39.2 C
Hyderabad
April 18, 2024 15: 15 PM
Slider ప్రత్యేకం

ఏ క్వశ్చన్: కార్మికలోకం కల్యాణం ఎప్పుడు?

#LabourDay

ప్రపంచ కార్మికులంతా, శ్రామికులంతా  ఆకలి మంటల మధ్య కంటతడి పెట్టుకుంటున్న రోజులివి. శ్రమ దోపిడీకి వ్యతిరేకంగా పని గంటలు కుదించాలని ఉద్యమించి, సాధించిన రోజును ప్రపంచ కార్మిక దినోత్సవంగా పోయిన సంవత్సరం వరకూ జరుపుకున్నాం.

ఈ సంవత్సరం కార్మికులది విపత్కర, విచిత్ర పరిస్థితి. అసలు పనేలేదు. పని కల్పించాల్సిన పరిస్థితి. పనిచేసిన దానికి న్యాయంగా రావాల్సిన వేతనం దక్కాల్సిన పరిస్థితి. పనుల్లోకి ఎప్పుడు వెళ్లాలో తెలియని పరిస్థితి. పని లేకపోయినా, ఆదాయం లేకపోయినా, ఆకలి తీరకపోయినా కనీసం సొంతఇంటికి, సొంత ఊరుకు ఎప్పుడు చేరుతారో చెప్పలేని పరిస్థితి.

విషాద సాగరంలో కార్మిక లోకం

బోలెడు పరీక్షలు చేసిన తర్వాతగానీ కుటుంబాన్ని చేరలేని పరిస్థితి. సంఘటిత, అసంఘటిత కార్మికులందరిదీ ఒక్కటే దుస్థితి. పని, పనికి ఆహారం కోసం అర్రులుజాచే హీనస్థితి. కార్మికలోకం కళ్యాణం.. కాదు, విషాదంలో ఉంది. ప్రపంచ కార్మికులారా ఏకం కాకండి.. అంటోంది.. కరోనా. శోకమే వీరిని ఏకం చేస్తోంది. లాక్ డౌన్ పొడిగిస్తారా, కుదిస్తారా, ఎత్తేస్తారా ఆ విషయం అలా ఉంచుదాం.

మనం కరోనాతో ఇంకా చాలాకాలం కాపరం చెయ్యడం తప్పదంటున్నారు అన్ని రంగాల పెద్దలు. కరోనాతో కాపరం /కాపడం ఎలా ఉన్నా, ఇంటి కాపరం చెయ్యాలంటే బతుకుబండి సాగాల్సిందే. ఆ దిశగా ప్రభుత్వాలు, ప్రైవేట్ రంగ యాజమాన్యాలు వేగంగా అడుగులు వెయ్యాల్సిందే.

ఉపాధిపై కరోనా కాటు తప్పదు

కోవిడ్ మరణాలు ఎలా ఉన్నా, ఆకలి మరణాలు భారీగా సంభవిస్తాయి. లాక్ డౌన్ ఇదే తీరులో కొనసాగితే,  అసంఘటితం రంగమైనా, స్వయం ఉపాధి రంగమైనా వెరసి 19 కోట్ల మంది భారతదేశంలో ఉపాధి కోల్పోతారని పారిశ్రామిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.

అటు ప్రభుత్వానికి పన్నుల రూపంలో వచ్చే ఆదాయం కూడా గండిపడుతుందని ఆర్ధికవేత్తలు సూచిస్తున్నారు. లాక్ డౌన్ కొనసాగిస్తూ ప్రజలను ఆదుకునే ఆర్ధిక స్థోమత భారతదేశానికి లేదని, లాక్ డౌన్ పొడిగింపు ఆర్ధిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని రిజర్వ్ బ్యాంక్ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ చేసిన వ్యాఖ్యలు, కోవిడ్ మరణాల కంటే, ఆకలి మరణాలే మించిపోతాయని ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి మాటలు కొట్టి పారేయలేము.

వారి దేశభక్తిని కూడా శంకించలేము. రిలయన్స్ అధినేత వేతనాల్లో కోతకు కనుక్కొన్న కొత్త సిద్ధాంతం, ఏప్రిల్, మే నెలలకు జీతాలు ఇవ్వమని తెగేసి చెప్పిన స్పైస్ జెట్ యాజమాన్య విధానం, ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకోడానికి రకరకాల పధకాలు వేస్తున్న  వ్యాపార సంస్థలు, సగం జీతమే ఇస్తామంటున్న మరికొన్ని సంస్థల తీరు వల్ల ఘోరమైన ఇబ్బందుల  పాలవుతున్నది సగటు వేతన  జీవులు. ఖాకీ కట్టుకున్న కార్మికులున్నారు, గోచీ పెట్టుకున్న కార్మికులు న్నారు, టోపీ వేసుకున్న కార్మికులున్నారు.

తెల్ల కాలర్ కార్మికులూ  ఉన్నారు. ఒకరిది శారీరక శ్రమ, ఇంకొకరిది మేధో శ్రమ. అందరూ శ్రమ జీవులే. ఆదాయాల్లో వ్యత్యాసం ఉండవచ్చు,  రంగాలు మారవచ్చు. దానికి కూలి అని పేరు బెట్టినా, వేతనం అని పేరుబెట్టినా బతకడానికి డబ్బు, చెయ్యడానికి పని ఉండాల్సిందే.

నలిగి పోతున్న హలం కార్మికులు, కలం కార్మికులు

ఈ కరోనా ప్రభావంతో ఏర్పడ్డ లాక్ డౌన్ కు హలం కార్మికులు, కలం కార్మికులు అందరూ బాధల మధ్య నలిగిపోతున్నారు. రేపటి కోసం ఇంకా భయపడుతున్నారు.1920లో భారతదేశంలో ట్రేడ్ యూనియన్ ఏర్పడింది. అంటే, ఇప్పటికి వందేళ్లు పూర్తయ్యింది. అప్పటి నుండి కార్మికవర్గంలో చైతన్యం ప్రారంభమైంది.

1923 నుండి మనం మే డే జరుపుకోవడం ప్రారంభించాం. మరో మూడేళ్లల్లో  శతవసంతం సంపూర్ణమవుతుంది. ట్రేడ్ యూనియన్స్ ఏర్పడినా, దానికి సమాంతరంగా అసంఘటిత రంగం కూడా పెరుగుతూ వచ్చింది. అదే అనేక రంగాలకు పాకుతూ వచ్చింది.

ప్రైవేటైజేషన్, లిబరలైజేషన్, గ్లోబలైజేషన్ పరిణామాల వల్ల అసంఘటిత రంగాల్లో కార్మికచట్టాలు అమలుకాలేకపోయాయి. శ్రమదోపిడీ సాగుతూనే ఉంది. కాంట్రాక్టు ఉద్యోగాలు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు పెరుగుతున్నాయి.

అభివృద్ధి చెందుతున్న దేశంగా భారతదేశం సాగుతున్నా, శ్రమజీవుల జీవితాల్లో అభివృద్ధి చోటుచేసుకోవడం లేదు. కార్మికచట్టాలను పునర్నిర్మించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రతి శ్రమజీవి కుటుంబం ప్రగతి సాధించినప్పుడే కార్మికలోకపు కళ్యాణం జరుగుతుంది. మాశర్మ, సీనియర్ జర్నలిస్టు

Related posts

ఏ క్షణమైనా ఎన్నికల షెడ్యూల్: ముకేశ్ కుమార్ మీనా

Satyam NEWS

అభాగ్యులకు అండగా సీఎం సహాయ నిధి

Satyam NEWS

మృతుడి కుటుంబానికి పరామర్శ

Satyam NEWS

Leave a Comment