36.2 C
Hyderabad
April 25, 2024 20: 14 PM
Slider నల్గొండ

ఇక్కడ పేద ప్రజలే సాటివారిని ఆదుకునే దాతలు

#Chirumarthy Lingaiah MLA

తన తోటి వారిని ఆదుకోవడంలో తమకు తామే సాటిగా, మనసున్న మా రాజులు తామే అని నిరూపించుకున్నారు నల్లగొండ జిల్లా నకిరేకల్ నియోజకవర్గం చిట్యాల మండలానికి చెందిన పేద ప్రజలు. తమకు ప్రభుత్వం అందించిన లబ్దిలో నుండి ఎలాంటి లబ్ది పొందని అభాగ్యులను ఆదుకునేందుకు ముందుకు వచ్చారు.

దీనికి స్థానిక తహసీల్దార్ సూచించిన ‘అక్షయ పాత్రను’ వేదికగా వాడుకున్నారు. కరోనా కారణంగా లాక్ డౌన్ నేపధ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతి రేషన్ కార్డు ఉన్న కుటుంబంలోని ప్రతి వ్యక్తికి 15 కిలోల ఉచిత బియ్యం అందించే కార్యక్రమాన్ని చేపట్టిన విషయం అందరికి తెలిసిందే.

ఐతే రేషన్ కార్డు లేని పేద, నిరుపేదలు, పరిశ్రమల్లో, రైస్ మిల్లులో, ఇటుకబట్టీలలో ఇంకా అనేక విధాలుగా కూలీలుగా వచ్చిన వారు వందల సంఖ్యలో ఉన్న విషయాన్ని తహసిల్దార్ కృష్ణారెడ్డి గమనించారు. వీరిని ఏ విధంగా ఆదుకోవాలి అని ఆలోచించారు. ఆయన ఆలోచనకు తగిన విధంగా అక్షయ పాత్ర రూపకల్పన చెందింది.

మండల వ్యాప్తంగా అనూహ్యంగా 133 క్వింటాళ్ల బియ్యం సేకరణ

దీని ప్రకారం రేషన్ దుకాణాల ద్వారా బియ్యాన్ని తీసుకునే పేదలు ఎవరైనా తమ తోటి వారి ఆకలిని తీర్చడానికి వారి ఇష్టపూర్తిగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. వారు బియ్యాన్ని అందించడానికి ఒక డ్రమ్ము, బియ్యం సంచులు లాంటివి రేషన్ దుకాణాల దగ్గర ఏర్పాటు చేశారు. ఈ నెల  రేషన్ ప్రారంభం అయిన దగ్గరి నుండి 22 వ తేదీ వరకు మండల వ్యాప్తంగా అనూహ్యంగా 133 క్వింటాళ్ల బియ్యం సేకరణ జరిగింది.

ఇది ఒక గొప్ప శుభ పరిణామంగా చెప్పవచ్చు. సేకరించిన 133 క్వింటాళ్ల బియ్యాన్ని మండలంలోని అన్ని గ్రామాల లో ఉన్న రేషన్ కార్డు లేని వారికి, వలస కార్మికులకు పంపిణీ చేసే విధంగా ప్రణాళికలు వేశారు తహసీల్దార్. మొత్తం 1333 కుటుంబాలకు కుటుంబానికి 10 కిలోల చొప్పున పంపిణీ చేసే కార్యక్రమాన్ని శనివారం రోజున పట్టణ కేంద్రంలో నకిరేకల్ శాసనసభ్యులు చిరుమర్తి లింగయ్య ప్రారంభించారు.

ఇతర మండలాల్లో కూడా ‘అక్షయ పాత్ర’ ను విస్తరిస్తాం:ఎమ్మెల్యే చిరుమర్తి

పేద వాళ్ళు పేదలకు సహాయాన్ని అందించడం అభినందనీయమని, ఈ కార్యక్రమాన్ని రూపొందించిన తహసిల్దార్ కృష్ణారెడ్డి అభినందనీయులని అన్నారు. ఇంత మంచి కార్యక్రమాన్ని నియోజకవర్గం లోని ఇతర మండలాల వారు కూడా అక్షయ పాత్ర కార్యక్రమాన్ని ఏర్పాటు చేసే విధంగా సూచనలు చేస్తానని అన్నారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కోమటిరెడ్డి చినవెంకటరెడ్డి, ఎం పి పి కొలను సునీత, తహసిల్దార్ కృష్ణారెడ్డి, కమీషనర్ ఏ ప్రభాకర్, వైస్ చైర్మన్ కూరేళ్ల లింగస్వామి, కౌన్సిలర్లు పందిరి గీత, బెల్లి సత్తయ్య, జిట్టా పద్మబొందెయ్య, సిలివేరు మౌనిక శేఖర్, నాయకులు జడల ఆదిమల్లయ్య, మెండే సైదులు, పాటి మాధవరెడ్డి, గుండెబోయిన సైదులు, పొన్నం లక్ష్మయ్య, పబ్బతి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

Related posts

ములాయం సింగ్ యాదవ్ ఇక లేరు

Satyam NEWS

వనపర్తి పోలీస్ ప్రజావాణిలో 10 ఫిర్యాదులు

Satyam NEWS

నవంబర్ 22న శ్రీ ధర్మ శాస్త్ర విగ్రహ ప్రతిష్టాపన

Satyam NEWS

Leave a Comment