రాజధాని ప్రాంతానికి చెందిన రైతులు తమ ఆందోళనలు ఉధృతం చేస్తూనే ఉన్నారు. రాజధాని రైతుల పోరు శుక్రవారానికి 38వ రోజుకు చేరుకుంది. నేడు మందడం, తుళ్లూరుల్లో రైతులు మహా ధర్నాలు నిర్వహించనున్నారు. వెలగపూడి, కృష్ణాయపాలెంలో 34వ రోజు రైతు రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు.
ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన చేసిన ఉద్దండరాయుని పాలెంలో వివిధ గ్రామాలకు చెందిన రైతులు నిరసన వ్యక్తం చేశారు. మహిళలు ఆ ప్రాంతాలలో పూజలు చేస్తున్నారు. నవులూరు, నిడమర్రు, ఎర్రబాలెం ఇతర రాజధాని గ్రామాల్లో రైతు నిరసనలు కొనసాగనున్నాయి. కృష్ణ, గుంటూరు, ప్రకాశం, గోదావరి జిల్లాల్లో ప్రజాసంఘాలు, రాజకీయపక్షాలు ఆందోళనలు కొనసాగిస్తున్నాయి.