రాష్ట్రంలోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి మొదటి విడతలో 3500 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామని రాష్ట్ర రెవెన్యూ, సమాచార, గృహ నిర్మాణ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి అన్నారు. శనివారం మంత్రి ఖమ్మం పార్లమెంట్ సభ్యులు రామసహాయం రఘురాం రెడ్డి తో కలిసి కూసుమంచి మండలంలో పర్యటించి పలు రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసి, కూసుమంచి క్యాంప్ కార్యాలయంలో నేలకొండపల్లి మండలానికి చెందిన మొత్తం 42 మందికి, కూసుమంచి మండలానికి చెందిన 64 మంది లబ్ధిదారులకు సిఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజలు ఎన్నుకున్న ప్రజా ప్రభుత్వం సంక్షేమంతో పాటు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిందన్నారు.
రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేకపోయినా ఇచ్చిన ప్రతి మాట నెరవేర్చాలనే సంకల్పంతో ప్రభుత్వం పనిచేస్తుందని మంత్రి అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 80 లక్షల మంది ఇండ్లు కావాలని దరఖాస్తు చేశారని, ఇప్పటి వరకు 64 లక్షల దరఖాస్తుల సర్వే ఈ యాప్ ద్వారా పూర్తి చేసామని, మిగిలిన దరఖాస్తుల సర్వే మరో నాలుగు రోజులలో పూర్తి చేస్తామని అన్నారు. వివిధ దశలలో ఉన్న డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను కూడా సంక్రాంతి లోపు పంపిణీ చేస్తామని, అసంపూర్తిగా ఉన్న డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను పూర్తి చేసేందుకు అవసరమైన నిధులు మంజూరు చేస్తామని అన్నారు. గ్రామాల్లో త్రాగునీటి సరఫరాకు అధికారులు యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రైతులు, యువకులు, మహిళల సంక్షేమం కోసం ఇందిరమ్మ రాజ్యం చిత్తశుద్ధితో పనిచేస్తుందని అన్నారు.