39.2 C
Hyderabad
April 23, 2024 15: 07 PM
Slider సంపాదకీయం

రిక్వెస్టు: స్వామీ నీ ఆస్తిని నువ్వే కాపాడుకో..మా వల్ల కాదు

#Lord Venkateswara

నిరర్ధక ఆస్తులు అనేవి ఉంటాయా? ఆస్తి అనేది ఉంటే అది నిరర్ధకం ఎన్నటికీ కాదు. దాని ఉపయోగాలు దానికి ఉంటాయి. అత్యవసరానికో, ఆరోగ్య పరిస్థితులు బాగాలేకనో, ఆడపిల్ల పెళ్లికో ఎవరైనా వ్యక్తి లేదా కుంటుంబం ఆస్తులు అమ్ముకోవడం ఎవరూ కాదనలేరు.

అయితే ఏ అవసరం లేకుండా కేవలం ఆస్తి పనికిరాకుండా ఉన్నదని అమ్ముతారా? అమ్ముతారు… ఒక్క సారి తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్టు బోర్డు తీసుకున్న నిర్ణయం చూస్తే  ఏ మాత్రం అవసరం లేకపోయినా ఆస్తులు అమ్ముతారని అర్ధం అవుతున్నది.

టీటీడీ బోర్డు తాజాగా ఆస్తుల అమ్మకానికి నిర్ణయం తీసుకోవడం, రెండు బృందాలను ఏర్పాటు చేసి వేలం పాటకు అనుమతి ఇవ్వడం చూస్తుంటే ఒక్క సారిగా శ్రీవారి భక్తులకు ఏం చెప్పాలో అర్ధం కావడం లేదు. ఈ మొత్తం ప్రక్రియలో వేంకటేశ్వర స్వామికి వచ్చేది రూ.24 కోట్లు.

ఇవన్నీ సెంటిమెంటుతో ముడిపడి ఉన్న భూములు

ఇంత చిన్న మొత్తం ఇప్పుడు స్వామికి అవసరమా? ఆస్తులు తెగనమ్ముకోవాల్సిన అవసరం ఏమిటి? అనే ప్రశ్నలు భక్తుల మదిని తొలిచివేస్తున్నాయి. నిలువుదోపిడిలో భాగంగా ఆభరణాలతో బాటు ఆస్తులు ఇచ్చే ఆచారాన్ని కొందరు వేంకటేశ్వరుడి భక్తులు పాటిస్తారు.

ఏళ్ల తరబడి న్యాయ వివాదాల్లో చిక్కుకున్న భూములు పరిష్కారం అయితే వాటిని స్వామివారికి ఇచ్చే సెంటిమెంటును మరి కొందరు పాటిస్తారు. లేదా అన్యాక్రాంతమైన భూమి దస్తావేజులు స్వామి హుండీలో వేసేస్తారు మరి కొందరు. ఇలా ఏ ఆస్తి వచ్చినా దాన్ని భద్రంగా చూసుకోవడం బోర్డు ధర్మం.

లక్ష రూపాయల స్వామి వారి ఆస్తిని కాపాడడానికి 10 లక్షలు అయినా ఖర్చు పెట్టి వాటిని భద్రంగా చూడటం ఆనవాయితీ. కోర్టు కేసులు పోరాడి చివరకు స్వామివారి పక్షాన తీర్పు వచ్చే వరకూ ప్రయత్నిస్తూనే ఉంటారు బోర్డు న్యాయవాదులు.

అమ్ముకోవడానికి కుంటి సాకులు చెప్పవద్దు

ఇలాంటి టిటిడి వారు తమ ఆస్తులను ఎవరో ఆక్రమించేస్తున్నారని, వాటిని కాపాడుకోలేకపోతున్నామని చెప్పడం అర్ధం లేని విషయం. దేవస్థానం భూములను కాపాడటం తిరుమల తిరుపతి ట్రస్టు బోర్డు కే కాదు, ఏ ఆలయ పాలక మండలి కైనా ప్రధాన ధర్మం కావాలి.

తిరుమల తిరుపతి దేవస్థానం తన ఆస్తులు కాపాడుకోవడమే కాకుండా అవసరమైతే ఏ దేవాలయ భూములను అయినా కాపాడేందుకు న్యాయ సహాయం అందివ్వాలి. అంతటి బృహత్ బాధ్యతను స్వీకరిస్తే ప్రపంచ మత సంస్థలలోనే టీటీడికి మంచి పేరు వస్తుంది.

అంతే కానీ కాపాడలేకపోతున్నామని నిస్సహాయంగా వేలం వేయడం కాదు. అన్యాక్రాంతమైన సింహాచలం భూముల విషయం సుప్రీంకోర్టు వరకూ పోరాడారు. దేవుడికి సంబంధించిన ఒక్క గజం భూమి కూడా అన్యాక్రాంతం కాకూడదు. టీటీడీ ఇప్పుడు ఎవరు చెప్పినా వినే స్థితి దాటిపోయింది కానీ టీటీడీ ఆస్తులు అమ్మకుండా ఉండేందుకు పరిష్కారాలు ఉన్నాయి.

ఈ సలహాలు పాటిస్తారా?

1.సంబంధిత స్థలాలలో అనాథాశ్రమాలు, ఆసుపత్రులు నిర్మించవచ్చు. 2. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలతో ఎగ్రిమెంటు చేసుకుని స్థలం దేవస్థానం పేరుతోనే ఉండేలా ఆ స్థలాన్ని ప్రజాఉపయోగ కార్యక్రమాలకు వినియోగించవచ్చు. ప్రభుత్వ సహకారంలో స్కూళ్లు, కళ్యాణ మండపాలు నిర్మించవచ్చు

3.పై రెండూ చేయడానికి మాకు మనసు రావడం లేదు. ఉచితంగా మేము ఇవ్వము. మేం దానిపై ఆదాయం సంపాదించడమే మా ముఖ్య కర్తవ్యం అనుకుంటారా దానికీ పరిష్కారం ఉంది. సంబంధిత స్థలాలను డెవలప్ మెంట్ కు ఇవ్వవచ్చు. సాధారణంగా స్థలం ఓనరుకు 60 శాతం బిల్డర్ కు 40 శాతం ఇస్తారు స్వామి వారి స్థలం కాబట్టి అందులో సేవ చేయడమే భాగ్యంగా భావించే బిల్డర్లు 70: 30కి అంగీకరించవచ్చు.

ఈ విధంగా చేసిన నిర్మాణాలలో ఒక్క పైసా ఖర్చులేకుండా పర్మినెంటుగా ఆస్తులను నిర్మించుకుని అద్దెకు ఇస్తే పర్మినెంటుగా స్వామివారికి ఆదాయం వస్తుంది. ఇవేవీ చేయకుండా గత ప్రభుత్వ హయాంలోనే నిర్ణయం జరిగింది. ఆ నిర్ణయం ప్రకారమే మేం అమ్ముతున్నాము అని చెప్పడం కరెక్టు కాదు.

గతంలో తప్పిదాలు జరిగితే వాటిని సొమ్ము చేసుకుంటారా?

గత ప్రభుత్వం తప్పిదాలు చేసింది కాబట్టే 23కు పరిమితం అయింది. అవే తప్పులు కొత్త బోర్డు లేదా కొత్త ప్రభుత్వం కూడా చేస్తే వారు కూడా 23కు వస్తారు. గత ప్రభుత్వం చేసినవన్నీ తప్పులు కాబట్టే దాన్ని సాగనంపారు. చదలవాడ కృష్ణమూర్తి, భాను ప్రకాశ్ రెడ్డి పేర్లు చెప్పి వారు చేసిందే మేం చేస్తాం అంటే సుబ్బారెడ్డి, చెవిరెడ్డి భాస్కర రెడ్డి, కరుణాకరరెడ్డి ఎందుకు మళ్లీ పాత వారినే పెట్టుకోవచ్చు కదా?

వారు చేసిన నిర్ణయాలను తిరగదోడి అలా భవిష్యత్తులో కూడా జరగకుండా కట్టడి చేస్తే కొత్త బోర్డును భక్తులు కలకాలం గుర్తుంచుకుంటారు. ఇలా భూములు వేలం వేయడాన్ని భక్తులు ప్రతిఘటించకపోతే రాబోయే రోజుల్లో స్వామివారి నగలు నిరర్ధకంగా ఉన్నాయి వాటిని అమ్మేద్దాం అనే ఆలోచన రావచ్చు.

ఇప్పటికే స్వామి వారికి వచ్చే ‘‘చిన్నా చితకా’’ నగలను కరిగించి డాలర్లు చేసే క్రమంలో ఏం జరుగుతున్నదో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మాకు బలం ఉంది అధికారం ఉంది మా ఇష్టం వచ్చింది మేం చేస్తాం అనే వారికి కొత్తగా చెప్పేది ఏమీ ఉండదు.

టీటీడీ స్థలాల వేలాన్ని వ్యతిరేకించే భక్తులపై ఎల్లో మీడియా అని, తెలుగుదేశం కార్యకర్తలని ముద్ర వేయడం వల్ల కూడా తాత్కాలిక రాజకీయ లబ్ది రావచ్చు. అయితే శాశ్వతంగా అప్రతిష్ట మాత్రం మిగులుతుంది. ఆస్తులు అమ్ముకునే దుర్భర స్థితికి వేంకటేశ్వరుడు రాకూడదని వేరే ఏ దేవుడిని కోరుకోవాలో కూడా అర్ధం కావడం లేదు.

సత్యమూర్తి పులిపాక, చీఫ్ ఎడిటర్, సత్యం న్యూస్.నెట్

Related posts

పోలీసు శాఖ ఆధ్వర్యంలో “కేన్సర్”పై అవగాహన కొరకు “రన్”

Satyam NEWS

బ‌స‌వ‌తార‌కం ఆసుప‌త్రికి మినీబ‌స్ అంద‌జేత‌

Sub Editor

త‌ప్పుడు కేసుల‌తో జైళ్ల‌లో మ‌గ్గిపోతున్న నిరుపేద‌లు..

Satyam NEWS

1 comment

వెంకట్ May 24, 2020 at 9:27 PM

ఎవరైనా ‘పెద్ద’మనసు కలవారు తితిదే ఆస్తి అమ్మకం ద్వారా వచ్చే సొమ్ము రూ. 24 కోట్లు ఇచ్చిన బోర్డువారు ఆస్తుల అమ్మకం ఆపుతారేమో. స్వామికి ఏమి కష్టమొచ్చీందనో ఆయన ఆప్తులు వాళ్ళు అమ్ముతున్నారు.

Reply

Leave a Comment