శరన్నవరాత్రుల్లో భాగంగా 9వ రోజైన సోమవారం (ఆశ్వయుజ శుద్ధ నవమి) నాడు ఇంద్రకీలాద్రిపై కొలువైన జగన్మాత కనకదుర్గమ్మ శ్రీ మహిషాసురమర్థినీ దేవిగా దర్శనమిస్తున్నది. అష్ట భుజాలతో దుష్టుడైన మహిషాసురుడిని అమ్మవారు సంహరించింది ఈ రూపంలోనే. అందుకే నవదుర్గల్లో అత్యుగ్రరూపం. ఈ రోజున జగన్మాత కనకదుర్గమ్మ లేతరంగు దుస్తుల్లో సింహ వాహనాన్ని అధిష్టించి ఆయుధాలను ధరించిన మహాశక్తిగా భక్తులను సాక్షాత్కరిస్తున్నారు. ఈ తల్లికి గారెలు, బెల్లంతో కలిపిన అన్నాన్ని నైవేద్యంగా నివేదిస్తారు. మహిషాసుర మర్ధిని దేవి అలంకారంలో ఉన్న దుర్గమ్మను కుటుంబ సమేతంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వి సుబ్రమణ్యం దర్శనం చేసుకున్నారు. ఆయనకు ఆలయ మర్యాదలతో దేవస్థాన అధికారులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎల్వి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ మహిషాసుర మర్ధిని దేవి అలంకారంలో ఉన్న దుర్గమ్మను దర్శించుకోవడం ఆనందంగా ఉంది. సృష్టికి మూలం తల్లి అటువంటి తల్లి అయిన మాతృ రూపాన్ని చూస్తే ఆనందంగా కలుగుతుంది. అమ్మవారి దయతో కృష్ణానది పరవళ్లు తొక్కుతుంది. అమ్మవారిని దర్శించుకున్న తర్వాత భక్తుల జీవితంలో మార్పు వస్తుంది. దేవస్థానం వారు చక్కటి ఏర్పాట్లు చేశారు అని ఆయన అన్నారు
previous post
next post