చిత్తూరు జిల్లాలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అటవీ భూముల ఆక్రమణపై రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ అయింది. పుంగనూరు నియోజకవర్గం పులిచర్ల మండలం, మంగళం పేట రెవెన్యూ గ్రామ పరిధిలో భూ అక్రమాలపై అధికారులు నివేదికలు సిద్దం చేశారు. 75 ఎకరాల అటవీ భూములు అక్రమంగా పెద్దిరెడ్డి కుటుంబం పరిధిలో చేరడంపై ఇప్పటికే ముఖ్యమంత్రికి ప్రాధమిక నివేదిక చేరింది. ఈ నివేదికపై నేడు సచివాలయంలో రెవెన్యూ శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు.
చిత్తూరు జిల్లాలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి అటవీ భూముల భక్షణపై పూర్తి స్థాయి విచారణకు ఆదేశించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు విచారణకు జాయింట్ కమిటీ ఏర్పాటు కాబోతున్నది. చిత్తూరు జిల్లా కలెక్టర్, ఎస్పీ, అనంతపురం కన్జెర్వేటర్ ఆఫ్ ఫారెస్టు అధికారులతో జాయింట్ కమిటీ ఏర్పాటు చేస్తున్నారు. జాయింట్ కమిటీలో సభ్యులుగా చిత్తూరు కలెక్టర్ సుమిత్, జిల్లా ఎస్పీ మనికంఠ చందోలు, ఐఎఫ్ఎస్ అధికారి యశోద బాయ్ కూడా ఉంటారు. దర్యాప్తు నివేదిక ఆధారంగా తదుపరి చర్యలను ప్రభుత్వం తీసుకోనున్నది.
నేటి సమీక్షలో మాజీ మంత్రి పెద్ది రెడ్డి భూ మాఫియా ఆగడాలు, తదుపరి చర్యలపై కూడా చర్చించారు. అటవీ భూములు ఆక్రమణ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకున్న ప్రభుత్వం ఇక వదిలేది లేదనే దిశగా పని ప్రారంభించింది. పుంగనూరు, తంబళ్లపల్లి, రేణిగుంట మండలంలో రికార్డుల తారుమారుతో, బినామీ పేర్లతో వందల ఎకరాల ఆక్రమణ ఆరోపణలు ఉన్నారు. పక్కా అధారాల సేకరణతో కఠిన చర్యలకు ప్రభుత్వం అడుగులు వేసింది.