మునిసిపల్ ఎన్నికల ఏర్పాట్లపై రాజంపేట మున్సిపల్ కమీషనర్ ఆఫీస్ లో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో తెలుగుదేశం పార్టీ నుంచి రాజంపేట టీడీపీ ఇంచార్జ్ బత్యాల చంగల్ రాయుడు, పట్టణ వార్డు కౌన్సిలర్లు పాల్గొన్నారు. ముందుగా బత్యాల మాట్లాడుతూ వార్డుల జాబితా తప్పుల తడకగా ఉందని లిస్ట్ తయారు చేసేటప్పుడు అన్ని రాజకీయ పార్టీలను సంప్రదించ వలసిన అవసరం ఉందని అన్నారు.
కానీ ఏ రాజకీయ పార్టీని సంప్రదించకుండా అధికారులు ఇష్టమొచ్చిన విధంగా తయారు చేశారని ఆయన అన్నారు. తెలుగుదేశం పార్టీ తరపున ఇచ్చిన ప్రతిపాదనలు ఏం చేశారని ఆయన ప్రశ్నించారు. వార్డుల జాబితాపై మొత్తం ఎన్ని అభ్యంతరాలు వచ్చాయి? వచ్చిన అభ్యంతరాలపై ఏం చర్యలు తీసుకున్నారని ఆయన ప్రశ్నించారు. బత్యాల ప్రశ్నలకు కమిషనర్ ఎటువంటి సమాధానం చెప్పలేదు. మీరు కమిషనర్ గా కాదు ఒక ఎలక్షన్ ఆఫీసర్ అని మర్చిపోవద్దు మేము పార్టీ తరుపున న్యాయం చేయమని అడగలేదు ప్రజల తరపున మాట్లాడుతున్నామని బత్యాల అన్నారు.
నిన్న సాయంత్రం 5 గంటలకు టైమ్ అయిపోయింది కానీ ఇంత వరకు వార్డుకు సంబంధించిన పోలింగ్ కేంద్రాల మీద ఎన్ని అభ్యర్థనలు వచ్చాయో కూడా మీకు తెలియలేదు ఇంకా పరిశీలించి ఏమి చేయదలుచుకున్నారని సూటిగా ప్రశ్నించారు. మున్సిపల్ కమిషనర్ వైపు నుంచి బత్యాల అడిగిన దానికి ఎటువంటి సమాధానం రాలేదు.
దాంతో తెలుగుదేశం పార్టీ ఈ సమావేశం నుంచి బాయ్ కాట్ చేశారు. తెలుగుదేశం తో బాటు జనసేన, సీపీఐ పార్టీల వారు కూడా బాయికట్ చేసి వెళ్లిపోయారు. కమిషనర్ ఎలాంటి సమాధానం చెప్పడంలేదని అందువల్ల ఈ అంశంపై న్యాయస్థానాలను ఆశ్రయిస్తామని బత్యాల తెలిపారు.
ఈ కార్యక్రమంలో బత్యాల తోపాటు మాజీ కౌన్సిలర్ మనుబోలు వెంకటేష్, రామచంద్రయ్య ఆచారి, గుగ్గిళ్ల చంద్రమౌళి, మన్నూరు రాజ, పబ్బిశెట్టి సుబ్రహ్మణ్యం, తోట మోహన్, రెడ్డయ్య, చిన్నయ్య, కరీముల్లా, రాంనగర్ నరసింహ, మందా శ్రీనివాసులు, పోలి శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.