తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి పరిస్థితి ఏమిటి? ఇదేం ప్రశ్న? బాగానే ఉన్నాడు కదా అని అనవచ్చు. కానీ బాగాలేదు. ఆయన కాంగ్రెస్ పార్టీ లో కొనసాగుతారా లేదా అనేది పెద్ద ప్రశ్నగానే ఇప్పటికీ ఉంది. ఆయన సొంత పార్టీ పెట్టుకుంటారని కూడా వినిపిస్తున్నది. రేవంత్ రెడ్డి సొంత పార్టీ పెట్టి దానికి బిజెపి సపోర్టు చేస్తే… ఇక తిరుగే ఉండదు. ఇదీ ప్రస్తుతం నడుస్తున్న ఆలోచన.
అందుకే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ తో సంబంధం లేకుండా కార్యక్రమాలు ప్లాన్ చేసుకుంటున్నారు. తెలంగాణ రాష్ట్రంలో చరిష్మా ఉన్న నాయకుడుగా రేవంత్ రెడ్డికి ఒక ప్రత్యేకత ఉంది. కాంగ్రెస్ పార్టీలో ఇటీవల తనకు నచ్చని ఎన్నో అంశాలు జరుగుతుండటంతో ఆయన ఇబ్బందిగా ఉన్నారు. హుజూర్ నగర్ ఉప ఎన్నికలో రేవంత్ రెడ్డి మాట అస్సలు నెగ్గలేదు. దాంతో ఆయన ప్రచారానికి కూడా దూరంగా ఉన్నారు.
భవిష్యత్తులో కూడా ఆయన కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండి సొంత పార్టీ వైపు పయనిస్తున్నారని అనుకుంటున్నారు. తన బలాన్ని నిరూపించుకునేందుకు ప్రస్తుతం ఆర్టీసీ సమ్మె ను ఉపయోగించుకోవాలని కూడా రేవంత్ రెడ్డి అనుకుంటున్నారు. ఆర్టీసీ కార్మికుల సమ్మెకు సంబంధించి ప్రత్యక్ష కార్యాచరణకు ఆయన రావచ్చని కూడా చెబుతున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ఆర్టీసీ కార్మికుల సమ్మెకు అధికారికంగా మద్దతు ఇస్తున్నందున రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ తరపున వారికి మద్దతు ఇవ్వాలా లేక పార్టీ రహితంగా మద్దతు ఇవ్వాలా అనే అలోచనలో ఉన్నట్లు చెబుతున్నారు.
ఏది ఏమైనా ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ఉన్నందున, కాంగ్రెస్ పార్టీ అధికారికంగా సమ్మెకు మద్దతు ఇచ్చినందున ప్రత్యక్ష కార్యాచరణకు దిగితే ఎవరికి అభ్యంతరం ఉండదని రేవంత్ రెడ్డి అనుకుంటున్నారు. ఆర్టీసీ కార్మికుల సమ్మెకు సంబంధించిన అంశం పూర్తి అయిన తర్వాత ప్రజా క్షేత్రంలో మరొక అంశంతో రేవంత్ రెడ్డి ముందుకు రావచ్చునని, ఈ విధంగా ఈ ఏడాది అంతా అయిన తర్వాత వచ్చే ఏడాది సొంత పార్టీ ప్రకటన వెలువడవచ్చునని అంటున్నారు.
రేవంత్ రెడ్డి సొంత పార్టీ పెట్టేందుకు ఇంత కాలం కాంగ్రెస్ సీనియర్ నాయకుడు దివంగత ఎస్ జైపాల్ రెడ్డి అడ్డుగా ఉండేవారు. రేవంత్ రెడ్డి సొంత పార్టీ పెట్టేందుకు ఆయన పూర్తిగా వ్యతిరేకంగా ఉండేవారు. ఇప్పుడు ఆయన కూడా లేనందున రేవంత్ రెడ్డి తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సొంత పార్టీ వైపు మొగ్గు చూపే అవకాశమే ఎక్కువగా కనిపిస్తున్నది. పార్టీ ఆవిర్భవించిన తర్వాత ఆ పరిస్థితులను బట్టి బిజెపితో సఖ్యతగా ఉండాలా లేక స్వతంత్రంగా వ్యవహరించాలా అనేది నిర్ణయించుకుంటారు. బిజెపిలో నేరుగా చేరడం వల్ల తాను కూడా నాగం జనార్ధన్ రెడ్డిలాగా తయారవ్వాల్సి వస్తుందని రేవంత్ రెడ్డి అనుకుంటున్నారు. అందుకే సొంత పార్టీ ఆలోచన చేస్తున్నారు