24.7 C
Hyderabad
October 26, 2021 03: 44 AM
Slider ప్రపంచం

ఆఫ్గనిస్తాన్ లో తాలిబాన్ కొత్త సైన్యం ఏర్పాటు

talliban attack 6 died

ఆప్ఘనిస్తాన్ లో ప్రజా ప్రభుత్వం నుంచి అధికారాన్ని హస్తగతం చేసుకున్న తాలిబన్లు తాజాగా ప్రభుత్వాన్ని కూడా ఏర్పాటు చేశారు. అమెరికా బలగాలు వైదొలగడంతో ప్రస్తుతానికి ప్రభుత్వ ఏర్పాటు చేసినా విదేశాలతో పాటు స్వదేశంలోని తిరుగుబాటుదారులతో వారికి ముప్పు పొంచి ఉంది. వారికి విదేశాలు సాయం చేసేందుకు సిద్ధంగా ఉండటంతో అంతర్యుద్ధం మొదలుకావడానికి ఎంతో సమయం పట్టేలా లేదు.

దీంతో గతానుభవాలు పునరావృతం కాకుండా కొత్తగా దుర్భేద్యమైన సైన్యాన్ని ఏర్పాటు చేసుకోవాలని తాలిబన్లు నిర్ణయం తీసుకున్నారు. ఇందుకోసం పాకిస్తాన్, చైనాతో పాటు ఇతర విదేశాల సాయం కూడా తీసుకోనున్నారు. ఆప్ఘనిస్తాన్ లో తాలిబన్లు కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఇందులో పలువురు మోస్ట్ వాంటెడ్ తీవ్రవాదులకు సైతం చోటు కల్పించారు. దీనిపై ఎన్ని విమర్శలు ఎదురైనా లెక్క చేయలేదు. పాకిస్తాన్ తో పాటు పలు విదేశాల నుంచి వచ్చిన సిఫార్సుల మేరకు మంత్రులకు చోటిచ్చారు.

అయితే అమెరికా రెచ్చగొట్టే ప్రమాదం ఉందన్న కారణంతో ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించలేదు. ప్రభుత్వం ఎలాగో ఏర్పాటైంది కాబట్టి ఇప్పుడు ఆప్ఘనిస్తాన్ పునర్నిర్మాణం పేరుతో రెగ్యులర్ నిర్ణయాలు తీసుకుంటున్నారు. దీంతో పాటు తమకు ఎదురయ్యే భవిష్యత్ ముప్పును తొలగించుకునేందుకు కూడా ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు.

దేశ రక్షణకే..

ఆప్ఘనిస్తాన్ లో తాలిబన్ల సర్కార్ కొత్త ఆర్మీ ఏర్పాటుకు సిద్దమవుతోంది. ఈ మేరకు సంప్రదింపులు జరుపుతున్నట్లు తాలిబన్ల ప్రస్తుత ఆర్మీ ఛీఫ్ ఖారీ ఫసిహుద్దీన్ ప్రకటించారు. ఇది కచ్చితంగా దేశ సరిహద్దులతో పాటు అంతర్గతంగా కూడా ఎలాంటి ముప్పు లేకుండా పనిచేస్తుందని ఆయన వెల్లడించారు. త్వరలో దీనిపై మరిన్ని వివరాలు ప్రకటిస్తామని ఫసిహుద్దీన్ తెలిపారు. దీంతో ఆఫ్గనిస్తాన్ లో ఇప్పటికే ప్రజా ప్రభుత్వ హయాంలో పనిచేసిన బలహీనమైన ఆర్మీ స్ధానంలో తాలిబన్ల పటిష్ట ఆర్మీ ఏర్పాటు కానున్నట్లు తెలుస్తోంది. ఇందులో అత్యాధునిక ఆయుధాలు, సుశిక్షిత బలగాలు, తాజా సాంకేతిక పరిజ్ఢానం కూడా వచ్చి చేరనున్నాయి. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తాలిబన్లకు ఇప్పుడు దేశ రక్షణకు కొత్త వ్యూహాలు రచించాల్సిన అవసరం ఏర్పడింది. ఇందుకు ప్రస్తుతం ఉన్న ఆర్మీతో పాటు ఫైటర్లు కూడా ఏమాత్రం సరిపోరు. దీంతో భవిష్యత్తులో మరింత మందిని సైన్యంలోకి రిక్రూట్ చేసుకోవడంతో పాటు వారికి అత్యాధునిక ఆయుధాలు అందించాలని తాలిబన్లు భావిస్తున్నారు. ఇందుకోసం క్రమశిక్షణతో కూడిన రెగ్యులర్ ఆర్మీ ఏర్పాటు చేయనున్నట్లు తాలిబన్ల ప్రస్తుత ఆర్మీ ఛీఫ్ ఫసిహుద్దీన్ వెల్లడించారు. ఆప్ఘనిస్తాన్ పునర్మిర్మాణం కోసం ఇదెంతో అవసరమని తాలిబన్లు భావిస్తున్నారు.

పాకిస్తాన్, చైనా సాయం

తాలిబన్లు ఆప్ఘనిస్తాన్ లో ఏర్పాటు చేసే కొత్త ఆర్మీకి ఆయుధాలు, సాంకేతిక పరిజ్ఞానంతో పాటు అన్నివిధాలుగా సాయం చేసేందుకు ఇప్పుడు పాకిస్తాన్, చైనా సిద్ధంగా ఉన్నాయి. ఆప్ఘన్ పునర్మిర్మాణం పేరుతో అధికారికంగానే తాలిబన్లకు అవసరమైన సైన్యం ఏర్పాటుతో పాటు వారికి శిక్షణ ఇచ్చే కార్యక్రమాన్ని పాకిస్తాన్, చైనా నెత్తిన వేసుకోనున్నాయి. దీంతో త్వరలోనే ఈ మేరకు శిక్షణతో పాటు ఆయుధ సంపత్తి, పరిజ్ఞానం అందించేందుకు సంప్రదింపులు ప్రారంభించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.

ఇప్పటికే అణ్వాయుధాల్ని కూడా పోగేసుకున్న పాకిస్తాన్, చైనా నుంచి తాలిబన్లకు సహకారం అందడం మొదలైతే అది ఎటు దారితీస్తోందో తెలియక ప్రపంచదేశాలు ఆందోళన చెందుతున్నాయి. తాలిబన్లకు ప్రస్తుతం ఆప్ఘనిస్తాన్ లోనే ఉన్న ప్రతిఘటన దళాల నుంచి ముప్పు పొంచి ఉంది. ముఖ్యంగా పంజ్ షీర్ లోయలో వారిని మట్టికరిపించాక దేశంలోని వివిధ ప్రాంతాలకు పారిపోయిన వీరంతా తిరిగి ఏకమయ్యే అవకాశాలు ఉన్నాయి. అలాగే వీరికి విదేశీ శక్తుల సాయం అందుతోంది.

అమెరికాతో పాటు వివిధ నాటో దేశాలు ఏ క్షణమైనా వీరిని ఆదుకునేందుకు సిద్ధంగానే ఉంటాయి. అటు భారత్ కూడా ప్రతిఘటన దళాలకు మద్దతు నిస్తోంది. దీంతో ఎప్పుడేం జరుగుతుందో తెలియని గందరగోళ పరిస్ధితులు తాలిబన్ల సర్కార్ కు ఎదురవుతున్నాయి. కాబట్టి రెగ్యులర్ ఆర్మీ ఏర్పాటు చేస్తే తప్ప ముప్పు తొలగదని వారు భావిస్తున్నారు.

చరిత్ర పునరావృతం కాకుండా..

ఆప్ఘనిస్తాన్ లో 1996 నుంచి 2001 మధ్య తాలిబన్ల సర్కారే ఉండేది. అప్పట్లో షరియా చట్టాలు కఠినంగా అమలయ్యేవి. కానీ ఎప్పుడైతే తాలిబన్లకు మిత్రులైన అల్ ఖైదా తీవ్రవాదులు అమెరికాలోని ట్విన్ టవర్స్ పై 9/11 దాడులు చేశారో అప్పుడే యూఎస్ వారిని టార్గెట్ చేయడం మొదలుపెట్టింది. దీంతో 2001 నుంచి అమెరికా భూ, వాయు మార్గాల్లో దాడులు చేసి తాలిబన్లను దారుణంగా దెబ్బతీసింది. వారి ప్రభుత్వాన్ని కూల్చేసి ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.

దీంతో తాలిబన్లు చేసేది లేక వెనక్కి తగ్గారు. అయినా గెరిల్లా మార్గాల్లో అమెరికా బలగాలపై దాడులు కొనసాగిస్తూ వచ్చారు. చివరికి అమెరికా బలగాలు తాజాగా వెనుతిరగడంతో ఆప్ఘనిస్తాన్ పై తాలిబన్లకు మరోసారి పట్టు చిక్కింది. ప్రజా ప్రభుత్వాన్ని అతి తక్కువ కాలంలో కూల్చేసి తమ ప్రభుత్వాన్ని తిరిగి ఏర్పాటు చేసుకున్నారు.

గతంలో అమెరికాను ఎదిరించేందుకు తగిన ఆయుధ సంపత్తి కానీ, సుశిక్షితులైన ఆర్మీ కానీ లేకపోవడం వల్లే లొంగిపోవాల్సి వచ్చింది. ఇప్పుడు తిరిగి ఆ అనుభవాలు పునరావృతం కాకుండా ఉండేందుకు తాలిబన్లు కొత్త ఆర్మీ ఏర్పాటు కోసం ప్రయత్నాలు చేస్తున్నారు.

Related posts

కరోనాపై పోరాటానికి చిన్న బాలుడి పెద్ద సాయం

Satyam NEWS

పెట్టుబడుల్ని ఆకర్షించి యువకులకు ఉపాధి పెంచుతాం

Satyam NEWS

ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించాలి

Satyam NEWS

Leave a Comment

error: Content is protected !!