కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సీఐఐ), వ్యవసాయం, ఫుడ్ ప్రాసెసింగ్, అనుబంధ రంగాల కోసం చేపడుతున్న కార్యక్రమాల్లో భాగంగా వ్యవసాయ రంగంలో సుస్థిరమైన వృద్ధి సాధించడం లక్ష్యంతో అగ్రిటెక్ సౌత్ రెండో ఎడిషన్ పేరుతో మూడు రోజులు ఎగ్జిబిషన్, వ్యవసాయ రంగంలో అధునాతన అంశాలపై అగ్రివిజన్ పేరుతో రెండు రోజుల సదస్సును నిర్వహించనుంది.
వచ్చే సంవత్సరం జనవరి 31వ తేదీ నుంచి ఫిబ్రవరి 2వ తేదీ వరకు ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చరల్ యూనివర్సిటీ (పీజేటీఎస్ఏయూ), తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సంయుక్త భాగస్వామ్యంతో అగ్రిటెక్ సౌత్ 2020కి ఆతిథ్యం అందించనున్నారు. రైతుల ఆదాయం రెట్టింపు చేయడం, నూతన సాంకేతిక ఉత్పత్తులను అందుబాటులోకి తీసుకురావడం అనే లక్ష్యాలతో ఈ సదస్సు నిర్వహిస్తున్నారు.
ఈ ఎగ్జిబిషన్‌లో ప్రధానంగా విభిన్నమైన పంటలు పండించడం, మైక్రో ఇరిగేషన్, ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ సిస్టమ్స్, ఈ-నామ్ మరియు ఇన్సురెన్స్, వ్యవసాయంలో అనుసరించాల్సిన విధానాలు, వ్యవసాయంలో యాంత్రీకరణ, పోస్ట్ హార్వెస్ట్ మేనేజ్‌మెంట్, ఐఓటీ, ఏఐ & డ్రోన్స్, డిజిటల్ అగ్రికల్చర్, వ్యవసాయ ఉత్పత్తులకు మరింత విలువ చేకూర్చడం, పోషకాహార కల్పన వంటి అంశాలున్నాయి.
మూడు రోజుల పాటు జరగనున్న ఈ ఎగ్జిబిషన్లో దేశవ్యాప్తంగా 150 మందికి పైగా ఎగ్జిబిటర్లు మరియు 30,000 మందికి పైగా సందర్శకులు పాల్గొంటారని భావిస్తున్నారు. డ్రోన్ల వాడకాన్ని ప్రదర్శించి చూపడం, గ్రీన్‌హౌస్‌లు, ఇరిగేషన్ విధానాలు, వ్యవసాయానికి సంబంధించిన యంత్రాలు, వాటి వాడకంపై విపులంగా తెలియజేయనున్నారు.
అగ్రివిజన్ 2020 ఆవిష్కరణలు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా ఎదగడం, ఎఫ్‌పీఓలు, రోబోటిక్స్ మరియు ఆటోమేషన్, హైడ్రోపోనిక్స్, డిజిటల్ అగ్రికల్చర్, వాతావరణ మార్పులకు అనుగుణంగా పంటలను మార్చుకోవడం మరియు పశువుల ఆధారంగా వ్యవసాయం చేయడం వంటి వాటిపై ప్రధానంగా దృష్టి సారించనుంది.
రెండు రోజుల పాటు జరగనున్న ఈ సదస్సులో పది సెషన్లు ఉండనున్నాయి. ప్రపంచవ్యాప్తంగా పేరొందిన 40 మంది స్పీకర్లు1000 మంది భాగస్వామ్యులను ఉద్దేశించి ప్రసంగించనున్నారు.