అఖిల భారతీయ అఖాడా పరిషత్ అధ్యక్షుడు మహంత్ నరేంద్ర గిరి మహరాజ్ అనుమానాస్పదస్థితిలో మృతి చెందారు. ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగరాజ్‌లో ఉన్న బాఘంబరి మఠంలో ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆయన ఆత్మహత్య చేసుకున్నారు. 5 పేజీల సూసైడ్ నోట్‌ను కూడా రాశారు. తన శిష్యులలో ఒకరైన ఆనంద్ గిరి ఇందుకు బాధ్యుడుగా మహంత్ నరేంద్ర గిరి పేర్కొన్నారు.
ఫోరెన్సిక్ బృదంతో పాటు ఒక ప్రత్యేక బృందం ఘటనా స్థలికి చేరుకుని విచారణ ప్రారంభించింది. మానసిక సమస్యలతో పాటు శిష్యుల వేధింపులే తన ఆత్మహత్యకు కారణమని సూసైడ్ లెటర్‌లో రాశారు నరేంద్రగిరి. దీని ఆధారంగా ఆయన శిష్యుడు ఆనంద్‌గిరిని ఉత్తరాఖండ్ లోని హరిద్వార్‌లో పోలీసులు అరెస్ట్ చేశారు.
అయితే తనకు ఏం పాపం తెలియదని, స్వామీజీ ఆత్మహత్య చేసుకోలేదని, హత్య చేశారని ఆరోపించారు ఆనంద్‌గిరి. దీంతో కొత్త అనుమానాలు మొదలయ్యాయి. పోలీసులు మాత్రం అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ఒకవేళ ఎవరైనా హత్య చేసి ఉంటే, ఆ నోట్ ఎవరు రాశారని పోలీసులు ఆరా తీస్తున్నారు.