27.7 C
Hyderabad
March 29, 2024 02: 07 AM
Slider జాతీయం

కొత్త వాదం: స్టాలిన్ ‘సామాజిక న్యాయం’

#mkstalin

సామాజిక న్యాయం దిశగా ‘భారతీయ సమాఖ్య’ ను వ్యవస్థాపిస్తానని తమిళనాడు ముఖ్యమంత్రి ఎం కె స్టాలిన్ ఇటీవల ప్రకటించారు. ఈ ప్రకటన చేసిన సరిగ్గా వారం రోజుల తర్వాత దేశంలోని 37 విపక్ష పార్టీల నేతలకు ఉత్తరాలు రాశారు. ఆయా పార్టీల ప్రతినిధుల పేర్లను కోరుతూ తన ఆశయాలను అందులో వివరించారు. తమతో భాగస్వామిగా ఉన్న కాంగ్రెస్ తో పాటు రాష్ట్రీయ జనతాదళ్, తృణమూల్ కాంగ్రెస్, వామపక్షాలను కూడా ఉద్దేశిస్తూ లేఖ రాశారు. ఆశ్చర్యంగా,తమకు బద్ధశత్రువైన ఏ ఐ ఏ డి ఎం కె ను కూడా ఈ సమాఖ్యలోకి ఆహ్వానించారు.

సామాజిక న్యాయం సక్రమంగా ఆచరణలో నోచుకొనేలా యుద్దానికి సిద్ధమవ్వాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ దిశగా ప్రయాణం చేయడానికి ‘రోడ్ మ్యాప్’ ను నిర్మించే వేదిక ఈ సమాఖ్య అంటూ అభివర్ణించారు. ఒక పక్క,దేశంలోని ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల పోరు హోరుగా సాగుతోంది. ఇంకో పక్కన,కేంద్రం విడుదల చేసిన 2022-23 బడ్జెట్ పై తీవ్ర వ్యతిరేకతలు వ్యక్తమవుతున్నాయి.

సంచలనం సృష్టించిన కేసీఆర్ ప్రకటన

మరో పక్క, పెగాసస్ పై విపక్షాలు మండిపడుతున్నాయి. వీటికి అదనంగా,అసలు రాజ్యాంగాన్నే మార్చాలంటూ తెలంగాణ ముఖ్యమంత్రి కె సీ ఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సమాఖ్య స్ఫూర్తిని సాధించే దిశగా, జాతీయ స్థాయిలో అందరూ ఏకమవ్వాలని కె సీ ఆర్ ఎప్పటి నుంచో అంటున్నారు. ఇటువంటి వేడివాతావరణంలో తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ఇచ్చిన పిలుపు ఆసక్తికరంగా మారింది.

తమిళనాడులో మొదటి నుంచీ బీసీల నినాదం బలంగా వినిపిస్తోంది. దానిని అన్ని రాష్ట్రాలలోనూ వినిపించి,జాతీయ నినాదంగా మలచడానికి స్టాలిన్ కంకణం కట్టుకుంటున్నట్లు కనిపిస్తోంది. రాజకీయ అవసరాలను తీర్చుకోవడంతో పాటు,దళితుల అభ్యున్నతి కోసం పాటుబడిన నాయకురాలుగా ఇందిరాగాంధీకి ఎంతో పేరు వచ్చింది.

దానికి తగినట్లుగా ఓటుబ్యాంక్ ను సాధించడంలోనూ ఆమె విజయాన్ని సాధించారు.’మండల కమీషన్’ ద్వారా బీసీల ప్రగతికి బలంగా కృషి చేసిన నేతగా మాజీ ప్రధానమంత్రి వి పి సింగ్ ( విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ ) చరిత్రలో మిగిలిపోయారు. నిరాదరణకు గురైన, వెనుకబడిన వర్గాల కోసం ఆ స్థాయిలో కృషిచేసిన నేతలు ఇప్పటి వరకూ పెద్దగా ఎవ్వరూ లేరనే చెప్పవచ్చు. ఇప్పుడు స్టాలిన్  చేసిన ప్రకటన ఆచరణ యోగ్యంగానే ఉందని పలువురు సామాజిక అధ్యయన వేత్తలు కితాబు ఇస్తున్నారు.

సమాఖ్య స్ఫూర్తిని నిలబెట్టుకోవడం కూడా ముఖ్యమే

సామాజిక న్యాయంతో పాటు, సమాఖ్య స్ఫూర్తిని నిలబెట్టుకోవడం కూడా అంతే ముఖ్యమని రాజనీతి శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. స్వాతంత్రం వచ్చి ఇన్నేళ్లయినా, రిజర్వేషన్లు అమలులోకి వచ్చినా,అక్షరాస్యత పెరిగినా అణగారిన వర్గాలు, వెనుకబడిన జాతులు ఇంకా అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్నాయన్నది పచ్చినిజమని అంగీకరించాలి.

‘యూనియన్ అఫ్ స్టేట్స్ ‘ గా మన దేశాన్ని పిలుచుకున్నా, సామాజిక న్యాయంలో సమన్యాయం జరగడం లేదు. కేంద్ర – రాష్ట్ర సంబంధాలలో సమాఖ్య స్ఫూర్తి కాగితాలకే పరిమితమైపోయిందని చోటుచేసుకుంటున్న పరిణామాలే చెబుతున్నాయి. వికేంద్రీకరణ బదులు అన్ని అంశాలు క్రమంగా కేంద్ర ప్రభుత్వం చుట్టూ కేంద్రీకృతమవుతున్నాయని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. సామాజిక వర్గాల ప్రాతిపదికన ‘జన గణన’ జరగాలనే డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది. అది ఇప్పటి వరకూ నోచుకోలేదు.

భిన్న కులాల, మతాల,ప్రాంతాల, భాషల, సంస్కృతుల సంగమమైన భారతదేశంలో ఐక్యతాస్ఫూర్తి దెబ్బతినకుండా ఉండాలంటే సామాజిక న్యాయం అత్యవసరం. సామాజికంగా వెనుకబడినవారికి,పేదరికంతో మగ్గిపోయేవారికీ న్యాయం జరగడం అత్యంత ముఖ్యమని ఎందరో భావిస్తున్నారు.

స్టాలిన్ అంటున్న సామాజిక న్యాయం కోసం చేసే పోరాటంలో బీసీలతో పాటు దళితులు,ఆదివాసీలను కూడా కలుపుకెళ్ళాలనే సూచనలు వినపడుతున్నాయి. కేవలం రాజకీయమైన లక్ష్యమే కాకుండా,బహుళత్వాన్ని కాపాడుకోవడంలో ఐక్యతను సాధించడం అవసరమే.

సామాజిక న్యాయం జరగాలంటే….

సామాజిక న్యాయం సంపూర్ణంగా జరగాలంటే ప్రస్తుతం ఉన్న రిజర్వేషన్ల విధానం సరిపోదని స్టాలిన్ అంటున్నారు. వందల ఏళ్ళపాటు అణగదొక్కపడిన సమాజాలన్నీ ప్రధాన స్రవంతిలోకి రావాలంటే, అందరూ ఏకమవ్వాలని స్టాలిన్  పిలుపునిస్తున్నారు. విపక్షాలన్నీ ఆయన వెంట ఏ మేరకు నడుస్తాయన్నది అనుమానమే.

‘యూనియన్ అఫ్ స్టేట్స్ ‘ అనే స్ఫూర్తిని నిలుపుకోవాలనే పిలుపులో రాహుల్ గాంధీ, స్టాలిన్ ఒకే స్వరాన్ని వినిపిస్తున్నారు. తాము ఏ అడుగు వేసినా, అందులో కాంగ్రెస్ ను వీడకుండా సాగాలనే ఆలోచనలోనే స్టాలిన్ ఉన్నారు. సామాజిక న్యాయం పేరుతో మొదలైన స్టాలిన్ యాత్ర ఎటువంటి రూపాలను తీసుకుంటుందో చూడాలి. మమతా బెనర్జీ నుంచి కె సీ ఆర్ వరకూ ఎవరికి  వ్యక్తిగత ఎజెండాలు వారికి ఉన్నాయన్న మాటను విస్మరించలేము.

జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని కేజ్రీవాల్ నుంచి కె సీ ఆర్ వరకూ ప్రయత్నిస్తున్నారన్నది బహిరంగ రహస్యమే. పాలనా పరంగా ఎన్ని వైఫల్యాలు ఉన్నా, నరేంద్రమోదీ ఏలుబడిలోని బిజెపిని ఎదుర్కోవడం అంత తేలిక కాదు. సామాజిక న్యాయాన్ని, సమాఖ్య స్ఫూర్తిని నిలబెట్టుకోవడం ఎంతో ముఖ్యం. కేంద్ర -రాష్ట్ర సంబంధాలను నిర్దేశించే ‘ ‘సమాఖ్య వ్యవస్థ’ ( ఫెడరల్ సిస్టమ్ ) పై ఇంకా సమగ్రమైన చర్చ జరగాలి. సామాజిక న్యాయాన్ని  పునః నిర్వచించాల్సిన అవసరం కూడా ఉంది.

ఆ దిశగా జనగణను,ఆర్ధిక, సామాజిక పరిస్థితులను కూడా పునఃసమీక్ష చేసుకోవాలి. స్టాలిన్ లేఖ రాసిన నేతలలో శరద్ పవార్ నుంచి చంద్రబాబు వరకూ ముఖ్యమైన విపక్ష పార్టీల నేతలంతా ఉన్నారు. ఎవరెవరు ఎలా స్పందిస్తారో చూద్దాం.

– మాశర్మ, సీనియర్ జర్నలిస్టు

Related posts

రికార్డ్ … పోలీసు స్పందనకు హెచ్చు సంఖ్యలో ఫిర్యాదులు…!

Bhavani

Analysis: మోడీ పర్యటనతో బంధం మరింత పటిష్టం

Satyam NEWS

భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 370 అంటే ఏమిటి?

Satyam NEWS

Leave a Comment