నేరస్తులను పట్టుకోవాల్సిన సీఐడీ చీఫ్ చీప్ గా అవినీతి కుంభకోణంకు పాల్పడితే? దేశానికి ఒక కేస్ స్టడీ అవ్వదా? దళితుల పేరుతో ప్రభుత్వం ఇచ్చిన నిధులను ఏపీ సీఐడీ చీఫ్ సంజయ్ అక్రమంగా వాడుకున్నారన్న ఆరోపణలతో ఆంధ్రజ్యోతి ప్రచురించిన ఈ కథనం సంచలనంగా మారింది. వైసీపీ ప్రభుత్వంలో సీఐడీ చీఫ్‌గా పనిచేసిన ఐపీఎస్ అధికారి సంజయ్‌పై భారీ కుంభకోణ ఆరోపణలు వచ్చాయి. అట్రాసిటీ చట్టంపై ఎస్సీ, ఎస్టీలకు అవగాహన పేరుతో ప్రభుత్వం కేటాయించిన సొమ్ములో దోపిడీ జరిగింది అనేది ప్రధాన ఆరోపణ.
ఈ ఏడాది జనవరిలో 25 సమావేశాలు జరిపినట్టు చూపి, ప్రైవేటు ఏజెన్సీ ద్వారా ఏకంగా రూ. 1.19 కోట్లు డ్రా చేశారు. కానీ, నిజంగా అయ్యిన ఖర్చు కేవలం రూ. 3.10 లక్షలు మాత్రమేనట. వీడియోగ్రఫీ, హాల్ అద్దెల కోసం లక్షల్లో బిల్లులు పెట్టి, నిజానికి ప్రభుత్వ భవనాలు వాడుకున్నారు. సీఐడీ సిబ్బంది తమ సెల్‌ఫోన్లతో వీడియోలు తీసినా, వీడియో చార్జీల పేరుతో మరిన్ని బిల్లులు క్రియేట్ చేశారు. మార్గదర్శకాలకు విరుద్ధంగా ఓ ప్రైవేటు ఏజెన్సీతో ఎంవోయూ కుదుర్చుకొని, ఎలాంటి అనుభవం లేకున్నా టెండర్ ఇచ్చారు.
ఆ సంస్థ నుంచి సమావేశాలకు ప్రతినిధులు కూడా రాలేదు. ఈ దోపిడీపై విజిలెన్స్ విచారణలో అసలు ఖర్చు కేవలం రూ.3.10 లక్షలు మాత్రమేనని తేల్చింది. మిగతా రూ. 1.16 కోట్లు రికవరీ చేయాలని సిఫారసు చేసింది అని ఆంధ్రజ్యోతి కథనం. దీనిపై ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతున్నది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం తదుపరి చర్యలు ఏం తీసుకుంటుందో వేచి చూడాలి.