హైదరాబాద్ లో తాను చేసిన అభివృద్ధి కారణంగానే పంచంలోనే అతిపెద్దదైన అమెజాన్ కార్యాలయం అక్కడ ఏర్పాటు చేశారని ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబునాయుడు అన్నారు. అమరావతిలోని రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఖమ్మం జిల్లా కార్యకర్తలతో సమావేశమైన చంద్రబాబు నాయుడు హైదరాబాద్ అభివృద్ధిలో తన పాత్ర గురించి చెప్పారు. తాను ఎయిర్ పోర్టు కోసం ఐదు వేల ఎకరాలు ఇస్తే ఎగతాళి చేశారని అయితే ఇప్పుడు అదే తలమానికంగా నిలిచిందని ఆయన అన్నారు. హైదరాబాద్ లో అప్పుడు తాను చేసిన కార్యక్రమాల వలన ఇప్పుడు ప్రపంచ స్థాయి సంస్థలు అక్కడకు వస్తున్నాయని చంద్రబాబునాయుడు అన్నారు. భావితరాల కోసం తాను హైదరాబాద్ అభివృద్ధి చేశానని ఆయన అన్నారు. అదే విధంగా భావితరాలకు ఆదాయాన్ని చేకూర్చాలని అమరావతి నిర్మాణానికి శ్రీకారం చుట్టామని, ఒక్క అవకాశం అంటు మూడు నెలల్లో చేయాల్సిన వన్నీ చేసి రాష్ట్రాన్ని ఇబ్బందుల్లో పడేశారని చంద్రబాబునాయుడు అన్నారు. పైసా తీసుకోకుండా రైతులు భూములు ఇస్తే ఇన్ సైడ్ ట్రేడింగ్ అంటూ దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన అన్నారు. ఎపి,తెలంగాణా రాష్ట్రాలలో టిడిపి వుండడం చారిత్రాత్మక అవసరమని, తెలుగు జాతి ఎక్కడ కష్టాల్లో వున్నా టిడిపి వాళ్ళకు అండగా వుంటుందని ఆయన అన్నారు.
previous post