కొత్త సంవత్సరం ప్రారంభంలోనే లక్నో పోలీసుల ముందుకు ఒక కిరాతకుడి కేసు వచ్చింది. ఎవరూ ఊహించని నేరాన్ని చేసిన 24 ఏళ్ల కుర్రాడిని పోలీసులు అరెస్టు చేశారు. అతడు చేసిన నేరం తెలుసుకుంటే ఒళ్లు గగుర్పొడుస్తుంది. 24 ఏళ్ల అర్షద్ అనే వాడు తన కన్నతల్లిని హత్య చేశాడు. అంతే కాదు. తన తోడబుట్టిన నలుగురు అక్కచెల్లెళ్లను కూడా దారుణంగా చంపేశాడు. లక్నో లోని హోటల్ శరంజీత్‌లోని ఒక గదిలో ఐదు మృతదేహాలను కనుగొన్నట్లు ఠాణా ప్రాంతం నుండి సమాచారం అందిందని డిప్యూటీ కమీషనర్ ఆఫ్ పోలీస్ (DCP) సెంట్రల్ రవీనా త్యాగి తెలిపారు.
తల్లి, నలుగురు సోదరీమణుల గొంతులను కోయడం ద్వారా, మరికొందరు వారి మణికట్టు నరాలను కత్తిరించడం ద్వారా అతడు హత్య చేసినట్లు తెలిపారు. మృతులను అలియా (9), అల్షియా (19), అక్సా (16), రహ్మీన్ (18), వారి తల్లి అస్మాగా గుర్తించారు. ఓ గదిలో మృతదేహాలను గుర్తించిన హోటల్ సిబ్బంది పోలీసులకు సమాచారం ఇవ్వడంతో దారుణ హత్యలు వెలుగులోకి వచ్చాయి. ఆగ్రాలోని కుబేర్‌పూర్‌లోని టెడి బాగియాలోని ఇస్లాం నగర్‌లో నివసించే అర్షద్ కుటుంబ కలహాల వల్లే హత్యలు చేసినట్లు భావిస్తున్నారు. తానే ఈ హత్యలు చేసినట్లు జరిగాయని విచారణలో అర్షద్ అంగీకరించాడు.
హత్యకు ఒక రోజు ముందు కుటుంబాన్ని మొదట అజ్మీర్‌కు తీసుకెళ్లి, ఆపై లక్నోకు తీసుకువచ్చారు. అర్షద్ తండ్రి కూడా ఈ నేరానికి సహకరించాడని పోలీసులు తెలిపారు. అయితే, అతని తండ్రి ప్రమేయం ఇంకా విచారణలో ఉంది. తదుపరి విచారణ కోసం ఆగ్రా పోలీసులను లక్నో పోలీసులు సంప్రదించారు. తొలుత తన తల్లిని హత్య చేసి, హోటల్ గదిలో నిద్రిస్తున్న తన సోదరీమణులపై దాడికి పాల్పడ్డానని నిందితుడు వివరించాడు. ఒక వీడియో క్లిప్‌లో అర్షద్ నేరాన్ని వివరిస్తూ, కుటుంబ వివాదాల కారణంగా దీర్ఘకాలంగా ఉన్న చిరాకులతో ఈ పని చేసినట్లు వెల్లడించాడు. ఫోరెన్సిక్ బృందాలు నేరస్థలాన్ని పరిశీలించాయి.
దర్యాప్తును పర్యవేక్షించేందుకు సీనియర్ పోలీసు అధికారులు హోటల్‌ను సందర్శించి ఆధారాలు సేకరించారు. హత్యకు గల కారణాన్ని నిర్ధారించడానికి, కేసుపై మరింత స్పష్టత అందించేందుకు బాధితుల మృతదేహాలను పోస్ట్‌మార్టం కోసం పంపారు. తదుపరి విచారణ, పోస్ట్‌మార్టం ఫలితాల తర్వాత హత్య ఉద్దేశ్యంపై ఖచ్చితమైన వివరాలు వెల్లడిస్తామని డిసిపి త్యాగి చెప్పారు.