తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో ఏడో రోజైన ఆదివారం రాత్రి శ్రీనివాసుడు చంద్రప్రభ వాహనంపై ధన్వంతరి అలంకారంలో తిరుమాడ వీధులలో విహరిస్తూ భక్తులను కటాక్షించారు. రాత్రి 8.00 నుండి స్వామివారు నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. వాహనసేవ ముందు గజరాజులు ఠీవిగా నడుస్తుండగా, భక్తజన బృందాలు చెక్కభజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి ఉత్సవం కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు. చంద్రప్రభ వాహనంపై శ్రీవారు దర్శనమిచ్చి తన చల్లని అమృత కిరణాలతో భక్తులను అమృతస్వరూపులను చేస్తారు. నక్షత్రాలకు చంద్రుడు అధిపతి అయితే శ్రీవారు సమస్త విశ్వానికీ అధిపతి. వాహనం చంద్రుడు ఆహ్లాదకారి. శ్రీవారు చంద్రమండల మధ్యస్థుడై పరమాహ్లాదకారి అయ్యాడు. సర్వకళాసమాహారాత్మకుడైన ఆదినారాయణుడు తన కళల నుండి 16 కళలు చంద్రునిపై ప్రసరింపజేసినందున చంద్రుడు కళానిధి అయ్యాడు. చంద్రదర్శనంతో సముద్రం ఉప్పొంగినట్టు, చంద్రప్రభామధ్యస్థుడైన శ్రీకల్యాణచంద్రుణ్ణి దర్శించడంతో భక్తుల హృదయ క్షీరసాగరాలు ఉత్తుంగప్రమోద తరంగాలతో పొంగి ఆనందిస్తాయి. చంద్రప్రభ వాహనంలో శ్రీవారిని దర్శించడం సకలతాపహరం. శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం రథోత్సవం వైభవంగా జరుగనుంది. ఉదయం 7 గంటలకు రథోత్సవం ప్రారంభమవుతుంది. రాత్రి 8 నుండి 10 గంటల వరకు అశ్వవాహనంపై స్వామివారు విహరించి భక్తులను కటాక్షించనున్నారు
previous post
next post