19.7 C
Hyderabad
December 2, 2023 05: 15 AM
Slider జాతీయం ముఖ్యంశాలు

5రోజుల సీబీఐ కస్టడీకి చిదంబరం

chidambaram with police

ఐఎన్ఎక్స్ మీడియా కేసులో అరెస్టయిన కేంద్ర మాజీ మంత్రి చిదంబరంను సీబీఐ నేడు కోర్టు ముందు హాజరు పరిచింది. చిదంబరం నుంచి చాలా విషయాలు రాబట్టాల్సి ఉందని సిబిఐ కోరడంతో కోర్టు ఐదురోజుల పాటు అనుమతినిచ్చింది. ప్రతి రోజు కుటుంబ సభ్యులు చిదంబరంను అరగంటసేపు కలిసే అవకాశం కూడా కోర్టు ఇచ్చింది. బుధవారం రాత్రి సీబీఐ చిదంబరంను అరెస్టు చేసింది. కేంద్ర హోంశాఖ మంత్రిగా, ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసిన ఓ వ్యక్తిని ఇలా సీబీఐ అరెస్టు చేయడం చరిత్రలో తొలిసారి కావడం విశేషం. రాత్రంతా సీబీఐ అదుపులో ఉన్న చిదంబరంను అధికారులు పలు ప్రశ్నలు సంధించారు. అయితే చిదంబరం సరైన సమాధానాలు ఇవ్వలేదని సిబిఐ అధికారులు న్యాయస్థానానికి తెలిపారు. సీబీఐ తరపున సొలిసిటర్  జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించగా చిదంబరం తరపున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదులు కపిల్ సిబల్, అభిషేక్ సింఘ్వీలు వాదించారు. విచారణ సందర్భంగా చిదంబరం బోనులో నిల్చున్నారు. మనీలాండరింగ్‌లోనే ఇది ఒక అరుదైన కేసుగా అభివర్ణించారు సీబీఐ తరపున లాయర్ తుషార్ మెహతా. చార్జ్‌షీటు దాఖలు చేయాల్సిన సమయంలో చిదంబరం విచారణకు సహకరించడం లేదని న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చారు. మౌనంగా ఉండాలనుకోవడం రాజ్యాంగం కల్పించిన హక్కు అని అయితే కేసుకు సంబంధించి నోరువిప్పకపోవడం సరికాదని అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పకపోవడం కూడా కరెక్ట్ కాదని తుషార్ మెహతా అన్నారు. అయితే ఐఎన్ఎక్స్ మీడియాలో కుట్రలు వెలికి తీయాలంటే చిదంబరంను ఐదురోజుల పాటు తమ కస్టడీకి అప్పగించాలని న్యాయస్థానాన్ని తుషార్ మెహతా కోరారు. ఐఎన్ఎక్స్ మీడియాలో పెద్ద ఎత్తున మనీలాండరింగ్ జరిగిందని ఈ విషయాలన్నీ బయటకు రావాలంటే చిదంబరంను మరింత లోతుగా విచారణ చేయాల్సిన అవసరముందని తుషార్ మెహతా కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఇదిలా ఉంటే ఐఎన్ఎక్స్ మీడియాకు ఎఫ్ఐపీబీ నుంచి అన్ని రకాల క్లియరెన్సులు ఇచ్చింది ఆరుగురు సెక్రటరీలని వారిని అరెస్టు ఎందుకు చేయలేదని వారి సలహామేరకు నడుచుకున్న చిదంబరంను ఎలా అరెస్టు చేస్తారని కపిల్ సిబల్ వాదనలు వినిపించారు. ఉదయం 11 గంటల వరకు సీబీఐ చిదంబరంను ఎందుకు ప్రశ్నించలేదని అడిగారు. సీబీఐ చేసే ఆరోపణల్లో నిజం లేదని కపిల్ సిబల్ అన్నారు. ఐదురోజుల పాటు కస్టడీ దేనికని కపిల్ సిబల్ సీబీఐని ప్రశ్నించారు. అంతేకాదు ఇప్పటికే కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కార్తీ చిదంబరం, పీటర్ ముఖర్జీ, ఇంద్రాణి ముఖర్జీలు బెయిల్ పై ఉన్నారన్న విషయాన్ని న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చారు కపిల్ సిబల్. చేయని తప్పును ఒప్పుకోకపోవడం అంటే సహకరించడం లేదని చెప్పడం సరికాదన్నారు. వాదనలు జరుగుతున్న సమయంలో తనను మాట్లాడేందుకు అనుమతించాల్సిందిగా జడ్జిని చిదంబరం కోరారు. అయితే ఇందుకు సొలిసిటర్ జనరల్ అభ్యంతరం తెలిపారు. తన క్లయింట్‌ను ఎందుకు మాట్లాడనివ్వరని ప్రశ్నించారు చిదంబరం తరపున న్యాయవాది అభిషేక్ సింఘ్వీ. దీంతో చిదంబరం మాట్లాడేందుకు కోర్టు అనుమతి ఇచ్చింది. తనపై ఆరోపణలు వస్తున్నట్లుగా ఐదు మిలియన్ డాలర్లకు తనకు సంబంధం లేదని కోర్టుకు తెలిపారు చిదంబరం. అదే సమయంలో సీబీఐ తన బ్యాంక్ అకౌంట్ నెంబర్ తన కొడుకు బ్యాంక్ అకౌంట్ నెంబర్లు అడిగిందని న్యాయమూర్తి దృష్టికి తీసుకొచ్చారు. వారడిగిన ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్పినట్లు చిదంబరం కోర్టుకు తెలిపారు.

Related posts

ఎందుకో ఈ తొందర?: రేపే ఏపీ కేబినెట్‌ భేటీ

Satyam NEWS

హుజురాబాద్ ఉప ఎన్నికలో బిజెపి గెలుపు ఖాయం

Satyam NEWS

రైతు బిల్లును ఉపసంహరించుకోవాలని నేడు బైక్ ర్యాలీ

Satyam NEWS

Leave a Comment

error: Content is protected !!