28.7 C
Hyderabad
April 20, 2024 03: 53 AM
Slider ఆంధ్రప్రదేశ్ సంపాదకీయం

చెత్తపలుకు: ఎల్లోస్ చెబుతున్న నీతులు

kodela 123

ఎందుకండీ పాపం వాడ్ని వేధిస్తారు చేసింది ఒక్క మర్డరే కదా అన్నట్లుంది ఎల్లోస్ వాదన. ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు అనూహ్యంగా ఆత్మహత్య చేసుకోవడం, దాన్ని రాజకీయాలకు ఎలా ముడిపెట్టాలో కుదరకపోవడంతో ఎల్లోస్ తీవ్రమైన మానసిక వత్తిడిలో ఉండిపోయారు. అసెంబ్లీ ఫర్నీచర్ కేసులో 409 సెక్షన్ కింద కేసు పెట్టాల్సిన అవసరం లేదని ఎవడో ఒక పోలీసు ఆఫీసర్ చెప్పాడట, ఈ కొత్తపలుకుల సోదరుడు పుంఖాను పుంఖాలుగా రాసేస్తున్నాడు. పబ్లిక్ సర్వెంట్ గా ఉండి అప్పగించిన ఆస్తులను దుర్వినియోగం చేస్తేనో, ఆ నమ్మకానికి భంగం కలిగిస్తేనో ఈ సెక్షన్ కింద కేసు పెట్టవచ్చు.

దానికి నిందితుడు సమాధానం చెప్పవచ్చు. ఇప్పటికే కోడెల ఆ ప్రయత్నం చేశారు. తాను ప్రభుత్వ ఫర్నీచర్ దొంగిలించలేదని, తాను క్యాంప్ కార్యాలయంలో వాడుకున్నానని, తిరిగి తీసుకెళ్లమని లెటర్ రాస్తే అసెంబ్లీ సిబ్బంది తీసుకువెళ్లలేదని చెప్పేశారు. ఏ కోర్టు అయినా కోడెల రాసిన ఈ లెటర్ చూసి ఎప్పుడు రాసిందీ కనుక్కొని ఇందులో కేసేంలేదని చెప్పడానికే వీలువుంది తప్ప – ఇందులో కోడెల దోషి యావజ్జీవ కఠిన కారాగార శిక్ష వేసేయండి అని తీర్పు చెప్పే అవకాశాలు చాలా అంటే చాలా తక్కువ. ఇంట్లో బాంబులు పేలి ఆయనకు కుడి భుజం అయిన పూదోట సతీష్, అతనితో బాటు మరి కొందరు అనుంగు శిష్యులు మరణించినపుడు కూడా కోడెల శివప్రసాదరావు తొణకలేదు, బెణకలేదు.

దాన్ని ఆయన రాజకీయంగా ఎదుర్కొన్నాడు. బయటపడ్డాడు. అంతకు ముందు రంగా హత్య తర్వాత ఆయన ఆస్తులు ధ్వంసం చేశారు. అయినా ఆయన మనోనిబ్బరంతోనే రాజకీయం నడిపాడు. మరింత కసిగా పని చేశాడు. ఆ తర్వాతి కాలంలో మళ్లీ పూర్వ వైభవం తెచ్చుకుని ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి స్పీకర్ అయ్యాడు. అసలు కోడెల శివప్రసాద్ లాంటి యాక్టీవ్ నాయకుడికి స్పీకర్ పదవి ఎందుకు ఇచ్చాడో సిబి నాయుడిని ఎప్పుడైనా అడిగావా సోదరా? కోడెలకు నరసరావుపేట అసెంబ్లీ టిక్కెట్ కూడా ఇవ్వకుండా వేధించి సత్తెన పల్లి ఎందుకు పంపించారో కనుక్కున్నావా?

ఇవన్నీ చేసిన సిబి నాయుడు నిర్దోషి, ఫర్నీచర్ కేసు పెట్టిన ప్రభుత్వం దోషా? నరసరావు పేటలో కోడెలకు వ్యతిరేకంగా ముఠాలను ప్రోత్సహించింది ఎవరో నీకు అత్యంత సన్నిహితుడని నీవే చెప్పుకున్నావు కదా ఆ కోడెల చెప్పలేదా? పార్టీ ఫిరాయింపులపై చర్యలు తీసుకోనందుకు జగన్ కక్ష కట్టాడట. వామ్మో, ఇందే లాజిక్కు. పార్టీ ఫిరాయింపులు దగ్గరుండి చేయించింది చంద్రబాబు కదా? మరి సిబినాయుడిపై కాకుండా కోడెలను వేధిస్తారా?

ఇంత చిన్న లాజిక్కు మర్చిపోతే ఎలా సోదరా? సొంత సామాజిక వర్గం వారి నుంచి కూడా లక్షలాది రూపాయలు కె-టాక్సు వసూలు చేయడం వల్లే కోడెల సంతానంపై వ్యతిరేకత వచ్చిందనేది నిష్టూర సత్యం. ఒక కేసులో- అతను మనవాడే – అని లోకేష్ ఫోన్ చేసినా కూడా కోడెల సంతానం వదల్లేదు. ఏం వాళ్లు సంపాదించుకోవడం లేదా అని అడిగారు తప్ప వారి సామాజిక వర్గం నుంచి కూడా వసూళ్లు ఆపలేదు. ఇక్కడ నుంచి వచ్చిన వ్యతిరేకత తోనే కోడెలను అప్పటి వరకూ అభిమానించిన ఆయన సామాజిక వర్గం కూడా పూర్తి వ్యతిరేకంగా మారిపోయింది.

నరసరావుపేటలో వైశ్య సామాజిక వర్గం గగ్గోలు పెట్టింది. స్థానిక ఎమ్మెల్యే గోపిరెడ్డి ని కూడా కట్టడి చేసి అధికారం అండతో వారు వసూళ్లు చేశారు. కొత్త ప్రభుత్వానికి చేతకాక వదిలేస్తున్నది కానీ మామూలు గా అయితే ఇప్పటికే చాలా మందిపై సీరియస్ కేసులు ఉండేవి. కోడెల ఫర్నీచర్ కొట్టేసిన విషయాన్ని ఆయన ఆత్మహత్య తర్వాత సిబి నాయుడు అంగీకరించారు. ఇంత చిన్న విషయానికి వేధిస్తారా అని ఆయన ప్రశ్నించాడు.

సిబి నాయుడి పలుకులే ఈవారం కొత్తపలుకులో కనిపించాయి. కోడెల ఫర్నీచర్ కొట్టేసిన విషయాన్ని కొత్తపలుకు కూడా ధృవీకరిస్తున్నది. చనిపోయిన వారి గురించి నాలుగు మంచిమాటలు చెప్పడం మన సంస్కృతి అని చెబుతున్నాడు. అసలు వివాదం మొదలైందే నీతో సోదరా. కోడెల చనిపోయాడో లేదో కూడా పూర్తిగా బయటి ప్రపంచానికి తెలియముందే రాజకీయ వేధింపులతో ఆత్మహత్య అని నీ ఛానెల్ లో స్క్రోలింగులు వేయించావు సోదరా?

ఎవరికి తెలియక ముందే, ఎవరూ నిర్ధారణకు రాక ముందే నీవు ఈ నిర్ణయానికి ఎలా వచ్చావు? కోడెలపై అభిమానం ఉన్నవారు కూడా అసహ్యించుకునే రీతిలో ప్రవర్తించిన నీవు ఈ మొత్తానికి అసలు కారణం. తాను చనిపోతే తన పిల్లలను ప్రభుత్వం వదిలిపెడుతుందని కోడెల ఆశట. చనిపోయిన వ్యక్తి చివరి కోరిక ఇది అని చెప్పగలిగిన వ్యక్తి నువ్వే సోదరా.

ఆయన చనిపోయే ముందు 24 నిమిషాలు మాట్లాడింది నీతోనే అన్నంత సాదృశ్యంగా చెప్పగలిగావు సోదరా. నీ జర్నలిజం ప్రమాణాలకు హ్యాట్సాఫ్. కృష్ణానది కరకట్టపై నిర్మించిన అక్రమ నిర్మాణాలకు నోటీసులు అంటించగానే మళ్లీ సింగిల్ పాయింట్ ఎజెండా గుర్తుకు వచ్చేస్తున్నది. ఇదే ప్రాబ్లం. పాపం తెలుగుదేశం పార్టీ ఓడిపోయింది అనే సానుభూతి ఉన్నవారిని కూడా మళ్లీ రెచ్చగొట్టి అంతే కావాలి ఈ ఎల్లో పక్షులకు అనేలా శాపం పెట్టేంత స్థాయిలో సిబి నాయుడిని (సారీ సిబినాయుడు ఉంటున్న ఇంటి ఓనరును) రక్షించే ప్రయత్నం చేయడం ఎంత వరకు సబబు సోదరా?

ఒక్కటి మాత్రం చాలా మంచి విషయం, మంచి విషయమే కాదు నిజం చెప్పావు సోదరా. అదేమిటంటే కోడెల ఉదంతాన్ని మళ్లీ ప్రస్తావిస్తూ అధికారంలో ఉన్నప్పుడు విర్రవీగడం….అంటూ రాశావు బ్రదర్. ఇది మాత్రం కరెక్టు. కోడెల తో బాటు చాలా మంది అధికారంలో ఉన్నప్పుడు విర్రవీగారు. ఎదుటివాడి ఆస్తులు కబ్జా చేసుకున్నారు. అధికార బలంతో, అడ్డువచ్చినవాడిని అడ్డు లేకుండా చేసుకున్నారు.

గుంటూరు జిల్లాలో మరీ ముఖ్యంగా నరసరావుపేట ప్రాంతంలో కోడెల బాధితులను అడిగితే నీవు రాసిన ఈ ఒక్క సెంటెన్సుకు కోటి నమస్కారాలు చెబుతారు.

Related posts

శ్రీకాంత్‌ చేతులమీదుగా ‘అంతిమ తీర్పు’ ట్రైలర్‌ విడుదల

Bhavani

సోషల్ మీడియా చక్రబంధంలో ఇరుక్కున్న కేటీఆర్

Satyam NEWS

అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఉప్పల్ ఎమ్మెల్యే

Satyam NEWS

Leave a Comment