27.7 C
Hyderabad
April 24, 2024 07: 42 AM
Slider సంపాదకీయం

A Big Question: ఎవరు ‘‘పెయిడ్ ఆర్టిస్టులు?’’

#ABNAndhraJyothy

అమరావతిలో రాజధాని కొనసాగించాలని ఉద్యమం చేస్తున్న రైతులను పెయిడ్ ఆర్టిస్టులు అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు ఎద్దేవా చేసేవారు. ‘‘మేం నిజమైన రైతులం’’ అని వారు మొత్తుకున్నా ఎవరూ పట్టించుకోలేదు.

పెయిడ్ ఆర్టిస్టు అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అమరావతి వ్యతిరేక పేటెంటు పదంగా మారిపోయింది. అమరావతి రైతులు పట్టుచీరలు కట్టుకుని ఉద్యమం చేస్తున్న ఫొటోలు, మోడ్రన్ డ్రస్ లో ఉన్న ఫొటోలు కూడా వైరల్ చేసి చాలా మంది శునకానందం పొందారు.

అమరావతి ఉద్యమాన్ని నీరుగార్చేందుకు, ఆ ఉద్యమానికి విశ్వసనీయత లేకుండా చేసేందుకు ఇవన్నీ ఉపకరించాయి. అమరావతి ఉద్యమం ఇతర ప్రాంతాలకు పాకకుండా ఉండేందుకు ఇవన్నీ సహకరించాయి.

‘‘పెయిడ్ ఆర్టిస్టు’’ పదం బిజెపి ఎందుకు వాడుతున్నది?

అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన ‘‘పెయిడ్ ఆర్టిస్టు’’ పదం బిజెపి ఎందుకు వాడుతున్నది? బిజెపి ఈ పదం ఎందుకు వాడుతున్నదో తెలియదు కానీ ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో నిన్న జరిగిన చర్చాకార్యక్రమంతో పాత విషయాలన్నీ మళ్లీ తెరపైకి వస్తున్నాయి.

ఏబిఎన్ ఆంధ్రజ్యోతి లో మోడరేటర్ వెంకట కృష్ణ నిన్న నిర్వహించిన చర్చా కార్యక్రమంలో అమరావతి జెఏసి నాయకుడు శ్రీనివాసరావు, బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణు వర్ధన్ రెడ్డిని చెప్పుతో కొట్టారు.

దళిత నాయకుడైన  శ్రీనివాసరావును ఉద్దేశించి ‘‘పెయిడ్ ఆర్టిస్టు’’ అని విష్ణు వర్ధన్ రెడ్డి సంబోధించడమే ఈ ఆగ్రహానికి కారణం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అమరావతిలో సగంలో ఆగిపోయిన భవనాలను పూర్తి చేసేందుకు మూడు వేల కోట్లు రుణం తీసుకోవడానికి అనుమతినిస్తూ మంత్రి వర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నది.

దీనిపై నిర్వహించిన చర్చాకార్యక్రమంలో మరి కొందరితో బాటు వీరిద్దరూ కూడా పాల్గొన్నారు. శ్రీనివాసరావును తెలుగుదేశం పార్టీ ఏజెంటు అని అనడమే కాకుండా ‘‘నీ వాదన తెలుగుదేశం పార్టీ ఆఫీసులో కూర్చుని చెప్పుకో’’ అంటూ విష్ణు వర్ధన్ రెడ్డి అనడం వీడియోలో వినిపించింది.

అంతటితో ఆగకుండా పెయిడ్ ఆర్టిస్టు అన్న పదం కూడా ఆయన వాడారు. అప్పటి వరకూ మాటల వరకే ఉన్న శ్రీనివాసరావు చెప్పు తీసుకుని విష్ణువర్ధన్ రెడ్డిని కొట్టారు. చర్చను మధ్యలోనే ఆ ఛానెల్ ఆపేసింది. ఈ సంఘటనతో ‘‘అమరావతి రైతులు పెయిడ్ ఆర్టిస్టులా?’’ అనే ప్రశ్న మళ్లీ తాజాగా చర్చలోకి వచ్చింది.

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరచూ వాడే ఈ పదాన్ని బిజెపి వాడటం ఏమిటి అనే ప్రశ్న కూడా తలెత్తుతున్నది. ఈ సంఘటన జరిగిన తర్వాత బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు, బిజెపి రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు ఉత్తర క్షణంలోనే ట్విట్ పెట్టేశారు.

ఈ సంఘటనలోకి చంద్రబాబునాయుడిని లాగి ఆయన ఈ సంఘటనను ఖండించాలని చెప్పారు. చెప్పుతో కొట్టిన శ్రీనివాసరావు క్షమాపణ చెప్పాలి అని డిమాండ్ చేయాలా? చంద్రబాబునాయుడు ఖండించాలని డిమాండ్ చేయాలా? ఈ సందిగ్ధంలోనే తమ శత్రువు అయి చంద్రబాబునాయుడిని వివాదంలోకి లాగి చర్చను పక్కదోవ పట్టించాలని బిజపి నాయకులు అనుకుంటున్నారు.

అమరావతి రైతులను పెయిడ్ ఆర్టిస్టులు అన్నందుకు విష్ణువర్ధన్ రెడ్డి క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదా? అమరావతి రైతులు పెయిడ్ ఆర్టిస్టులే అన్న వాదనకు బిజెపి కట్టుబడి ఉందా? దళితుడైన శ్రీనివాసరావును ఏమైనా అంటే తమ మెడకు చుట్టుకుంటుందని బాగా తెలిసిన బిజెపి నాయకులు చర్చను చంద్రబాబు పైకి మళ్లించేందుకు శతవిధాలా ప్రయత్నం చేస్తున్నారు.

బిజెపిలో అంతర్గతంగా చర్చలు

అమరావతి ఉద్యమానికి పూర్తి మద్దతుగా నిలిచిన కన్నా లక్ష్మీనారాయణను తొలగించి బిజెపి అధిష్టానం సోము వీర్రాజును బిజెపి రాష్ట్ర అధ్యక్షుడుగా చేసిన నాటి నుంచి బిజెపిలోనే అంతర్గతంగా ఈ అంశంపై చర్చలు జరుగుతున్నాయి.

అమరావతికి అనుకూలంగా మాట్లాడిన వారిని సోము వీర్రాజు పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. (తర్వాత వారిపై అధిష్టానం సస్పెన్షన్ ఎత్తేసింది) బిజెపి అగ్ర నాయకులైన సోము వీర్రాజు, జీవీఎల్ నర్సింహారావు, విష్ణువర్ధన్ రెడ్డిలు చంద్రబాబునాయుడిని విమర్శించడంలో ముందు వరుసలో ఉంటారు.

వారు చంద్రబాబునాయుడిపై చేసే విమర్శలు  వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని సపోర్టు చేసే విధంగానే ఉంటాయి. రామతీర్ధం లో రాముడి విగ్రహానికి తలతీసేసిన సంఘటనపై చంద్రబాబునాయుడిని కొండపైకి అనుమతించారు, నన్ను ఎందుకు కొండపైకి వెళ్లనివ్వరు అంటూ సోమువీర్రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు తప్ప తనను అడ్డుకున్న ప్రభుత్వంపై పోరాటాన్ని మధ్యలోనే ఆపేశారు.

రాజకీయం అంటే ఉక్రోషంతో చేసేది కాదు. తెలివితేటలతో, సమయానుకూలంగా వ్యవహరించడమే రాజకీయం. అలా కాకుండా కేవలం ఉక్రోషంతో రాజకీయాలు చేస్తే ఏబిఎన్ ఆంధ్రజ్యోతి చర్చాకార్యక్రమంలో జరిగిన సంఘటనలే రిపీట్ అవుతాయి.    

Related posts

జ‌న‌వ‌రి 19 వరకు శ్రీవారి ఆలయంలో అధ్యయనోత్సవాలు

Satyam NEWS

ఏపిలో స్థానిక సంస్థల ఎన్నికలు ఇక లేనట్లేనా?

Satyam NEWS

దళిత విద్యార్ధి నల్లపు రమ్య హత్య అతి దారుణం

Satyam NEWS

Leave a Comment