39.2 C
Hyderabad
March 28, 2024 14: 10 PM
Slider మెదక్

దేశాన్ని అప్పుల ఊబిలోకి నెట్టివేసే బడ్జెట్‌

#harish

కేంద్ర బడ్జెట్ పై ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు ఫైర్ అయ్యారు. తెలంగాణకు మొండిచేయి చూపిన బడ్జెట్
ఇది అని ఆయన వ్యాఖ్యానించారు. ఇంకా ఆయన ఏమన్నారంటే…. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌ రైతు, పేదల వ్యతిరేక బడ్జెట్‌. అందమైన మాటలు తప్ప.. నిధుల కేటాయింపులో డొల్లనే ఉన్నది. 7 ప్రాధాన్యత రంగాలన్నారు. అసలు ఉన్న రంగాలను గాలికి వదిలివేశారు. దేశ రైతాంగాన్ని, అభివద్ధి చెందుతున్న రాష్ట్రాలను నిరుత్సాహపరిచే బడ్జెట్‌.

తెలంగాణ రాష్ట్రానికి మరోసారి తీవ్ర అన్యాయం చేసిన బడ్జెట్‌ ఇది. తొమ్మిదేళ్లుగా తెలంగాణ అడుగుతున్న రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీ గురించి మాటలేదు.. గిరిజన యూనివర్సిటీకి ఇచ్చిన నిధులు తూతూమంత్రమే. విభజన హామీలను ఏ ఒక్కటి అమలు చేయలేదు. జాతీయ ప్రాజెక్టు హోదా ఇవ్వలేదు. రాష్ట్రంలోని నేతన్నలకు సంబంధించి జీఎస్టీ రాయితీలు కానీ, వారికి ప్రత్యేక ప్రోత్సాహాలు ఇవ్వడం కానీ చేయలేదు. కొత్త రాష్ట్రానికి ప్రోత్సాహకాలు ఇవ్వాలని అనేకసార్లు కోరాం.. కానీ,

ఇప్పటి వరకు ఇచ్చిందేమీ లేదు.. ఈ బడ్జెట్‌లో కూడా ఇస్తామన్నది ఏమీ లేదు. పారిశ్రామిక వాడలకు సంబంధించి తెలంగాణకు ఒక్కటంటె ఒక్కటి కూడా కొత్తగా ఇస్తామన్నది లేదు. బడ్జెట్‌లో రైతులకు సంబంధించిన నిధుల్లో భారీగా కోత పెట్టారు. ఎరువుల సబ్సిడీలు తగ్గించారు, గ్రామీణ ఉపాధి హామి నిధుల్లో కోత పెట్టారు, ఆహార సబ్సిడీలు తగ్గించారు. కేంద్ర ఆర్థిక సంఘం సిఫార్సులను అమలు చేస్తామని చెప్పలేదు. ఉద్యోగులకు, సింగరేణి కార్మికులకు ఇచ్చిన పన్ను మినహాయింపులు కూడా ఆశాజనకంగా ఏమీ లేదు. ఉద్యోగులను సైతం భ్రమల్లో పెట్టారు. ఇక సెస్సుల భారం తగ్గించలేదు.. పన్నుల భారం నుంచి ఉపశమనం లేదు. ఇదో భ్రమల బడ్జెట్‌. పేదల వ్యతిరేక బడ్జెట్‌. తెలంగాణకు మొండి చేయి చూపిన బడ్జెట్.

1, ఉపాధి హామి పథకానికి కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ లో నిధుల కోత విధించింది. గత బడ్జెట్ లో 89,400 కోట్లు కేటాయించగా, ఈసారి బడ్జెట్ లో 60వేల కోట్లకు కుదించడం జరిగింది. అంటే 29,400 కోట్లు తగ్గించింది. 32.9శాతం తగ్గించి, ఉపాధి హామి కూలీల ఉసురును తీసుకునే విధంగా కేంద్రం ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది.
2, పేదల ఆహార భద్రత నిధుల్లో భారీ కోత. 2022-23లో 2,87,194 కోట్లు నిధులు కేటాయించగా, ఈసారి 1,97,350 కోట్లకు తగ్గించడం జరిగింది. అంటే, 89,844 కోట్లు ఈ బడ్జెట్లో ఫుడ్ సబ్సిడీకి కోత విధించడం జరిగింది. ఇది గతేడాదితో పోల్చితే 31శాతం నిధుల్లో కోత.

3, దేశంలో వివిధ రాష్ట్రాలకు కేంద్రం 157 మెడికల్ కాలేజీలు మంజూరు చేస్తే, తెలంగాణకు ఒక్కటి కూడా ఇవ్వలేదు. పైగా ఇప్పుడు నర్సింగ్ కాలేజీలను కూడా గతంలో ఇచ్చిన 157 మెడికల్ కాలేజీలు ఇచ్చిన ప్రాంతాలకు ఇస్తున్నట్లు ప్రకటించింది. అంటే గతంలో మెడికల్ కాలేజీల విషయంలో తెలంగాణకు మొండి చేయి చూపిన కేంద్రం, ఇప్పుడు మరోసారి తెలంగాణకు నర్సింగ్ కాలేజీల విషయంలోనూ మొండి చేయి చూపింది. తెలంగాణను తీవ్ర అన్యాయం చేసింది.

4, విభజన చట్టంలో పొందుపరిచిన విధంగా తెలంగాణకు వెనుకబడ్డ ప్రాంతాల నిధిగా మూడేళ్ల నుంచి హక్కుగా రావాల్సిన రూ. 1350 కోట్లు ఇవ్వకుండా మొండి చేయి చూపిన కేంద్రం.. ప్రస్తుత బడ్జెట్ లో కర్ణాటకలోని కరువు, వెనుకబడ్డ ప్రాంతాల డెవలప్మెంట్ కోసం రూ. 5300 కోట్లకు కేటాయించింది. పార్లమెంట్ చట్టంతో హక్కుగా రావాల్సిన నిధులను తెలంగాణకు ఇవ్వకుండా, మరికొద్ది నెలల్లో ఎన్నికలు జరుగనున్న కర్ణాటకకు మాత్రం కేంద్ర బడ్జెట్లో ప్రాధాన్యం కల్పించారు. ఇది పూర్తి పక్షపాత వైఖరి.

5, పీఎం కిసాన్ నిధి కోసం గతేడాది 68 వేల కోట్లు బడ్జెట్ కేటాయించగా, ఈసారి బడ్జెట్లో 60వేల కోట్లకు కేంద్రం తగ్గించింది. ఇదే సమయంలో లబ్ధి పొందే రైతుల సంఖ్యను సైతం కేంద్రం కుదిస్తూ వస్తున్నది. పీఎం కిసాన్ గతంలో 11.27 కోట్ల మంది రైతులు లబ్ధిపొందగా, ఇప్పుడు ఆ రైతుల సంఖ్యను 8.99 కోట్లకు తగ్గించడం జరిగింది.

6, రైతులకు ఇచ్చే ఎరువుల సబ్సిడీలో భారీ కోత. 2022- 23 ఆర్ ఇలో 2, 25, 220 నిధులు కేటాయించగా, ఈ ఆర్థిక సంవత్సరంలో 1,75,100కు తగ్గించారు. అంటే నేరుగా 50,120 కోట్లు కోత విధించడం జరిగింది. గత సంవత్సరంతో పోల్చితే ఎరువుల సబ్సిడీలో 20 శాతం కోత.

7, పత్తి మద్దతు ధరకు కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకు ద్వారా కొనుగోలు చేసేందుకు గతేడాది బడ్జెట్లో రూ. 9243 కోట్లు కేటాయించగా, ఈ సారి బడ్జెట్లో కేవలం ఒక లక్ష రూపాయలు మాత్రమే కేటాయించారు. ఇది పత్తి పండించే రైతులకు తీవ్ర నష్టం చేసే చర్య.

8, రాష్ట్రీయ క్రిషి వికాస్ యోజన కింద గతేడాది బడ్జెట్లో 10,433 కోట్లు కేటాయించగా, ఈసారి బడ్జెట్లో 7,150 కు తగ్గించడం జరిగింది. అంటే 3,283 కోట్లు కోత విధించడం జరిగింది. ఇది పూర్తి రైతు వ్యతిరేక బడ్జెట్ అనడానికి ఇదొక నిదర్శనం.

9, మైనార్టీల కోసం గతేడాది బడ్జెట్లో 5020 కోట్లు కేటాయించగా, ఈసారి బడ్జెట్లో 3097 కోట్లకు కుదించడం జరిగింది. అంటే 1923 కోట్లు కోత విధించడం జరిగింది.

10, విద్యుత్ సంస్కరణలు అమలు చేస్తేనే, 0.5 శాతం ఎఫ్ ఆర్ బీ ఎం అనుమతిస్తామని షరతు పెట్టడం జరిగింది. అంటే బోరు బాయిల కాడ మీటర్లు పెట్టి, రైతుల ఇంటికి బిల్లు పంపించాలని చెప్పకనే చెప్పారు. మన రాష్ట్రం ఇప్పటికే మీటర్లు పెట్టబోమని ఖరాకండిగా చెప్పిన విషయం తెలిసిందే. అంటే ఈ నిబంధన వల్ల మన రాష్ట్రానికి మరో 6 వేల కోట్లు రాకుండా పోతాయి.

11, స్థానిక సంస్థలకు 15వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు నిధులు ఖచ్చితంగా విడుదల చేయాలి. కానీ ఆ నిధుల విడుదలలో కూడా కేంద్రం కోత విధించి, గ్రామీణ, పట్టణ, స్థానిక సంస్థలకు తీవ్ర అన్యాయం చేసింది. పట్టణ స్థానిక సంస్థలకు 2022-23 బీ ఈలో 22,908 కోట్లు ప్రతిపాదించి, 202-23 ఆర్ ఇ (సవరించిన పద్దుల ప్రకారం) లో దాన్ని 15,026 కోట్లకు కుదించడం జరిగింది. అంటే పట్టణ స్థానిక సంస్థలకు 7882 కోట్లు కోత విధించారు. 34.4శాతం కోత విధించారు.

గ్రామీణ స్థానిక సంస్థలకు 2022,23 బీఈలో 46513 కోట్లు, ప్రతిపాదించగా, ఆర్ ఇలో 41వేల కోట్లకు కుదించడం జరిగింది. గ్రామీణ స్థానిక సంస్థలకు ప్రతిపాదించిన బడ్జెట్లో 11.85శాతం అనగా 5513 కోట్లను తగ్గించడం జరిగింది. ఈ చర్యలు కేంద్ర ప్రభుత్వం పట్టణ, గ్రామీణ సంస్థల పట్ల చిన్నచూపు చూడటం. అదే విధంగా ఫైనాన్స్ కమిషన్ నుంచి ఆరోగ్య రంగానికి నిధుల కేటాయింపులో కూడా 4297 కోట్ల కోత విధించారు. 2022-23 బీఈలో 13,192 కోట్లు కేటాయించగా, ఆర్ ఇలో 8895 కుదించారు. అంటే ప్రతిపాదించిన బడ్జెట్లో 32.6శాతం కోత విధించారు.

12, 2023-24 నికర అప్పులు 17,86,816 కోట్లు అని కేంద్రం తన బడ్జెట్లో ప్రతిపాదించడం జరిగింది. ఇందులో సింహభాగం 8,69,855 కోట్లు రెవెన్యూ లోటును భర్తీ చేయడానికే ప్రతిపాదించారు. అప్పులను క్యాపిటల్ ఎక్స్పెండీచర్ కోసం కాకుండా, 48.7శాతాన్ని రోజువారీ ఖర్చుల కోసం ప్రతిపాదించడం ఆర్థిక వ్యవస్థకు చేటు తెస్తుంది.

13, 1979-80 నుంచి కేంద్రంలో రెవెన్యూ లోటు క్రమంగా పెరుగుతూ వస్తున్నది. 1979-80లో 694 కోట్ల రెవెన్యూ లోటు ఉండగా, 2022-23 సవరించిన అంచనాల ప్రకారం, 11,10,546 కోట్లకు పెరిగింది. ఇది ఎఫ్ ఆర్ బీ ఎం చట్టానికి విరుద్ధం. రాష్ట్రాలు ఎఫ్ ఆర్ బీ ఎం నిబంధనలు పాటించినప్పటకీ, కేంద్రం పాటించకపోవడం వల్ల దేశ ఆర్థిక క్రమశిక్షణ దెబ్బతినే అవకాశం ఉంటుంది. కేంద్రం బాగా పని చేస్తున్న రాష్ట్రాలపై కూడా ఎఫ్ ఆర్ బి ఎం నిబంధనలు కచ్చితంగా అమలు చేస్తూ, తాను మాత్రం ఎప్పటికప్పుడు ఎఫ్ ఆర్ బీ ఎం నిబంధనలు ఉల్లంఘిస్తూ, తన చేతిలో ఉన్న అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ, మినహాయింపులు తీసుకుంటున్నది.

14, మొత్తం కేంద్రం పన్నుల వసూలు 2022-23లో 33,68,858 కోట్లుగా అంచనా వేయడం జరిగింది. ఇందులో రాష్ట్రాల వాటా 10,21, 488 కోట్లుగా అంచనా వేయడం జరిగింది. కేంద్రం వసూలు చేసే మొత్తం పన్నుల ఆదాయంలో 30.4శాతం మాత్రమే రాష్ట్రాలకు కేంద్రం ఇస్తున్నది. నిజానికి, 15వ ఆర్థిక సంఘం సిఫార్సుల ప్రకారం, కేంద్రం వసూలు చేసే పన్నుల్లో 41శాతం రాష్ట్రలకు ఇవ్వాలి. సెస్సులు, సర్ ఛార్జీలు విధించడం వల్ల రాష్ట్రాలకు వచ్చే పన్నుల వాటా చాలా తగ్గిపోతున్నది. చెబుతున్నది 41శాతం అయినా, రాష్ట్రాలకు నిజంగా అందుతున్నది మాత్రం 30శాతమే.

మరోవైపు పన్నుల్లో వాటా పెంచామని, కేంద్ర ప్రాయోజిత పథకాల్లో రాష్ట్రాల వాటాను పెంచడం, వివిధ కేంద్ర ప్రాయోజిత ప్రభుత్వ పథకాలను కుదించడం జరిగింది. ఈ విధానాల వల్ల రాష్ట్ర ప్రభుత్వాలు రెండు రకాలుగా నష్టపోతున్నాయి.

Related posts

గ్రీన్ ఛాలెంజ్ మొక్కలను నాటిన పోలీస్ అధికారులు

Satyam NEWS

అలనాటి అందాల హీరోయిన్ ఎల్. విజయలక్ష్మి కి యన్టీఆర్ అవార్డ్

Bhavani

బతుకమ్మ సంబురాలు: చీర అదిరె ఆడపడుచు మురిసే

Satyam NEWS

Leave a Comment