కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ కు చెందిన రాజకీయ నేత మాజీ రాష్ట్ర ఎపి సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్ ఏవీ సుబ్బారెడ్డి హత్యకు కుట్ర పన్నిన ముఠాను గుట్టు రట్టు చేశారు వైఎస్సార్ జిల్లా కడప చిన్నచౌక్ పోలీసులు. పట్టుబడ్డ నిందితులు ముగ్గురు కర్నూల్ జిల్లా ఆళ్లగడ్డ కు చెందిన వారుగా గుర్తించారు.
ఏవి సుబ్బారెడ్డిని హత మార్చేందుకు 50 లక్షలకు వీరు డీల్ కుదుర్చుకున్నారు. కడప నగరంలో ఈ హత్యకు ప్రణాళిక రూపొందిస్తున్న సమయంలో చాకచక్యంగా అదుపులోకి తీసుకున్నట్లు కడప డిఎస్పీ సూర్యనారాయణ మీడియాకు వెల్లడించారు. కడప డిఎస్పీ కార్యాలయంలో నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టారు.
వీరి వద్ద నుండి 3.20 లక్షల రూపాయల నగదు, ఒక పిస్టల్, 6 తూటాలు, రెండు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు, ఇందులో సంజురెడ్డి అనే ప్రధాన నిందితుడు సూడో నక్సలైట్ గా విచారణలో వెల్లడైందన్నారు. ఏవీ సుబ్బారెడ్డి హత్యకు ఇప్పటికే రెండుసార్లు హైదరాబాద్ లోని ఆయన ఇంటిని నిందితులు రెక్కీ చేసారని, ఆ సమయంలో హైదరాబాద్ పోలీసులకు భయపడి వెనక్కు వచ్చారన్నారు.
నిందితుల పై గతంలో పలు కేసులు నమోదు అయినట్లు కడప డిఎస్పీ సూర్యనారాయణ వెల్లడించారు. గత ప్రభుత్వ హయాంలో ఆళ్లగడ్డ లోని స్థానిక రాజకీయ నేతలతో తనకు ప్రాణ హాని ఉన్నట్లు అప్పట్లో మీడియా ముందు మాట్లాడినట్లు సమాచారం. అయితే ఈ హత్యయత్నానికి సంబంధించిన పూర్తి వివరాలు విచారణలో తెలిసే అవకాశం ఉంది. వీరిని పట్టుకునేందుకు కృషి చేసిన సిబ్బందిని డిఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు.