తిరుమల శ్రీవారి ఆలయంలో దీపావళి పండుగ సందర్భంగా అక్టోబరు 27వ తేదీన ‘దీపావళి ఆస్థానాన్ని’ టిటిడి ఘనంగా నిర్వహించనుంది. ప్రతి ఏటా ఆశ్వయుజ మాసం అమావాస్య(దీపావళి) నాడు యథాప్రకారంగా శ్రీవేంకటేశ్వరస్వామివారికి సుప్రభాతం మొదలుకొని మొదటిగంట నివేదన వరకు కైంకర్యాలు జరుగుతాయి. అనంతరం ఉదయం 7 నుండి ఉదయం 9 గం.ల వరకు బంగారువాకిలి ముందు గల ఘంటా మండపంలో దీపావళి ఆస్థానం జరుగుతుంది. ఆస్థానంలో భాగంగా శ్రీమలయప్పస్వామి దేవేరులతో కలిసి ఘంటా మండపంలో ఏర్పాటుచేసిన సర్వభూపాల వాహనంలో గరుడాళ్వార్‌కు అభిముఖంగా వేంచేపు చేస్తారు. సేనాధిపతి అయిన శ్రీ విష్వక్సేనులవారిని కూడా స్వామివారి ఎడమ పక్కన మరొక పీఠంపై దక్షిణ ఆభిముఖంగా వేంచేపు చేస్తారు. ఆ తరువాత స్వామివారికి ప్రత్యేక పూజ, హారతి, ప్రసాద నివేదనలను అర్చకులు ఆగమోక్తంగా నిర్వహిస్తారు. దీంతో దీపావళి ఆస్థానం పూర్తవుతుంది. దీపావళి ఆస్థానం కారణంగా అక్టోబరు 27న కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, బ్రహ్మోత్సవం, వసంతోత్సవం ఆర్జిత సేవలను టిటిడి రద్దు చేసింది.
previous post