Slider సంపాదకీయం

ట్రంప్ డ్రామాలకు మనం బలి కాకూడదు

trumpshutdownraises

ప్రతి విషయంలోనూ భారత్ పాకిస్తాన్ లలో ఎవరిది పైచేయి అని లెక్క పెట్టుకోవడం తప్ప అమెరికా పరోక్ష జోక్యాన్ని గుర్తించలేకపోతున్నాం. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఇద్దరు ప్రధానులతో మాట్లాడటం, తీర్పు చెప్పడం ఆ తీర్పులో పాకిస్తాన్ ను తప్పు పట్టడం తో మన దేశంలోని చాలా మంది ఆహా అమెరికా అధ్యక్షుడు కూడా పాకిస్తాన్ ప్రదాని ఇమ్రాన్ ఖాన్ కు చీవాట్లు పెట్టాడు అని సంతోషపడుతున్నారు. అయితే పాకిస్తాన్ ప్రధానికి అమెరికా అధ్యక్షుడు చీవాట్లు పెట్టడం ఏమిటి? మనం సంతోష పడటం ఏమిటి? ఇదే డోనాల్డ్ ట్రంప్ జమ్మూ కాశ్మీర్ విషయంలో భారత్ పాక్ లు కోరుకుంటే మధ్యవర్తిత్వానికి సిద్ధం అని కొద్ది రోజుల కిందటే ప్రకటించాడు. మధ్యవర్తిత్వానికి భారత్ తిరస్కరించింది. అయితే ట్రంప్ మధ్యవర్తిత్వం చేస్తూనే ఉన్నాడు. మనం అమెరికా ట్రాప్ లో పడుతూనే ఉన్నాము. ఆసియా ఖండంలో శాంతి కోసం మా ప్రయత్నం అంటూ అమెరికా సన్నాయి నొక్కులు నొక్కుతూ ఉంటుంది. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన ఈ 70 ఏళ్లలో ప్రస్తుత దశకంలో ఉన్నంత బలంగా భారత్ గతంలో లేదు. భారత్ ఆర్ధికంగా, రాజకీయంగా బలహీనంగా ఉన్న సమయంలో అమెరికా, రష్యాలు పెద్దన్నల పాత్ర పోషించడం ప్రపంచ దేశాలన్నీ ఏదో ఒక కూటమిలో ఉండాల్సి రావడం చూశాం. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. సోవియట్ రష్యా పతనం తర్వాత మరిన్ని శక్తులు ఏర్పడ్డాయి. అందులో భారత్ కూడా ఒకటి. అలాంటప్పుడు ఇంకా అమెరికా పెద్దన్న పాత్ర ను ఎందుకు భరించాలి. డోనాల్డ్ ట్రంప్ లాంటి స్వల్పకాలిక లాభాలు ఆశించే ఫక్తురాజకీయ నాయకుడికి ఇంత ప్రాధాన్యం ఎందుకు ఇవ్వాలి? వాణిజ్య అవసరాల పేరుతో లొంగిపోతే మనకే నష్టం. ట్రంప్ అధికారంలోకి వచ్చిన కొత్తలో తన దేశాన్ని సరిదద్దుకోవడంలోనో, చెడగొట్టుకోవడంలోనో బిజీగా ఉన్నాడు. ఇప్పుడు ట్రంప్ ప్రపంచ దేశాల విషయాల్లో జోక్యం ఎక్కువగా చేసుకుంటున్నాడు. పాకిస్తాన్ కు ఎఫ్ 16 విమానాలను గతంలో అమెరికా సమకూర్చింది. వాటిని ఉగ్రవాదానికి వ్యతిరేకంగా వాడాలి. అయితే పాకిస్తాన్ భారత్ పై వాడుతున్నది. దీనికి సంబంధించిన పలు ఆధారాలను భారత్ అమెరికాకు సమర్పించింది. అయినా సరే అమెరికా పాకిస్తాన్ కు ఎఫ్ 16 విడిభాగాలను ఆపకుండా సరఫరా చేస్తూనే ఉంది. గతంలో ఆగిపోయిన ఆర్ధిక సాయాన్ని అమెరికా పాకిస్తాన్ కు మళ్లీ పునరుద్ధరించబోతున్నట్లు కూడా వార్తలు వెలువడుతున్నాయి. ఆఫ్ఘనిస్తాన్ లో ఎడతెగని పోరాటం చేస్తున్న అమెరికా సాధించేది ఏదీ లేదని అర్ధం అయిన తర్వాత ఆ పోరాటం నుంచి గౌరవ ప్రదంగా తప్పుకోవడానికి పావులు కదుపుతున్నది. దీని కోసం పాకిస్తాన్ సాయం అమెరికాకు అత్యవసరం. ఈ నేపథ్యంలోనే ఒక సారి భారత్ వైపు, మరో సారి పాకిస్తాన్ వైపు ట్రంప్ మాట్లాడుతున్నాడు. ఈ ఆటలో  పావులమైతే మన ప్రధాని కూడా ట్రంప్ చేతిలో ఇమ్రాన్ ఖాన్ లాగా కీలుబొమ్మగా మారాల్సి వస్తుంది. అందుకోసం అమెరికా తో ఆచితూచి మాట్లాడాల్సి ఉంటుంది. జమ్మూకాశ్మీర్ కు సంబంధించిన ఆర్టికల్ 370 రద్దు అంశంపై అమెరికా జోక్యానికి ఎట్టి పరిస్థితుల్లో అనుమతించకూడదు. పరోక్షంగానైనాసరే. అమెరికా అధ్యక్షుడు పాకిస్తాన్ కు వ్యతిరేకంగా మాట్లాడినంత మాత్రాన భారత్ కుఅనుకూలం కాదు. ఇది కేవలం ట్రంప్ ఆడే నాటకం మాత్రమే. అమెరికాకు చిత్తశుద్ధి ఉంటే పాకిస్తాన్ కు యుద్ధ విమానాలు సరఫరా చేయడం, ఆర్ధిక సాయాన్ని పునరుద్ధరించడం ఆపాలి. అంతే కానీ నోటితో తిడుతూ చేత్తో పెడుతూ ఉంటే లాభం లేదు.

Related posts

కృష్ణాయపాలెం రైతుల నిరసన దీక్షలో హీరో శివాజీ

Satyam NEWS

“థ్రిల్లర్ స్పెషలిస్ట్ గా పేరు తెచ్చుకోవాలన్నదే నా కోరిక”

Satyam NEWS

వి ఎస్ యూ పరీక్ష నియంత్రణ అధికారి గా డా. ఆర్.ప్రభాకర్

Satyam NEWS

Leave a Comment