28.7 C
Hyderabad
April 20, 2024 07: 19 AM
Slider ముఖ్యంశాలు

తెలంగాణలో వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేస్తాం

#MinisterNiranjanReddy

అరవై సంవత్సరాల చరిత్రలో తెలంగాణలో జరగాల్సిన అభివృద్ధి జరగలేదని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తెలిపారు. అందుకే తెలంగాణ రాష్ట్రాన్ని  ఉద్యమాలు చేసి సాధించుకున్నామని అన్నారు. వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేస్తే ప్రజలకు ఉపాధి మార్గం దొరుకుతుందని సీఎం కేసీఆర్ భావించి దానికి అనుగుణంగా ముందుకు సాగుతున్నారని చెప్పారు

కామారెడ్డి నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పాల్గొన్నారు. బిక్కనూర్ మండలం బస్వాపూర్ స్టేజి వద్ద ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ మంత్రికి ఘనస్వాగతం పలికారు. బస్వాపూర్ గ్రామంలో నూతనంగా నిర్మించిన రైతు వేదిక భవనంతో పాటు అత్యాధునిక వసతులతో నిర్మించిన వైకుంఠధామం, గ్రంథాలయం, ఇతర అభివృద్ధి పనులను మంత్రి ప్రారంభించారు.

బిక్కనూర్ మండల కేంద్రంలో పలు కార్యక్రమాల ప్రారంభోత్సవ కార్యక్రమాలలో రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సైతం పాల్గొన్నారు. బిక్కనూర్, జంగంపల్లి, కామారెడ్డి మండలం చిన్నమల్లారెడ్డి గ్రామాల్లో రైతు వేదిక భవనాలను మంత్రులు ప్రారంభించారు.

కామారెడ్డి మండలం లింగాయపల్లి గ్రామంలో 2 కోట్ల 52 లక్షలతో నిర్మించిన డబల్ బెడ్ రూమ్ ఇళ్లను మంత్రులు ప్రారంభించారు. అలాగే రాజంపేట మండల కేంద్రంలో నూతనంగా 2 కోట్ల 52 లక్షలతో నిర్మించబోయే 50 డబల్ బెడ్ రూమ్ ఇళ్లకు శంకుస్థాపన చేశారు.

ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయ ప్రధాన జీవనాధారమన్నారు. నూటికి 60 శాతం మంది ప్రత్యక్షంగానో పరోక్షంగానో వ్యవసాయంపై ఆధారపడి ఉన్నారని చెప్పారు.

130 కోట్ల జనాభాలో 60 శాతం మందికి ఉపాధి, ఉద్యోగాలు చూపించడం ఏ ప్రభుత్వాలకు సాధ్యం కాదని, కేవలం వ్యవసాయ రంగమే ప్రజలకు ఉపాధి మార్గమని భావించి ఈ రంగాన్ని బలోపేతం చేయడం జరుగుతుందని తెలిపారు. తెలంగాణ రాష్ట్రాన్ని కోరుకున్నదే నీళ్లకోసమని, ఆ నీటిని సురక్షితంగా వాడుకోవడం కోసం నేడు కాళేశ్వరం లాంటి అద్భుతమైన ప్రాజెక్టును కట్టుకోవడం జరిగిందని తెలిపారు.

రైతు లేనిదే వ్యవసాయం లేదని, వ్యవసాయం లేనిదే తెలంగాణ లేదని మంత్రి చెప్పారు. రేపటి రోజు ఇతర దేశాలకు అవసరమైన ఉత్పత్తులను భారతదేశం ఇవ్వగలిగే పరిస్థితి వస్తే అందులో తెలంగాణ మొదటి స్థానంలో ఉంటుందని పేర్కొన్నారు. ఆ పరిస్థితి రావడం కోసమే ప్రస్తుతం రైటు బంధు సమితి, రైతు వేదికల నిర్మాణాలని తెలిపారు.

అన్ని రంగాల్లో నియోజకవర్గం అభివృద్ధి

ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ మాట్లాడుతూ నియోజకవర్గంలో అన్ని రకాల అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను పెద్ద ఎత్తున పూర్తి చేసుకోవడం జరుగుతుందన్నారు.

బస్వాపూర్ గ్రామంలో జిల్లా పరిషత్ హై స్కూల్ అదనపు తరగతి గదుల ప్రారంభం, యువకులు చదువుకుని తమ ప్రతిభను మెరుగు పరుచుకునేందుకు గ్రంథాలయాలు ప్రారంభం చేసుకున్నామని, అదేవిధంగా నియోజకవర్గంలో అన్ని గ్రామాల అభివృద్దే ద్యేయంగా పని చేయడం జరుగుతుందని తెలిపారు.

సీఎం కేసీఆర్ కు రైతుల కష్టాలు తెలుసని, ఏ రకంగా తక్కువ ఖర్చుతో ఎక్కువపంట రావాలనే ఉద్దేశ్యంతో 5 వేల ఎకరాలకు ఒక క్లస్టర్ ఏర్పాటు చేసి రైతు వేదికలు నిర్మించడం జరుగుతుందని, నియోజకవర్గంలో 24 రైతు వేదికలను 22 లక్షల రూపాయల చొప్పున పూర్తి చేసుకున్నామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ దఫెడర్ శోభ, జిల్లా కలెక్టర్ శరత్ కుమార్, టిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నిట్టు వేణుగోపాలరావు, రాష్ట్ర మైనారిటీ సెల్ అధ్యక్షులు ముజీబొద్దిన్, డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి, రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షులు అంజిరెడ్డి, వివిధ మండలాల ఎంపీపీ, జడ్పీటీసీ, సర్పంచులు, టిఆర్ఎస్ నాయకులు, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు

Related posts

ఏలోపింగ్ టీచర్: ఆమెకు 26 అతనికి 14 లేచిపోయారు

Satyam NEWS

మున్సిపల్ కార్మికుల న్యాయమైన సమస్యలు పై నిర్లక్ష్యం సిగ్గుచేటు

Satyam NEWS

14న తెరుచుకోనున్న అయ్యప్ప ఆలయం

Satyam NEWS

Leave a Comment