అమరావతి ల్యాండ్ స్కామ్‌లో ఒకప్పటి చంద్రబాబు సన్నిహితుడు, ప్రస్తుత బీజేపీ ఎంపీ సుజనా చౌదరి చుట్టూ ఉచ్చు బిగుసుకుంటుందా ? తనకు అమరావతిలో ఒక్క ఎకరం, అదీ బినామీల పేరుతో ఉంటే చూపించండి అంటూ మంత్రి బొత్స సత్యనారాయణకు సవాల్ చేసిన సుజనాచౌదరి బినామీ బాగోతాలన్నీ బయటపడనున్నాయా? ప్రస్తుతం రాజధాని ప్రాంతంలో జరుగుతున్న అధికారుల విచారణ తీరు చూస్తే నిజమే అనిపిస్తుంది. అమరావతి ప్రాంతంలో సుజనాకు, ఆయన బంధువులకు బినామీల పేర్లతో ఏమైనా భూములు ఉన్నాయా అనే కోణంలో అధికారులు సీరియస్‌గా ఎంక్వైరీ చేస్తున్నట్లు తెలుస్తోంది. బుధవారం నాడు కృష్ణా జిల్లాలోని కంచికచర్ల మండలంలోని పలు గ్రామాల పరిధిలో పర్యటించిన అధికారులు బినామీ భూములపై కూపీ లాగినట్లు తెలుస్తోంది. మొగులూరు, మున్నలూరు, బత్తినపాడు, చెవిటికల్లు వంటి గ్రామాల్లో తిరిగిన రెవిన్యూ, సీఐడీ, ఏసీబీ, విజిలెన్స్ అధికారులు గ్రామస్తులను, రైతులను అడిగి భూముల వివరాలు సేకరించారు. రాజధాని ప్రాంతంలో గత కొన్నేళ్లుగా భూములు ఎవరెవరికి అమ్మారు, ఎవరెవరి పేరు మీద కొనుగోళ్లు జరిగాయనే అనే కోణంలో అధికారులు విచారణ యేపట్టారు. ఇటీవల అమరావతి భూ కుంభకోణంపై ప్రభుత్వం విచారణ జరిపిస్తుందని ప్రకటించిన సందర్భంలో అమరావతి ప్రాంతంలో తనకు భూములు లేవని, ఒక్క ఎకరం బినామీల పేరుతో ఉన్నా బయటపెట్టండి అని సుజనా చౌదరి మంత్రి బొత్సకు సవాల్ చేశారు. ఈ సవాల్‌కు స్పందించిన మంత్రి బొత్స రాజధాని ప్రాంతంలో మొత్తం 600కు పైగా ఎకరాలు బంధువులు, బినామీల పేర్లతో సుజనా చౌదరి కొనుగోలు చేశారని లెక్కలతో సహా బయటపెట్టారు. అంతే కాదు కంచికచర్ల మండల పరిధిలో సుజనాకు వందలాది ఎకరాల భూములు ఉన్నాయని తెలిపారు. రాష్ట్ర విభజన అనంతరం, అమరావతి రాజధాని ప్రకటనకు ముందు, ఆ తర్వాత అక్కడి భూములు ఎవరి పేర ఉన్నాయి? ఎవరెవరి చేతులు మారాయి? ఎవరి పేరు మీద ఉన్నాయి, ఎంత విస్తీర్ణంలో ఎవరి పేరున ఉన్నాయి.. అనే వివరాలు ఆరా తీస్తున్నారట. దీంతో అమరావతి భూకుంభకోణంలో సుజనాచౌదరి చుట్టూ ఉచ్చు బిగిసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.
previous post
next post