ఎగువన కురుస్తున్న వర్షాలతో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. ఎగువనున్న ప్రాజెక్టులు నిండిపోవడంతో నీటిని వేగంగా కిందికి వదిలేస్తున్నారు. ప్రస్తుతం జూరాల ప్రాజెక్టు 57 గేట్లు ఎత్తివేశారు. నీటిని దిగువకు వదులుతున్నారు. వరద తాకిడితో ఇప్పటికే బీచుపల్లి రామాలయం నీట మునిగింది. అదే దారిలో తుందభద్ర నది కి వస్తున్న వరద కారణంగా కూడా పలు ప్రాంతాలు జలమయం అవుతున్నాయి. అలంపూర్ లోని జోగుళాంబ శక్తి పీఠానికి కూడా ముంపు ప్రమాదం వచ్చింది. దాంతో తుంగభద్ర ప్రాంతంలోని అన్ని ఆలయాలకు ప్రమాద హెచ్చరికలు జారీ అయ్యాయి. పరవళ్లు తొక్కుతూ కృష్ణమ్మ వస్తుండటంతో శ్రీశైలం నుంచి 3,93,827 క్యూసెక్కు ల నీటిని నాగార్జున సాగర్ కు వదులుతున్నారు. శ్రీశైలం కుడి జలవిద్యుత్ కేంద్రం ద్వారా 30,774 క్యూసెక్కులు నీటిని విడుదల చేస్తుండగా, ఎడమ జల విద్యుత్ కేంద్రం ద్వారా 42,378 క్యూసెక్కులు విడుదల అవుతున్నాయి. అదే విధంగా విద్యుత్ ఉత్పత్తి చేయకుండా క్రస్ట్‌గేట్స్ ద్వారా 3,20,655 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నారు. మొత్తంగా 3,93,807 క్యూసెక్కుల నీరు నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు వచ్చి చేరుతున్నది. ప్రస్తుత నాగార్జున సాగర్ జలాశయ నీటిమట్టం 525.30 అడుగులు గా ఉంది.
previous post
next post