వాయువ్య టర్కీలోని ప్రముఖ స్కీ రిసార్ట్‌లోని 12-అంతస్తుల హోటల్‌లో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో కనీసం 66 మంది మరణించారు. ఇస్తాంబుల్‌కు తూర్పున 300 కిలోమీటర్ల దూరంలో ఉన్న బోలు ప్రావిన్స్‌లోని కొరోగ్లు పర్వతాలలో కర్టల్‌కాయలోని గ్రాండ్ కర్తాల్ హోటల్‌లో ఈ అగ్నిప్రమాదం జరిగింది. మరణించిన వారే కాకుండా కనీసం 51 మంది గాయపడ్డారు. పాఠశాలలకు రెండు వారాల శీతాకాల విరామం ప్రారంభమైన సమయంలో, ఈ ప్రాంతంలోని హోటళ్లు కిక్కిరిసి ఉన్న సమయంలో ఈ అగ్ని ప్రమాదం సంభవించింది.
హోటల్‌లో 238 మంది నమోదిత అతిథులు ఉన్నారు. తెల్లవారుజామున 3.27 గంటలకు అగ్నిప్రమాదం సంభవించిందని, 4.15 గంటలకు అగ్నిమాపక శాఖ స్పందించింది. హోటల్‌లోని స్కీ ఇన్‌స్ట్రక్టర్ అయిన నెక్మీ కెప్సెటుటన్ మాట్లాడుతూ, తాను నిద్రిస్తున్న సమయంలో మంటలు చెలరేగడంతో వెంటనే భవనం నుంచి బయటకు వచ్చానని చెప్పారు. అతను హోటల్ నుండి 20 మంది అతిథులకు సహాయం చేసానని చెప్పాడు. హోటల్‌లో పొగలు కమ్ముకున్నాయని, మంటలు చెలరేగిన ప్రదేశాన్ని గుర్తించడం అతిథులకు ఇబ్బందిగా మారిందని తెలిపారు. హోటల్‌లోని ఫైర్ డిటెక్షన్ సిస్టమ్ పనిచేయడంలో విఫలమైందని సాక్షులు చెబుతున్నారు. అగ్నిమాపక బృందాలు రావడానికి సుమారు గంట సమయం పట్టిందని సాక్షులు చెప్పారు.