కరోనా వైరస్ సమస్య మొత్తం హైదరాబాద్ చుట్టూ మాత్రమే ఉంటుందని, ఇతర జిల్లాలో ఉండదని ముఖ్యమంత్రి కేసీఆర్ వెల్లడించారు. అంతర్జాతీయ ప్రయాణీకుల నుంచే వైరస్ వస్తున్నది అందువల్ల ఎయిర్ పోర్టులో 200 మంది సిబ్బంది తో స్క్రీనింగ్ చేస్తున్నామని తెలిపారు.
హైదరాబాద్ పరిసర ప్రాంతాలలో 1020 బెడ్స్ అందుబాటులో ఉన్నాయని, 321 ఇంటెన్సివ్ కేర్ యూనిట్ బెడ్స్ కూడా అందుబాటులో ఉంచామని ఆయన అన్నారు. ప్రగతి భవన్ లో నేడు ఆయన మీడియా సమావేశంలో కరోనా వైరస్ కు సంబంధించిన పలు అంశాలను వెల్లడించారు.
240 వెంటిలేటర్ సిద్ధంగా ఉంచామని క్వారంటైన్ హాస్పిటల్ సిద్ధంగా ఉంచామని ముఖ్యమంత్రి తెలిపారు. అదే విధంగా ఇలాంటివి రాష్ట్రంలో 4 అందుబాటులో ఉంచామని ఆయన తెలిపారు. పంచాయతీ రాజ్, మున్సిపల్, ఫారెస్ట్ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేశామని, ఆరోగ్య శాఖ మంత్రి ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తున్నారని సిఎం కేసీఆర్ తెలిపారు.
ఆర్టీసీ బస్, మెట్రో రైల్ లు యధావిధిగా నడుస్తాయని ఆయన తెలిపారు. షాపింగ్ యథావిధిగా కొనసాగించవచ్చునని అయితే ఎక్కువ సేపు బహిరంగ ప్రదేశాలలో ఉండకుండా ప్రజలే జాగ్రత్త తీసుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు. సినిమా హాల్స్, క్లబ్ లు మూసివేయాలని ఆయన తెలిపారు.