తిక్కవరపు రమణారెడ్డి ఎన్నో పాత్రల్లో జీవించిన గొప్ప నటుడు. తన పాత్రల పట్ల అవగాహన కలిగి నిబద్ధతతో నటించిన మహానటుడు రమణారెడ్డి అని పద్మశ్రీ ,డాక్టర్ బ్రహ్మానందం పేర్కొన్నారు. ‘నవ్వుల మాంత్రికుడు రమణారెడ్డి’ పుస్తకాన్ని ఆయన తన స్వగృహంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా తన ప్రసంగాన్ని ఇలా కొనసాగించారు. రమణారెడ్డి పేరు వినడానికి హాయిగా, ఆనందంగా, ఆహ్లాదంగా ఉంటుంది.
ఒక విధంగా నవ్వు పుట్టించే విధంగా కూడా ఉంటుంది. ఆరడుగుల బక్క పల్చని శరీరంతో నటించిన మహనీయుడు. చలన చిత్ర పరిశ్రమలో తనదొక ధోరణిని అలవర్చుకున్నవాడు. నెల్లూరు యాసను తను నటించిన అన్ని సినిమాల్లో బతికించాడు. తద్వారా తెలుగు సాహిత్యాన్ని కూడా నిలబెట్టాడు. రమణారెడ్డి గురించి నీకు ఎలా తెలుసని అడగవచ్చు. వ్యక్తిగతంగా తెలియాల్సిన అవసరం లేదు. మహానుభావుల గురించి మనం మాట్లాడుతాం. ఇది అంతే. ఆయన గురించి మాట్లాడే అదృష్టం నాకు కలిగింది.
ఆయన జీవిత చరిత్రను మనకు అందించాలనే ఆలోచనతో మూవీ వాల్యూం సంస్థ అధిపతి జీలాన్ బాషా ద్వారా ప్రయత్నం జరగడం గొప్ప విషయం. ఇలాంటి గొప్ప నటులను పరిచయం చేయాలనే ఉద్దేశం కలగడం చాలా ఆనందంగా ఉంది. ఈ పుస్తకాన్ని ఆదరించండి. నెల్లూరు జిల్లాకు చెందిన సీనియర్ జర్నలిస్టు ఫయాజ్ ఈ పుస్తకాన్ని రాయడానికి చాలా శ్రమ పడ్డారు. సుదీర్ఘమైన జర్నలిజం అనుభవంతో ఆయన ఈ పుస్తకాన్ని రచించారు. ఆయన మరెన్నో పుస్తకాలను అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
సీనియర్ జర్నలిస్ట్ ఉదయగిరి ఫయాజ్ ఈ సందర్భంగా మాట్లాడుతూ రమణారెడ్డి పేరు వింటేనే పాతతరం వాళ్లకు పెదవులపై నవ్వు విచ్చుకునేది. కారణం ఆయన ఆకారం. ఆరడుగులు ఉండి సన్నగా ఉండే రమణారెడ్డి ఏ పాత్రలోకైనా ప్రవేశం చేయగలరు. హాస్య సన్నివేశమైనా, సీరియస్ సన్నివేశమైనా సమపాళ్లల్లో చేసి దానికి న్యాయం చేయగలరు. నెల్లూరు జిల్లాలో పుట్టి సాంఘికల్లోనూ, జానపదాల్లోనూ, పౌరాణికాల్లోనూ నెల్లూరు యాసకు ప్రాణ ప్రతిష్ట చేసిన వ్యక్తి రమణారెడ్డి. ఆయన గురించి పుస్తకం రాసే అవకాశం నాకు కలిగింది.
మూవీ వాల్యూం అధినేత జీలాన్ బాషా నాకు ఈ అవకాశాన్ని కల్పించారు. ఈ పుస్తకం పద్మశ్రీ, డాక్టర్ బ్రహ్మానందం గారి చేతుల మీదుగా ఆవిష్కారం జరగడం ఆనందం కలిగించే విషయం. రమణారెడ్డి బతికింది 53 ఏళ్లే అయినా, చాలా మంచి సినిమాలు చేశారు. రమణారెడ్డి జీవిత చరిత్రను సమగ్రంగా రాయడానికి నేను ప్రయత్నించాను. మీరు దీని చక్కగా చదివితే దాని ప్రయోజనం నెరవేరుతుందని ఆశిస్తున్నాను. మూవీ వాల్యూం అధినేత, పబ్లిషర్ జీలాన్ బాషా ఈ సందర్భంగా మాట్లాడుతూ రమణా రెడ్ది గారి లాంటి లెజెండరి పర్సనాలిటి గురించి మా కంపెని ద్వారా పుస్తకం రావడం చాలా సంతోషంగా ఉంది.
ఈ పుస్తకం విషయం లో మాకు సహకరించిన రమణా రెడ్ది గారి పెద్దబ్బాయి ప్రభాకర్ రెడ్ది కి కృతఙ్ఞతలు. అదే విధంగా పుస్తక రచయిత ఫయాజ్ గారు చాలా రీసర్చ్ చేసి ఈ పుస్తకాన్ని తీర్చిదిద్దారు. పుస్తకం ఔట్ పుట్ విషయంలో మేం చాల సంతోషంగా ఉన్నాం. ఇక కామెడి కింగ్ పద్మ శ్రీ బ్రహ్మానందం గారు ఈ పుస్తకాన్ని ఆవిష్కరించడమనేది మా అదృష్టం. అంతేకాక పుస్తకాల విషయం లో ఆయన ఇచ్చిన ప్రోత్సాహాం మరువలేనిది.
బ్రహ్మానందం గారికి మా మూవీ వాల్యూం తరపున ప్రత్యేక కృతఙ్ఞతలు. మా మొదటి పుస్తకం ‘జై విఠలాచార్య’ లాగే నవ్వుల మాంత్రికుడు రమణా రెడ్డి పుస్తకాన్ని ఆదరిస్తారని కోరుకుంటున్నాం. ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్ట్, రచయిత వినాయకరావు పాల్గొన్నారు.