27.2 C
Hyderabad
October 21, 2020 18: 36 PM
జాతీయం

Analysis: సాగుకు సాయం ఆధునిక వ్యవసాయం

#Narendra Modi

భారతదేశం వంటి వ్యవసాయాధారిత దేశానికి రైతువెన్నెముక. 70శాతానికి పైగా దేశ ప్రజలు వ్యవసాయం దాని అనుబంధ పరిశ్రమలపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు.

కరోనా విఘాతం కారణంగా జీడీపీ లెక్కలు కుప్పకూలిపోవడం ద్వారా ఆర్థిక మాంద్యం ఆవరించుకున్న నేపథ్యంలో వ్యవసాయం ఒక్కటే మిగిలిన ఆశ కలిగిస్తోంది. ఇటువంటి సంక్షోభ సమయంలో కూడా వ్యవసాయం దాని అనుబంధ రంగాలు 3.4 వృద్ధి నమోదు చేయడం ఆనంద దాయకం.

కోట్లాది మందికి ఉపాధి దూరం

సెంటర్ ఫర్ మానిటరింగ్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ అంచనా ప్రకారం దాదాపు 2 కోట్లమంది వేతనజీవులు, మరొక 70 లక్షల మంది రోజు కూలీలు గత 5 నెలల్లో ఉపాధి కోల్పోయినట్లు తెలుస్తోంది.

వారిలో వ్యవసాయకార్మికుల సంఖ్య కూడా గణనీయంగానే ఉందని అంచనా. నగరాలనుంచి తిరిగి గ్రామాలబాట పట్టినవారిలో 70శాతం మంది  వ్యవసాయపనుల్లో నిమగ్నం కావడం గమనార్హం.

ప్రస్తుత క్లిష్టదశలో  వ్యవసాయ రంగాన్ని ఆర్థిక పునరుత్తేజిత వనరుగా మార్చుకునే ఆవశ్యకతను ప్రభుత్వం గుర్తించాల్సి ఉందని ఆర్థిక వేత్తలు అంటున్నారు.

వ్యవసాయమే అతిపెద్ద ఉద్యోగకల్పన శక్తిగా పరిణమించనుందని స్పష్టం చేస్తున్నారు. కోవిడ్ – 19 దశను అధిగమించిన తరువాత గ్రామీణ జీవితాలను బలోపేతం చేసే అవకాశాలపై దృష్టి సారించాలని వారు సూచించారు.

రైతు సాధికారత తక్షణ అవసరం

లాక్ డవున్ కారణంగా కుదేలైన వ్యవసాయరంగాన్ని ఆదుకునేందుకు లక్షకోట్ల రూపాయలతో వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధిని కేంద్రప్రభుత్వం  ప్రకటించింది.

రైతులకు సాధికారత లక్ష్యంగా ప్రభుత్వం ప్రగతిశీల సంక్షేమ పథకాలు అమలు చేయడానికి కృతనిశ్చయంతో ఉన్నట్లు కేంద్రం తెలిపింది.

అందుకు అనుగుణంగా రూ.74,300 కోట్ల విలువైన పంటలను కనీసమద్దతు ధరకు కొనడం , ప్రధానమంత్రి కిసాన్ పథకం క్రింద రూ.18,700 కోట్లు రైతులకు బదిలీ చేయడం, పంటల బీమా పథకానికి రూ.6400 కోట్లు ఇవ్వడం వంటివి రైతులపట్ల ప్రభుత్వానికి ఉన్న నిబద్ధతకు నిదర్శనమని ప్రభుత్వం చెబుతోంది.

వ్యవసాయ సంస్కరణలో భాగంగా 3 బిల్లులను లోకసభలో ప్రవేశపెట్టి ఊహించినట్లుగానే మోదీ ప్రభుత్వం ఆమోదం పొందగలిగింది. దీనిపై ప్రధాని హర్షం వ్యక్తం చేస్తూ…ఈ ప్రతిపాదిత చట్టాలతో రైతుల ఆదాయం పెరుగుతుందని, రైతులకు దళారీల బెడద తొలగుతుందని ఆశాభావం ప్రకటించారు.

విపక్షాల తీవ్ర వ్యతిరేకత

ఇప్పుడున్న తరహాలోనే ప్రభత్వ కొనుగోలు విధానాలు కొనసాగుతాయని రైతులకు మోదీ హామీ ఇచ్చారు. రైతుల సాధికారత లక్ష్యంగా చేపట్టిన సంస్కరణలపై రైతులను తప్పుదోవ పట్టించాలని అభివృద్ధి నిరోధక శక్తులు ప్రయత్నించడం దురదృష్టమని ఆయన అన్నారు.

అయితే…. కేంద్రం ప్రవేశ పెట్టిన ఈ 3 బిల్లులను విపక్షాలు, రైతు సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. పంజాబ్, ఉత్తరప్రదేశ్, ఒడిశా, హరియాణా, తెలంగాణా రాష్ట్ర రైతులు వీటిని వ్యతిరేకిస్తూ ఆందోళన లు చేపట్టారు. వ్యవసాయాన్ని కార్పోరేట్ వ్యవస్థచేతిలో బందీ చేయడానికి మోదీ ప్రభుత్వం కుట్రపన్నుతోందని రైతుసంఘాలు  ఆరోపిస్తున్నారు.

మూడు బిల్లులను వెనక్కు తీసుకోవాలని, మండీ వ్యవస్థను కొనసాగించాలని, రుణ మాఫీ చేయాలని, ప్రొ. స్వామినాథన్ సిఫార్సల మేరకు పంటలకు కనీస మద్దతు ధర ఇవ్వాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఈ బిల్లులు చట్ట రూపమైతే బడా వ్యాపారస్తుల కనికరంపై రైతులజీవనం ఆధారపడాల్సివస్తుందని వారు నిరసన వ్యక్తం చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో… ఎన్ డీఏ ప్రభుత్వంలో రాజకీయ ప్రకంపనలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా …వ్యవసాయ రంగానికి సంబంధించిన బిల్లులకు వ్యతిరేకంగా శిరోమణి అకాలీదళ్( ఎస్ ఏ డి) నేత, కేంద్రమంత్రి హర్ సిమ్రత్ కౌర్ బాదల్ తన మంత్రి పదవికి రాజీనామా చేయడంతో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి.

ప్రభుత్వం లో కొనసాగే విషయంలో నిర్ణయం తీసుకుంటామని ఎస్ ఏ డి వర్గాలు అంటున్నాయి. గతంలో జారీచేసిన ఆర్డినెన్స్ స్థానంలో ఈ బిల్లులను కేంద్రం సభలో ప్రవేశ పెట్టింది.

రాజ్యసభలో ఆమోదం పొందాల్సివుంది. ఈ మూడుబిల్లుల ఆమోదానికి వ్యతిరేకంగా సెప్టెంబర్ 25 న దేశవ్యాప్త నిరసన వ్యక్తంచేయాలని అఖిలభారత రైతు సంఘం ప్రతినిధులు ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేస్తున్నారు.

తెలుగురాష్ట్రాల విషయానికి వస్తే  ..వివాదాస్పద మూడు బిల్లులకు వై ఎస్ ఆర్ పార్టీ ప్రభుత్వం మద్దతు ఇవ్వగా….తెరాస ప్రభుత్వం సభనుంచి వాకౌట్ చేసి వ్యతిరేకిత తెలిపింది.

రైతు సాధికారత లక్ష్యంగా ప్రభుత్వం చేపడుతున్న వ్యవసాయ సంస్కరణల బిల్లులు ఏ మేరకు రైతులోకానికి మేలు చేయగలవో కాలమే నిర్ణయించాలి.

పొలమరశెట్టి కృష్ణారావు

Related posts

అర్నబ్ గోస్వామిపై రూ.200 కోట్ల పరువునష్టం

Satyam NEWS

బసవతత్వానుభవ మంటప ఉత్సవంలో పాల్గొన్న హరిష్

Satyam NEWS

Special Story: విశాఖ పోర్ట్ పైనా కరోనా ప్రభావం

Satyam NEWS

Leave a Comment