సనాతన ధర్మప్రచారంలో భాగంగా ఫిబ్రవరి 25 నుండి మార్చి 1వ తేదీ వరకు తిరుమలలోని ఆస్థాన మండపంలో వేద విద్వత్ ఆగమ సదస్సు నిర్వహణకు చక్కగా ఏర్పాట్లు చేపట్టాలని టిటిడి అదనపు ఈవో ఎవి.ధర్మారెడ్డి అధికారులను ఆదేశించారు. తిరుమలలోని అన్నమయ్య భవనంలో శుక్రవారం అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జెఈవో మాట్లాడుతూ జనవరి నుండి తిరుమలలో ప్లాస్టిక్‌ను పూర్తిగా నిషేధించే దిశగా అడుగులు వేయాలన్నారు.
ప్లాస్టిక్ వాటర్ బాటిళ్లు వినియోగించకుండా ఏర్పాటు చేసిన సౌకర్యాలపై భక్తులకు అవగాహన కల్పించాలన్నారు. ప్లాస్టిక్ నిషేధానికి ఇంకా ఎలాంటి చర్యలు చేపట్టాలనే విషయంపై సుదీర్ఘంగా చర్చించారు. అదేవిధంగా, కాషన్ డిపాజిట్ తిరిగి ప్రవేశపెట్టడం, తిరుమలలో జరుగుతున్న పలు అభివృద్ధి పనులను అదనపు ఈవో సమీక్షించారు. ఈ సమావేశంలో టిటిడి చీఫ్ ఇంజినీర్ రామచంద్రారెడ్డి, శ్రీవారి ఆలయ డెప్యూటీ ఈవో హరీంద్రనాథ్, ట్రాన్స్‌పోర్టు జిఎం శేషారెడ్డి, విజివో మనోహర్, ధర్మగిరి వేద పాఠశాల ప్రిన్సిపాల్ కెఎస్ఎస్.అవధాని తదితరులు పాల్గొన్నారు.