ఏపీలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన పార్టీకి చెందిన సోషల్ మీడియా విభాగాన్ని ప్రక్షాళన చేస్తారని కొద్ది రోజులుగా బలంగా వార్తలు వస్తున్నాయి. గత ఐదేళ్లుగా ఆ బాధ్యతలు చూసిన సజ్జల భార్గవ్ రెడ్డి సమర్థత ఏపాటిదో గత ఎన్నికలతోనే అర్థం అయిపోయిది. దీంతో సజ్జల భార్గవ రెడ్డి ఆ స్థానానికి అన్ ఫిట్ అని జగన్ నిర్ణయానికి వచ్చేశారు. దీంతో సజ్జల భార్గవ రెడ్డి స్థానంలో పశ్చిమగోదావరికి చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువనేత కారుమూరి సునీల్ కుమార్ యాదవ్ ను పార్టీ సోషల్ మీడియా విభాగానికి నేతృత్వం వహించేలా జగన్ బాధ్యతలు అప్పజెప్పబోతున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి.
కుల సమీకరణాలకు అతీతంగా పార్టీ కార్యక్రమాల్లో ఉత్సాహం, ప్రతిభ, చురుగ్గా పాల్గొనడాన్ని పరిశీలించిన తర్వాత బీసీ సామాజికవర్గానికి చెందిన సునీల్‌ను వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ఎంపిక చేసినట్లు సమాచారం. పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు కుమారుడు ఈ సునీల్ కుమార్ యాదవ్. అప్పటి సిట్టింగ్ ఎంపీ కోటగిరి శ్రీధర్ పోటీ చేసేందుకు ఆసక్తి చూపకపోవడంతో ఆయనకు ఏలూరు లోక్‌సభ స్థానం నుంచి పార్టీ టిక్కెట్టు ఇచ్చారు. అదే సమయంలో, సునీల్ పార్టీకి నమ్మకమైన వ్యక్తిగా పేరు పొందారు. ఇంకా సోషల్ మీడియాలో కూడా చురుగ్గా ఉండడంతో, అతను ఈ సోషల్ మీడియా వింగ్‌ను సమర్థవంతంగా నిర్వహించగలడని జగన్ విశ్వసించారని అంటున్నారు.
ఎలాంటి ఆధారం లేకుండా మెసేజ్‌లను గుడ్డిగా పోస్ట్ చేయకుండా, వాటిని పోస్ట్ చేసే ముందు వాస్తవాలను క్రాస్ చెక్ చేసుకోగలగాలని అతనికి జగన్ ముందే చెప్పినట్లు తెలిసింది. నరసరావుపేటకు చెందిన నాగార్జున యాదవ్‌ను సోషల్ మీడియా వింగ్ హెడ్‌గా జగన్ గుర్తించారని మొదట్లో వార్తలు వచ్చాయి, అయితే చివరకు సునీల్ కుమార్ యాదవ్‌కు జగన్ ఆ బాధ్యతలు ఇచ్చారని పార్టీ వర్గాలు తెలిపాయి. ఆ తర్వాత బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డికి కూడా సోషల్ మీడియా బాధ్యతలు ఇస్తారని ప్రచారం జరిగింది. కానీ, జగన్ మాత్రం సునీల్ కుమార్ నే ఎంపిక చేశారు.
అయితే, గతంలో సజ్జల భార్గవ రెడ్డి వైసీపీ సోషల్ మీడియా వింగ్ పరువును గంగలో కలిపేసేలా పోస్టులు చేసేవారనే వాదన ఉంది. ఏ అంశంపై ఎలా ప్రచారం చేయాలో ఆయనకు అవగాహన లేకపోవడమే కారణమని పార్టీ నేతలు చెబుతుంటారు. ఓవైపు సజ్జల రామక్రిష్ణా రెడ్డి ప్రభుత్వ సలహాదారుగా చక్రం తిప్పుతూనే ఆయన తన కుమారుడికి సోషల్ మీడియా ఇంఛార్జి బాధ్యతలు ఇప్పించుకున్నారు. అలా రికమండేషన్ మీద వచ్చిన ఆ పొజిషన్‌తో వైసీపీ భారీ నష్టాన్ని చవి చూడాల్సి వచ్చిందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.