ఇటీవల నగరంలోని నాగోలులోని నాలలో భారీ వర్షం వరదలో కొట్టుకుపోయి దుర్మరణం పాలయిన బెంగుళూరి ప్రేమ్ కుమార్ శాస్త్రి కుటుంబానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్నివిధాలా సాయం అందిస్తుందని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు ,తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ అధ్యక్షులు డా.కే. వి. రమణాచారి తెలిపారు. గ్రేటర్ హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్ జీహెచ్ఎంసీ నుంచి రెండులక్షల ఆర్థిక పరిహారం మంజూరు చేస్తానని హామీ ఇచ్చారని రమణాచారి చెప్పారు. అలాగే రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ కూడా ఈ సంఘటన పై విచారం వ్యక్తం చేశారని రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కూడా సహాయం అందిస్తానని హామీ ఇచ్చారని రమణాచారి తెలిపారు. ఈ సందర్భంగా బెంగుళూరి ప్రేమ్ కుమార్ శాస్త్రి కుటుంబానికి తాను వ్యక్తిగతంగా యాభై వేల ఆర్థిక సాయం అందించారు. ఈ సంఘటన జరిగిన రోజునే సమాచారం తెలుసుకుని తీవ్ర సానుభూతి వ్యక్తం చేసిన రమణాచారి ఇవాళ తాను వ్యక్తిగతంగా యాభై వేల రూపాయల ఆర్థిక సాయం చెక్కును వారి నివాసంలో మృతుడి బంధువు సాయికిరణ్ శర్మ కు అందజేశారు. యాదాద్రి-భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలం జిబ్లక్ పల్లి గ్రామానికి చెందిన మృతుడు బెంగుళూరి ప్రేమ్ కుమార్ శాస్త్రి కుటుంబ పరిస్థితి వారికి చేయాల్సిన ఇతర సహకారం గురించి తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ సభ్యుడు మరుమాముల వెంకటరమణ శర్మతో చర్చించారు. మృతుడి కుటుంబానికి అన్నివిధాల చేయూత నందించి వారికి భరోసా ఇద్దామన్నారు..ఈ కార్యక్రమంలో పరశురామ బ్రాహ్మణ సేవా మిత్ర అధ్యక్షుడు నరేష్ కులకర్ణి కూడా పాల్గొన్నారు. వివిధ బ్రాహ్మణ సంఘాల సహకారంతో శాస్త్రి కుటుంబానికి తగిన ఆర్థికసాయాన్ని అందిస్తున్నామని, వెంకటరమణ శర్మ, నరేష్ కులకర్ణి రమణాచారికి తెలిపారు
previous post
next post