చైనా నుంచి వ్యాపిస్తున్న హ్యూమన్ మెటాప్న్యూమో వైరస్ (HMPV) ఇండియాలోకి ప్రవేశించేసింది. ఆందోళనకరమైన ఈ వార్తను ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ధృవీకరించింది. కర్ణాటకలో HMPV రెండు కేసులను గుర్తించినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సోమవారం తెలిపింది. బెంగుళూరులోని బాప్టిస్ట్ ఆసుపత్రిలో చేరిన తర్వాత బ్రోంకోప్ న్యుమోనియా చరిత్ర కలిగిన మూడు నెలల ఆడ శిశువుకు HMPV ఉన్నట్లు నిర్ధారణ అయింది.
ఆమె ఇప్పటికే డిశ్చార్జ్ అయినట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది. బ్రోంకోప్న్యుమోనియా చరిత్ర కలిగిన ఎనిమిది నెలల మగ శిశువుకు జనవరి 3న బాప్టిస్ట్ హాస్పిటల్‌లో చేరిన తర్వాత HMPV పాజిటివ్ వచ్చింది. ప్రస్తుతం ఆ శిశువు కోలుకుంటున్నాడని పేర్కొంది. రోగులలో ఎవరికీ అంతర్జాతీయ ప్రయాణ చరిత్ర లేదని మంత్రిత్వ శాఖ తెలిపింది. భారత్‌తో సహా ప్రపంచవ్యాప్తంగా HMPV ఇప్పటికే వ్యాప్తి చెంది ఉందని, దానితో సంబంధం ఉన్న శ్వాసకోశ వ్యాధుల కేసులు వివిధ దేశాల్లో రిపోర్టు అవుతున్నాయని అంటున్నారు.
అంతేకాకుండా, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR), ఇంటిగ్రేటెడ్ డిసీజ్ సర్వైలెన్స్ ప్రోగ్రామ్ (IDSP) నెట్‌వర్క్ డేటా ఆధారంగా, ఇన్ఫ్లుఎంజా-వంటి అనారోగ్యం (ILI) లేదా తీవ్రమైన శ్వాసకోశ అనారోగ్యం (SARI) కేసులలో అసాధారణ పెరుగుదల మన దేశంలో లేదు. అందుబాటులో ఉన్న అన్ని టెస్టుల ద్వారా పరిస్థితిని పర్యవేక్షిస్తున్నట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది. ICMR ఏడాది పొడవునా HMPV సర్క్యులేషన్ ట్రెండ్‌లను ట్రాక్ చేస్తూనే ఉంటుంది.
ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ఇప్పటికే కొనసాగుతున్న వైరస్ వ్యాప్తిని, చైనాలో పరిస్థితికి సంబంధించి సకాలంలో అప్ డేట్లు అందిస్తోంది. HMPV కేసులు పెరిగితే ఏం చేయాలనే అంశంపై దేశవ్యాప్తంగా ఇటీవల అన్ని సంబంధిత శాఖలను అప్రమత్తం చేశారు. శ్వాసకోశ వ్యాధుల కేసులలో ఏదైనా పెరుగుదల ఉంటే ఆ పరిస్థితిని ఎదుర్కోవడానికి భారతదేశం సర్వసన్నద్ధంగా ఉందని మంత్రిత్వ శాఖ పేర్కొంది.