన కూడా చేయలేదు. అసలు ప్రజలతో సంబంధం లేనట్లు ప్రవర్తించాయి. కేవలం తమ స్వలాభం, తమ రాజకీయ ప్రయోజనం అనే రెండు అంశాల చుట్టూనే మహారాష్ట్ర రాజకీయం జరిగింది. అందుకే మహారాష్ట్ర రాజకీయం ఎన్ని మలుపులు తిరిగిందో చెప్పనలవి కాదు. ఈ మలుపుల్లో ఎవరికి వారు నీతి తప్పే ప్రవర్తించారు. విషాదం ఏమిటంటే ఈ రాజకీయ మలుపుల్లో గవర్నర్ వ్యవస్థ కూడా భ్రష్టుపట్టింది.

గవర్నర్ కేవలం తాను వచ్చిన రాజకీయ పార్టీకి మేలు చేసే విధంగానే ప్రవర్తించారు తప్ప రాజ్యాంగ బద్ధమైన విధిని నిర్వర్తించలేదని చెప్పడానికి ఎలాంటి సంకోచం లేదు. తెర వెనుక పాత్ర పోషించింది బిజెపి జాతీయ అధ్యక్షుడు, కేంద్ర హోం మంత్రి అమిత్ షా అని చెప్పడానికి కూడా సంకోచించాల్సిన అవసరం లేదు. అయితే అమిత్ షా ముందుగానే ఊహించారో ఏమో గానీ తెరపైకి వచ్చి అభాసుపాలు కాలేదు. వర్కింగ్ ప్రెసిడెంట్ జె పి నడ్డా మాత్రమే తెరపైకి వచ్చి చేయాల్సిన పనులు చేశారు.

ఇప్పుడు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్న ఏ రాజకీయ పార్టీకీ ప్రజల మద్దతు లేదని చెప్పవచ్చు. బిజెపికి గతంలోని స్థానాల కన్నా తక్కువ సీట్లు వచ్చాయి. అందువల్ల ఈ పార్టీకి పూర్తిగా ప్రజల మద్దతు ఉన్నట్లు చెప్పలేం. అదే విధంగా శివసేన. ఈ పార్టీకి కూడా అదే పరిస్థితి. ఈ రెండు పార్టీల కూటమికి సులువుగా అధికారం చేపట్టే మెజారిటీ వచ్చింది కానీ స్వార్ధం అడ్డుపడింది. ఇక్కడ ప్రజాస్వామ్యం అపహాస్యం పాలైంది. ఎన్ సి పి, కాంగ్రెస్ పార్టీలకు అధికారం చేపట్టే అవకాశమే లేదు.

అయినా ఆ రెండు పార్టీలూ అధికారం చేపట్టేందుకు ఆలశ్యంగా ముందుకు వచ్చాయి. ఇక్కడ కూడా ప్రజాస్వామ్యం అపహాస్యం పాలైనట్లే. శివసేన, ఎన్ సి పి, కాంగ్రెస్ పార్టీలు కలవడం అత్యంత దురదృష్టకరమైన పరిణామం. ఎన్నికల ముందు కూటములు ఎన్నికల తర్వాతి కూటములు ఉండటం సహజం కానీ ఇలా ఎన్నికల ముందు కలిసి పోటీ చేసినవారు విడిపోవడం, బద్ధ విరోధులు కలిసిపోవడం మహారాష్ట్రలోనే చూస్తున్నాం.

ఈ రాజకీయ అనిశ్చితిలో గవర్నర్ చేసిన తప్పుల వల్ల రాజ్యాంగం మరింత అపహాస్యం పాలైంది. ఎన్నికల ముందు కలిసి పోటీ చేసిన పార్టీలు విడిపోయినందువల్ల అతి పెద్ద పార్టీని ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు ఆహ్వానించారు. సంతోషమే. అతిపెద్ద పార్టీని ఆహ్వానించాలనే నిబంధన కూడా గవర్నర్ పాటించాల్సిన అవసరం లేదని ఇదే బిజెపి చాలా సార్లు చెప్పింది. సుస్థిర ప్రభుత్వం ఎవరు ఏర్పాటు చేస్తారో వారినే ఆహ్వానించడం గవర్నర్ విధి అని కూడా బిజెపి చెప్పింది. బిజెపికి మెజారిటీ లేదని తెలిసి కూడా గవర్నర్ ఆహ్వానించారు.

ఇది తొలి తప్పు. శివసేనను ప్రభుత్వం ఏర్పాటు చేయాలని పిలవడం రెండో తప్పు. అప్పటికి కాంగ్రెస్ పార్టీ శివసేనకు మద్దతు ఇవ్వలేదు. అందువల్ల శివసేన సుస్థిర ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం లేదు. ఆ తర్వాత మూడో పార్టీని అధికారం ఏర్పాటు చేయమని పిలవాల్సిన అవసరమే లేదు. అయినా గవర్నర్ ఎన్ సి పికి ఆహ్వానం పంపారు. ఇది ఆయన చేసిన మరో తప్పు. ఎన్ సి పి గడువు కోరిన తరుణంలో ఆ గడువు ఇవ్వకుండానే రాష్ట్రపతి పాలన విధించడం మరో ఘోరమైన తప్పు. అర్ధరాత్రి రాష్ట్రపతి పాలన ఎత్తేయడం మరో అత్యంత దారుణమై తప్పు.

ఎన్ సి పిని చీల్చి బిజెపి ప్రభుత్వాన్ని నిలబెట్టేందుకు గవర్నర్ ఈ చర్యకు పాల్పడ్డారు. ఇది అత్యంత హేయమైన తప్పిదం. అందరూ శరద్ పవర్ వైపు వేలెత్తి చూపడంతో ఆ మరాఠా యోధుడు తన విశ్వసనీయతను కాపాడుకోవడానికి శతవిధాలా ప్రయత్నించారు. శివసేనకు అండగానే ఉన్నారు. కాంగ్రెస్ పార్టీని కూడా తనతో తీసుకువెళ్లేందుకు శతవిధాలా ప్రయత్నించారు. అయితే ఇదంతా నైతికత కిందికి రాదు.

మహారాష్ట్రంలో జరిగిన అన్ని పరిణామాలూ దేశంలో దిగజారిపోతున్న నైతిక రాజకీయ విలువలకే అద్దం పడుతున్నాయి. మహారాష్ట్రలో జరిగింది రాజకీయం కాదు. దానికి మరో పేరు పెట్లాలి.

సత్యమూర్తి పులిపాక, చీఫ్ ఎడిటర్, సత్యం న్యూస్

Related posts

ఖమ్మం సిటిసి ప్రిన్సిపల్ గా సుభాష్ చంద్రబోస్

Bhavani

సర్వేలకు అందని రీతిలో తీర్పు

Bhavani

పలకని ఫోన్లతో జగనన్నకు ఎలా చెబుతాం?

Satyam NEWS

Leave a Comment