ఈ ప్రశ్న ఇప్పుడు తాజాగా పుట్టుకొచ్చింది. హిందీ భాషా దినోత్సవం సందర్భంగా బీజేపీ చీఫ్, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా చేసిన ట్వీట్ తర్వాత ఈ వివాదం పెద్ద ఎత్తున చెలరేగుతున్నది. దీని పై ప్రతిపక్షాలు కూడా తీవ్రస్థాయిలో మండిపడుతున్నాయి. భారత్ ఐక్యంగా ఉండాలంటే హిందీ వల్లే సాధ్యమనీ, కాబట్టి ప్రజలంతా హిందీని ప్రోత్సహించాలని అమిత్ షా హిందీ భాషా దినోత్సవం సందర్భంగా పిలుపునిచ్చారు. భారత్‌లో ఒకే భాష ఉండాలనీ, అప్పుడే దేశం ఐక్యంగా ఉంటుందని ఆయన అనడం దక్షిణాది రాష్ట్రాలకు పుండపై కారం రాసినట్లుగా అయింది.
ప్రపంచంలో భారత్‌కు ఒక ప్రత్యేక గుర్తింపు ఉండాలంటే ఒకే భాషా ఉండాలనే అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేయడం ప్రజాస్వామ్య ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధం. దేశ రాజ్యాంగ ఆదేశిక సూత్రాలకు వ్యతిరేకం అని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ సందర్భంగా భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 29 ప్రతీభారతీయుడికి భాషా, సాంస్కృతిక హక్కును కల్పిస్తోందని గుర్తు చేస్తూ ట్వీట్ చేశారు అసదుద్దీన్ ఒవైసీ. మీరు(అమిత్ షా) కనీసం మన దేశపు బహుళత్వపు అందాన్ని, పలు మాతృభాషలు ఉండటాన్ని హర్షించరా? అని కూడా ఆయన ప్రశ్నించారు.
మరోవైపు అమిత్ షా వ్యాఖ్యలను తమిళనాడు ప్రతిపక్ష నేత, డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ కౌంటర్ ఇచ్చారు.. చెన్నైలో మీడియాతో మాట్లాడిన ఆయన.. తమిళులపై హిందీని బలవంతంగా రుద్దడానికి జరుగుతున్న ప్రయత్నాలను తాము వ్యతిరేకిస్తూనే ఉన్నామని స్పష్టం చేశారు. అమిత్‌షా ఇలాంటి వ్యాఖ్యలతో భారత సమగ్రత, ఐక్యతకు ప్రమాదం ఏర్పడుతుందని హెచ్చరించారు. కాబట్టి తన వ్యాఖ్యలను షా వెంటనే వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఎల్లుండి తాము డీఎంకే కార్యనిర్వాహక సమావేశాన్ని నిర్వహిస్తున్నామనీ, అందులో అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై చర్చిస్తామని పేర్కొన్నారు. దీంతో.. హిందీ భాషా దినోత్సవం సందర్భంగా హోంశాఖ మంత్రి చేసిన వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేగుతోంది.