ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బుధవారం ఏపీ పర్యటనకు రానున్నారు. ఈ పర్యటన ముగిసిన తర్వాత ఏపీలో…ప్రత్యేకించి వెనుకబడిన ఉత్తరాంధ్రలో పారిశ్రామిక వెలుగులు విరజిమ్మనున్నాయి. అంతేకాకుండా కూటమి సర్కారుపై నిన్నటిదాకా అసంబద్ధ ఆరోపణలు చేస్తున్న విపక్షాల నోళ్లకు సైతం తాళం పడనుంది. ఎందుకంటే… రేపటి తన పర్యటనలో నరేంద్ర మోదీ… ఏకంగా రూ.2 లక్షల కోట్లకు పైగా విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపనలతో పాటు ప్రారంభోత్సవాలు చేయనున్నారు.
ఈ ప్రాజెక్టుల్లో 98 శాతం ప్రాజెక్టులు ఉత్తరాంధ్రకు చెందినవే ఉన్నాయి. అంటే… మోదీ పర్యటన తర్వాత ఉత్తరాంధ్ర ప్రజలకు అభివృద్ధి ఫలాలు వరుస క్రమంలో అందనున్నాయన్న మాట. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వం నుంచి భారీ ఎత్తున ప్రాజెక్టులు రాబట్టిన రాష్ట్రంగా ఏపీ రికార్డులు నెలకొల్పనుంది. ఇక కేంద్రం నుంచి చిల్లిగవ్వ కూడా తేలేకపోతున్నారంటూ నిన్నటిదాకా నోటికొచ్చినట్లుగా మాట్లాడుతున్న వైసీపీ నేతలు గురువారం నుంచి ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే అంశాలేమున్నాయంటూ వెతుక్కోక తప్పదు.
ఇక బుధవారం మోదీ శంకుస్థాపన చేయనున్న ఎన్టీపీసీ గ్రీన్ ఫీల్డ్ హైడ్రోజన్ ప్లాంట్ ఉత్తరాంధ్రకు వర ప్రదాయనిగా నిలవనుంది. రూ.1.85 లక్షల కోట్ల విలువైన ఈ ప్రాజెక్టును సాధించడంలో చంద్రబాబు సర్కారు సత్తా చాటిందనే చెప్పాలి. ఎన్టీపీసీ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అన్న సంగతి తెలిసిందే. ఈ లెక్కన ఈ ప్రాజెక్టు ద్వారా ఏపీకి కేంద్రం రూ.1.85 లక్షల కోట్లను ఇచ్చినట్లే లెక్క. ఇందులో రాష్ట్ర ప్రభుత్వ వాటా ఉన్నా… అతి నామమాత్రమే. ఈ ప్రాజెక్టు ఏర్పాటు ద్వారా ఏకంగా 25 వేల ఉద్యోగాలు అందుబాటులోకి రానున్నాయి. ఈ ఉద్యోగాలు ఉత్తరాంధ్ర యువతకు ఊపిరి పోయడం ఖాయమే.
ఆర్థికంగా వెనకబాటుతో కునారిల్లుతున్న ఉత్తరాంధ్ర ఇంత పెద్ద ప్రాజెక్టుతో భారీ ఊరటను పొందనుంది. అదే సమయంలో రూ.1,877 కోట్లతో ఉత్తరాంధ్రలోనే ఏర్పాటు కానున్న బల్క్ డ్రగ్ పార్క్ ద్వారా ఉత్తరాంధ్ర యువతకు మరో 28 వేల ఉద్యోగాలు అందుబాటులోకి రానున్నాయి. పెట్టుబడలు విషయంలో ఈ పార్క్ తక్కువ మొత్తంలోనే నిధులను తెస్తున్నా… దాదాపుగా 30 వేల ఉద్యోగాలను ఉత్తరాంధ్ర యువతకు అందించనుండటం ఆహ్వానించదగ్గ విషయమే. మొన్నటి ఎన్నికల్లో జనసేనతో పాటు బీజేపీతో పొత్తు కట్టి బరిలోకి దిగిన నేపథ్యంలో. కేంద్రంలో అధికారంలో తన మిత్రపక్షమే ఉంటున్నా… ఏపీకి చంద్రబాబు ఏమాత్రం నిధులు తేలేకపోతున్నారని వైసీపీ విమర్శలు చేస్తోంది.
బీజేపీ తర్వాత ఎన్డీఏలో అత్యథిక ఎంపీ సీట్లను కలిగి ఉన్నప్పటికీ… మోదీ దగ్గర చంద్రబాబు గొంతు పెగలడం లేదని కూడా వైసీపీ నిందలు వేస్తోంది. టీడీపీ కంటే తక్కువ మంది ఎంపీలు ఉన్నా… బీహార్ సీఎం నితీశ్ కుమార్ తాను అనుకున్న మేర నిదులను తన రాష్ట్రానికి తీసుకెళ్లగలుగుతున్నారని కూడా వైసీపీ దెప్పి పొడుస్తోంది. ఒకే దఫా రూ.2 లక్షల కోట్ల విలువ కలిగిన ప్రాజెక్టులను కేంద్రం నుంచి సాధించడం ద్వారా చంద్రబాబు ఈ విమర్శలకు చెక్ పెట్టేశారనే చెప్పాలి.
అంతేకాకుండా సింగిల్ స్టెప్ లోనే రూ.2 లక్షల కోట్ల విలువ కలిగిన ప్రాజెక్టులను స్వయంగా ప్రధాని చేతుల మీదుగా ప్రారంభించేలా చేయడంతో ఇతర రాష్ట్రాల కంటే ఏపీ ముందు వరుసలో నిలిచినట్టైంది. ఫలితంగా కేంద్రం నుంచి అత్యంత ప్రాధాన్యత లభించిన రాష్ట్రంగానూ ఏపీ నిలిచింది. వెరసి విపక్షాలు చేస్తున్న విమర్శలన్నీ అబద్ధాలేనన్న మాటను చంద్రబాబు తన చర్యల ద్వారా ఒకింత గట్టిగానే వినిపించడానికి ఆస్కారం ఏర్పడింది. మొత్తంగా మోదీ టూర్… ఇటు ఏపీతో పాటు అటు టీడీపీకి… ప్రత్యేకించి చంద్రబాబుకు మంచి మైలేజీని తీసుకు రానుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదనే చెప్పాలి.