అత్యాచారం కేసులో నిందితుడిపై నేరం నిరూపణ అయినందుకు వనపర్తి జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎంఆర్. సునీత నిందితునికి 10 సంవత్సరాల కఠిన కారాగార జైలు శిక్ష, (100000/-) లక్ష రూపాయల జరిమానా విధించారు. బాధితురాలికి 90 వేల రూపాయల పరిహారం ప్రభుత్వం చెల్లించవలసిందిగా తీర్పు ఇచ్చారని వనపర్తి జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ తెలిపారు. జిల్లా ఎస్పీ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
వనపర్తి జిల్లా కొత్తకోట మండలం పాలెం గ్రామానికి చెందిన ఒక అమ్మాయిని అదే గ్రామానికి చెందిన చింతకాయల లక్ష్మీనారాయణ (24) ప్రేమిస్తున్నానని వెంట పడి మాయమాటలు చెప్పి ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు అత్యాచారం చేసేవాడు. తర్వాత పెళ్లి చేసుకోమని అడగగా ఆమెను పెళ్లి చేసుకోను అని చెప్పడమే కాకుండా వేరే వాళ్ళని పెళ్లి చేసుకుంటే తనకు కట్నం ఎక్కువగా వస్తుందని చెప్పాడు. దాంతో తనను మోసం చేశాడని బాధితురాలు 2018 జులై 17 నాడు కొత్తకోట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
అప్పటి ఎస్సై రవి కాంతారావు కేసు నమోదు చేయగా అప్పటి సీఐలు సోమనారాయణ సింగ్, జె. వెంకటేశ్వరరావు కేసును ఇన్వెస్టిగేషన్ చేసి నేరస్తునిపై కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ బి. గోపాల్ రెడ్డి కోర్టులో 14 మంది సాక్షులతో వాదనలు వినిపించారు. ప్రస్తుత ఎస్సై మంజునాథ రెడ్డి, సీఐ రాంబాబు ఆదేశాల మేరకు కోర్టు లైజనింగ్ ఆఫీసర్, కోర్టు డ్యూటీ ఆఫీసర్స్ శ్రీనివాసులు, హెడ్ కానిస్టేబుల్ సత్యనారాయణ, కోర్టులో సాక్షులను క్రమ పద్ధతిలో ప్రవేశపెట్టారు.
కేసు ఇన్వెస్టిగేషన్ చేసి నేరస్తులకు శిక్ష పడడంలో బాగా పనిచేసిన అప్పటి పోలీస్ అధికారులను, ప్రస్తుత పోలీస్ అధికారులను పబ్లిక్ ప్రాసిక్యూటర్, కోర్టు డ్యూటీ ఆఫీసర్ లను ఎస్పీ అభినందించి త్వరలో రివార్డు ఇస్తామని తెలిపారు. ఈ సందర్భంగా వనపర్తి జిల్లా పరిధిలో అమ్మాయిలను, మహిళలను వేధించిన, ర్యాగింగ్, ఈవ్ టీజింగ్ చేసిన వ్యక్తులపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ హెచ్చరించారు.
పోలిశెట్టి బాలకృష్ణ, సీనియర్ విలేకరి, సత్యం న్యూస్ నెట్