అమెరికాలోని లూసియానా రాష్ట్రంలోని న్యూ ఓర్లీన్స్ నగరంలో నూతన సంవత్సర వేడుకల్లో జరిగిన ఉగ్రవాద దాడిలో కనీసం 10 మంది మరణించారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఒక అగంతకుడు ఒక పెద్ద వాహనంలో అక్కడ న్యూ ఇయర్ జరుపుకుంటున్న ప్రజల పైకి దూసుకువచ్చాడు. అక్కడ విధ్వంసం సృష్టించి ఆ తర్వాత ప్రజలపై కాల్పులు జరిపాడు. నగరంలోని సందడిగా ఉండే ఫ్రెంచ్ క్వార్టర్‌లోని బోర్బన్ స్ట్రీట్ వెంబడి బుధవారం తెల్లవారుజామున 3.15 గంటల ప్రాంతంలో ఈ దాడి జరిగింది. అయితే తరువాత పోలీసులు జరిపిన కాల్పుల్లో వాహనం డ్రైవర్ మరణించినట్లు ఎఫ్ బి ఐ తెలిపింది.
వాహనం ఆగిపోయిన తర్వాత, డ్రైవర్ ట్రక్కు నుండి బయటపడి, స్పందించిన అధికారులపై కాల్పులు జరిపాడని న్యూ ఓర్లీన్స్ పోలీసులు తెలిపారు. అధికారులు ఎదురు కాల్పులు జరిపి, డ్రైవర్‌ను చంపారని పోలీసులు తెలిపారు. ఇద్దరు అధికారులు కాల్పులలో గాయపడ్డారని, వారి పరిస్థితి నిలకడగా ఉందని పోలీసులు తెలిపారు. న్యూ ఓర్లీన్స్ మేయర్ లాటోయా కాంట్రెల్ ఈ హత్యలను తీవ్రంగా ఖండించారు. ఇది “ఉగ్రవాద దాడి”గా అభివర్ణించారు. నగరం పోలీసు చీఫ్ మాట్లాడుతూ ఈ చర్య స్పష్టంగా ఉద్దేశపూర్వకంగా జరిగిందని అన్నారు.
పోలీసు కమీషనర్ అన్నే కిర్క్‌పాట్రిక్ మాట్లాడుతూ, డ్రైవర్ మారణహోమం సృష్టించడానికి తీవ్రంగా ప్రయత్నించాడని అన్నారు. అతను ఉద్దేశపూర్వకంగా వీలైనంత ఎక్కువ మందిని చంపడానికి ప్రయత్నించాడని అన్నారు. FBI అసిస్టెంట్ స్పెషల్ ఏజెంట్ ఇన్ చార్జ్ అలెథియా డంకన్ మాట్లాడుతూ, ఘటనా స్థలంలో ఒక అనుమానిత పేలుడు పదార్థాన్ని స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. ఈ ప్రాంతం అతిపెద్ద నూతన సంవత్సర వేడుకల గమ్యస్థానాలలో ఒకటిగా ప్రసిద్ధి చెందింది.
అధ్యక్షుడు జో బిడెన్‌కు సమాచారం అందించినట్లు వైట్‌హౌస్ తెలిపింది. అటార్నీ జనరల్ మెరిక్ గార్లాండ్‌కు కూడా సమాచారం అందించినట్లు న్యాయ శాఖ తెలిపింది.