జగన్ మోహన్ రెడ్డి ఈ మధ్య ఇండియా కూటమి పార్టీలతో కాస్త దగ్గరగా వ్యవహరించడం చర్చనీయాంశం అయిన సంగతి తెలిసిందే. ఏపీలో శాంతి భద్రతల పేరుతో ఢిల్లీ చేసిన దీక్షలో భాగంగా ఇండియా కూటమి పార్టీలతో అంటకాగారు. దీంతో జగన్ రెడ్డి పూర్తిగా ఇండియా కూటమిలో చేరతారని ప్రచారం జరిగింది. కానీ, తాజా సమాచారం ప్రకారం.. జగన్ రెండు కూటములకు సమదూరం పాటించే వ్యూహాన్ని ప్లాన్ చేస్తున్నట్లుగా చెబుతున్నారు.
ఇప్పటికే పార్లమెంటులో ఎన్డీయేకు జగన్ రెడ్డి సంపూర్ణంగా మద్దతు పలుకుతున్నారు. మరోవైపు, ఢిల్లీలో జగన్ చేపట్టిన దీక్షకు ఇండియా కూటమి పార్టీలను ఆహ్వానించారు. వారు కూడా జగన్ కు సహకరించారు. ఇలా రెండు పడవలపై కాళ్లు పెట్టి జగన్ ప్రయాణం చేస్తున్నారు. ఏపీలో ఓడిపోవడమే కాకుండా.. కేవలం 11 సీట్లతో సరిపెట్టుకోవడంతో ఇప్పుడు జగన్ రెడ్డిని పట్టించుకునేవారే లేరు. ఒంటరి అయిపోయినట్లుగా ఫీల్ అవుతున్నారు. అందుకే ఇలా రెండు కూటములతోనూ సమదూరం పాటిస్తున్నట్లుగా చెబుతున్నారు.
జగన్ కు ఇండియా కూటమి నేతలు ఢిల్లీలో మద్దతు పలికిన వెంటనే అనేక విశ్లేషణలు తెరపైకి వచ్చాయి. ముందుగా సమాజ్ వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ జగన్ ను కలవగా.. అఖిలేష్ ద్వారా ఇండియా కూటమిలో చేరేందుకు వైసీపీ అధినేత రాయబారం పంపారని వార్తలు వచ్చాయి. అదీకాక, అటు విజయసాయి రెడ్డి ఇటీవల పార్లమెంటులో మాట్లాడుతూ.. డిప్యూటీ స్పీకర్ పదవి విపక్షాలకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. మొన్నటిదాకా ఎన్డీఏతో అంటకాగిన విజయసాయి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశం అయింది. మోదీ ప్రభుత్వానికి తాము సహకరించినప్పటికీ వారు తమను పట్టించుకోబోరనే ఉద్దేశంతోనే జగన్ ఇండియా కూటమి వైపు జరిగినట్లుగా భావించారు.
అయితే, ఇలా జగన్ రెండు కూటములకు సమదూరం పాటిస్తుండడాన్ని మోదీ – షాలు గమనించినట్లు తెలిసింది. ఇండియా కూటమితో జగన్ సఖ్యత ప్రదర్శించడాన్ని వారు సహించనట్లుగా సమాచారం. ఈ విషయంపై ఇప్పటికే కేంద్ర పెద్దలనుంచి జగన్ కు వార్నింగ్ సంకేతాలు కూడా వెళ్లినట్లుగా చెబుతున్నారు. కీలక బిల్లుల సమయంలో జగన్.. ఎన్డీఏకు సహకరించపోతే పరిస్థితులు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించినట్లు తెలిసింది.