25.2 C
Hyderabad
January 21, 2025 11: 18 AM
Slider విశాఖపట్నం

అభివృద్ధి ప్రదాతలకు అద్భుత నీరాజనం

#modi

విశాఖపట్నంలో అభివృద్ధి సంబరం అంబరాన్ని తాకింది. రాష్ట్రవ్యాప్తంగా రూ.2.08 లక్షల కోట్ల పైచిలుకు పెట్టుబడులతో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలకు విచ్చేసిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కి విశాఖ వాసులతో పాటు యావత్ రాష్ట్ర ప్రజలు అద్భుత స్వాగతం పలికారు.

రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో కలసి మోదీ విశాఖ పురవీధుల్లో నిర్వహించిన రోడ్ షో ఆద్యంతం నభూతో నభవిష్యత్ అన్న చందంగా సాగింది. సిరిపురం జంక్షన్ నుంచి ఏయూ ఇంజినీరింగ్ కళాశాల మైదానం వరకు రాష్ట్రం నలుమూలల నుంచి లక్షలాదిగా తరలివచ్చిన ప్రజలు రహదారికి ఇరువైపులా నిలబడి ఎన్డీఏ నాయక త్రయానికి పూల వర్షంతో ముంచెత్తుతూ స్వాగతం పలికారు.

ప్రధాని నరేంద్ర మోదీ తో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు కి, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి బ్రహ్మరథం పట్టారు. రోడ్ షో ఆధ్యంతం జయహో మోదీజీ.. జయహో చంద్రబాబు.. జయజయహో జనసేనాని నినాదాలతో మార్మోగింది. రహదారి పొడుగునా ఉత్తరాంధ్ర సంప్రదాయ నృత్యాలు, తప్పెటగుళ్ల కళాకారులు వాద్యాలతో స్వాగతం పలికారు. బుధవారం సాయంత్రం గం. 4.45 నిమిషాలకు ఐఎన్ఎస్ డేగా నుంచి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కలసి నరేంద్ర మోదీ విశాఖ సిరిపురం జంక్షన్ కి చేరుకున్నారు. ముగ్గురు నేతలు రోడ్ షో కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక వాహనంపైకి ఎక్కి ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు కదిలారు.

రోడ్ షో మొదలవగానే ఒక్కసారిగా సంబరాలు మిన్నంటాయి. ప్రజల ఎన్డీఏ అనుకూల నినాదాలతో ఈ ప్రాంతం మొత్తం దద్దరిల్లింది. పూల వర్షం మధ్య ప్రజలకు అభివాదం చేస్తూ ప్రధాని మోదీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ముందుకు సాగారు. జనసంద్రమైన విశాఖ పురవీధుల్లో సుమారు కిలోమీటరు మేర 45 నిమిషాల పాటు ఈ రోడ్ షో సాగింది. రోడ్ షో సాగిన ప్రాంతంతో పాటు విశాఖ నగరం మొత్తం కూటమి పక్షాలైన జనసేన, తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీల జెండాలు, భారీ స్వాగత హోర్డింగులతో నిండిపోయింది.

కూటమి ప్రభుత్వం ద్వారా తమ ఆకాంక్షలు నెరవేర్చేందుకు, తమ బిడ్డలకు భవిష్యత్తు ప్రసాదించేందుకు వచ్చిన గౌరవ ప్రధాన మంత్రి కి ధన్యవాదాలు తెలిపేందుకు ప్రజలు తరలి వచ్చి ప్లకార్డులతో తమ ఉద్దేశాన్ని అభిమాన నేతలకు తెలియజేశారు. ప్రజల హర్షధ్వానాల మధ్య మోదీ, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ సభా ప్రాంగణానికి చేరుకున్నారు.

Related posts

విద్యాసంస్థల రీ-ఓపెన్ కు కేంద్ర మార్గదర్శకాలు ఇవే

Satyam NEWS

పుంగనూరులో మంత్రి పెద్దిరెడ్డికి పోలీసు అధికారుల వత్తాసు

Satyam NEWS

వక్ఫ్ బోర్డు అధికారులకు కనువిప్పు కలగాలని అల్లాకు వినతి

Satyam NEWS

Leave a Comment