జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాన్ని మూడుగా విభజించడం, అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్య పెంచడం, ఆర్టికల్ 370 రద్దు చేయడం, ఆర్టికల్ 35 ఏ కు సవరణ చేయడం లాంటి కార్యక్రమాలను తాము ఎట్టిపరిస్థితులలో అంగీకరించేది లేదని జమ్మూ కాశ్మీర్ కు చెందిన అఖిల పక్ష సమావేశం ముక్త కంఠంతో చెప్పింది. కాశ్మీర్ కు చెందిన అన్ని ప్రాంతీయ పార్టీలూ, కాంగ్రెస్, సిపిఎం పార్టీలు ఈ సమావేశంలో పాల్గొన్నాయి. సమావేశం మెహబూబా ముఫ్తీ ఇంట్లో జరగాల్సి ఉన్నా, ఫరూక్ అబ్దుల్లా అనారోగ్యం కారణంగా నేతలంతా ఆయన ఇంటికే వెళ్లి సమావేశమయ్యారు. ఈ సమావేశంలో మెహబూబా ముఫ్తీ (పిడిపి), ఒమర్ అబ్దుల్లా (నేషనల్ కాన్ఫరెన్స్), తాజ్ మెహియుద్దీన్ (కాంగ్రెస్ ) ముజఫర్ బేగ్ (పిడిపి) సాజిద్ లోన్, ఇమ్రాన్ అన్సారీ (పీపుల్స్ కాన్ఫరెన్స్) షా ఫేజల్ ( జె అండ్ కె పీపుల్స్ మూమెంట్ ) తరిగామి ( సిపిఎం) పాల్గొని ఒక సంయుక్త ప్రకటన విడుదల చేశారు. ఇది ఇలా ఉండగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆదివారం నాడు జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్ తో సమావేశమయ్యారు. కాశ్మీర్ లో చోటు చేసుకొన్న పరిణామాల నేపథ్యంలో ఈ సమావేశానికి ప్రాధాన్యత నెలకొంది. ఆదివారం నాడు మధ్యాహ్నం 12 :30 గంటలకు అమిత్ షా తో అజిత్ ధోవల్, ఇంటలిజెన్స్ చీఫ్ అరవింద్ కుమార్, రా చీఫ్ సుమంత్ గోయల్ సమావేశమయ్యారు. గత కొద్ది రోజులుగా కాశ్మీర్ లో సుమారు 35 వేల మంది పారా మిలటరీ బలగాలను మోహరించారు. కాశ్మీర్ పై కేంద్రం కీలక నిర్ణయం తీసుకొనే అవకాశం ఉందని చెబుతున్నారు. సోమవారం నాడు ఉదయం కేంద్ర కేబినెట్ సమావేశం కానుంది. ఈ సమావేశంలో జమ్మూ కాశ్మీర్ అంశమే ఎజెండా కానుందని సమాచారం.
previous post
next post